న్యూఢిల్లీ: వొడాఫోన్ ఐడియా లిమిటెడ్ (వీఐఎల్) ‘వీఐ’ బ్రాండ్‌తో వినియోగదారులను ఇక మీదట పలకరించనుంది. టెలికం మార్కెట్‌లో వాటా పెంచుకునే లక్ష్యంతో, మరింత మంది చందాదారులను ఆకర్షించడం ద్వారా నెట్‌వర్క్ బలోపేతం లక్ష్యాలతో నూతన బ్రాండ్ వీఐను సోమవారం కంపెనీ ఆవిష్కరించింది. వొడాఫోన్, ఐడియా బ్రాండ్లను ఇకమీదట వీఐగా పిలవనున్నట్టు కంపెనీ ప్రకటించింది. జూన్ చివరికి 28 కోట్ల చందాదారులు వొడాఫోన్ ఐడియా నెట్‌వర్క్ పరిధిలో ఉన్నారు. ఏజీఆర్ బకాయిల చెల్లింపులపై పదేళ్ల గడువు ఇస్తూ సుప్రీంకోర్టు తీర్పు జారీ చేసిన వారం వ్యవధిలోనే వొడాఫోన్ ఐడియా నూతన బ్రాండ్‌తో మార్పు దిశగా అడుగువేసింది. అంతేకాదు, రూ.25,000 కోట్ల నిధుల సమీకరణకు బోర్డు గత వారం నిర్ణయించిన విషయం తెలిసిందే.
100 కోట్ల మందికి 4జీ సేవలు
‘‘రెండేళ్ల క్రితం విలీనం ద్వారా వొడాఫోన్ ఐడియా ఏర్పడింది. అప్పటి నుంచి రెండు అతిపెద్ద నెట్‌వర్క్‌లు, ఉద్యోగులు, ప్రక్రియల ఏకీకరణపై దృష్టి పెట్టాము. భవిష్యత్తుపై దృష్టితో కస్టమర్ల కోసం రూపొందించిన బ్రాండ్ వీఐ. రెండు బ్రాండ్ల ఏకీకరణతో ప్రపంచంలోనే అతిపెద్ద టెలికం విలీనం పూర్తయింది. అంతేకాదు 4జీ నెట్‌వర్క్‌పై 100 కోట్ల భారతీయులకు బలమైన డిజిటల్ సేవలు అందించేందుకు, భవిష్యత్తు ప్రయాణానికి వీలుగా కంపెనీ సిద్ధమైంది’’అంటూ వీఐ బ్రాండ్‌ను వర్చువల్‌గా ఆవిష్కరించిన సందర్భంగా కంపెనీ ఎండీ, సీఈవో రవీందర్ టక్కర్ పేర్కొన్నారు.
చార్జీలు పెంచాల్సిందే..
గత కాలపు బకాయిల చెల్లింపులకు టెలికం కంపెనీలకు సుప్రీంకోర్టు పదేళ్ల గడువు ఇవ్వడాన్ని సానుకూల పరిణామంగా వొడాఫోన్ ఐడియా అభివర్ణించింది. పరిశ్రమ మనుగడ సాగించాలంటే మొబైల్ టారిఫ్‌లను పెంచాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. అదనపు టారిఫ్‌లు (చార్జీలు) చెల్లించేందుకు వినియోగదారులు సిద్ధంగా ఉన్నారని, గతంలో చెల్లించిన మాదిరే (జియో రాక పూర్వం) ఉండొచ్చని టక్కర్ పేర్కొన్నారు. తొలుత రూ.200కు, అనంతరం రూ.300కు టారిఫ్‌లు పెరగడం తప్పనిసరి అన్నారు. చార్జీలు పెంచేందుకు తాము సంకోచించడం లేదని.. ఇదే సరైన తరుణమని భావిస్తే ఆ దిశగా నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. భారతీ ఎయిర్‌టెల్ చైర్మన్ సునీల్‌మిట్టల్ సైతం ఇదే విధమైన ప్రకటనను ఇటీవలే చేసిన విషయం గమనార్హం.
ఏజీఆర్, ఇతర బకాయిల రూపంలో వొడాఫోన్ ఐడియా టెలికం శాఖకు రూ.58,000 కోట్లను చెల్లించాల్సి ఉండగా, ఇప్పటికి రూ.7,000 కోట్లకు పైగా చెల్లింపులు చేసింది. పదేళ్ల గడువు ఇవ్వడంతో కంపెనీకి పెద్ద ఉపశమనే లభించినట్టయింది. తాము ఇప్పటికే 10 శాతం చెల్లించేశామని, కనుక తదుపరి చెల్లింపులు 2020 మార్చిలోనే చేయాల్సి ఉంటుందని టక్కర్ స్పష్టం చేశారు. మొత్తానికి కోర్టు తీర్పు పట్ల తాము సంతోషంగా ఉన్నామని చెప్పారు. రూ.25వేల కోట్ల నిధుల సమీకరణకు బోర్డు నిర్ణయం తీసుకోగా.. ఇండస్‌టవర్స్‌లో తనకున్న వాటాను విక్రయించే ప్రణాళికతో ఉంది. ఫైబర్, డేటా సెంటర్ల ఆస్తుల విక్రయంతోనూ నిధులు సమీకరించాలనుకుంటోంది. తదుపరి నిధుల సమీకరణలో ప్రమోటర్ సంస్థ వొడాఫోన్ గ్రూపు కూడా పాల్గొనే ఉద్దేశ్యం ఉందా..? అన్న ప్రశ్నకు.. దీనిపై వారు నిర్ణయం తీసుకోవాల్సి ఉందని టక్కర్ స్పష్టం చేశారు.
రుణ పరిమితి రూ. లక్ష కోట్లకు..?
రుణాల పరిమితిని రూ.లక్ష కోట్లకు పెంచుకునేందుకు ఈ నెల 30న జరిగే సమావేశంలో వాటాదారుల ఆమోదం కోరనున్నట్టు వొడాఫోన్ ఐడియా తెలిపింది. వాస్తవానికి రూ.25,000 కోట్ల రుణ సమీకరణ పరిమితికి 2014 సెప్టెంబర్‌లో అప్పటి ఐడియా సెల్యులర్ వాటాదారులు ఆమోదం తెలిపారు. అనంతరం ఐడియా సెల్యులర్, వొడాఫోన్ ఐడియాతో వీలీనమైన విషయం తెలిసిందే. ఇండస్‌టవర్స్‌తో పదేళ్ల మాస్టర్ సర్వీస్ అగ్రిమెంట్‌కు సైతం వాటాదారుల ఆమోదం కోరనుంది.
డిజిటల్ ఎకానమీకి తోడ్పాటు...
దేశవ్యాప్తంగా 5 లక్షల గ్రామాల్లో 120 కోట్ల భారతీయులు వాయిస్, డేటా సేవలను ప్రపంచంలోనే అతి తక్కువ టారిఫ్‌లకు పొందుతున్నారు. ‘వీఐ’ బ్రాండ్‌తో భారత్‌ను డిజిటల్ ఆర్థిక వ్యవస్థ దిశగా నడిపించేందుకు ప్రభుత్వంతో భాగస్వామ్యం అయ్యేందుకు కట్టుబడి ఉన్నాము.
– వొడాఫోన్ ఐడియా చైర్మన్
కుమారమంగళం బిర్లా
రెండు నెట్‌వర్క్‌ల ఏకీకరణ పూర్తయింది. నూతన ప్రయాణం ఆరంభానికి సమయం వచ్చింది.
– వొడాఫోన్ గ్రూపు
సీఈవో నిక్‌రీడ్
Comments
Please login to add a commentAdd a comment