
న్యూఢిల్లీ: టెలికం రంగంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ (వ్యాపార నిర్వహణ సులభంగా ఉండటం) పరిస్థితులు లేవని సెల్యులర్ ఆపరేటర్స్ సమాఖ్య సీవోఏఐ పేర్కొంది. నెట్‌వర్క్ ఏర్పాటుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన నిబంధనలు కిందిస్థాయిల్లో అమలు కావడం లేదని సీవోఏఐ డైరెక్టర్ జనరల్ రాజన్ ఎస్ మాథ్యూస్ తెలిపారు. పురపాలక సంఘాలు, పంచాయతీలు కేంద్ర ప్రభుత్వం రూపొందించిన నిబంధనలను అనుసరించడంలేదని, టెలికం నెట్‌వర్క్ ఏర్పాటుకు అడ్డంకులు సృష్టిస్తున్నాయని పేర్కొన్నారు.
‘బెంగళూరులో ఆప్టికల్ ఫైబర్ కేబుల్ ఏర్పాటుకు ఒక ప్రాంతాన్ని తవ్వాలనుకున్నాం. మార్కెట్ ధరకు సమానమైన మొత్తాన్ని చెల్లిస్తామని తెలిపాం. కానీ వారు చాలా ఎక్కువ మొత్తాన్ని డిమాండ్ చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో వ్యాపారం చేయడం ఎలా సాధ్యమౌతుంది’ అని ప్రశ్నించారు. ‘కొన్ని రాష్ట్రాలు టెలికం నెట్‌వర్క్స్ ఏర్పాటుకు అనువుగా ఉండే పాలసీలు కలిగి ఉన్నాయి. వీటితో సమస్య లేదు. అయితే ఇతర రాష్ట్రాల్లో సమస్య ఉంది’ అని తెలిపారు.
టెలికం విభాగం నోటిఫై చేసిన నిబంధనలను ఒడిశా, హరియాణ, రాజస్థాన్ రాష్ట్రాలు అనుసరిస్తున్నాయని, ఉత్తర ప్రదేశ్, అస్సాం రాష్ట్రాలు కూడా త్వరలో ఈ జాబితాలో చేరొచ్చన్నారు. కాల్ డ్రాప్స్ కట్టడికి టెలికం కంపెనీలు భారీగా పెట్టుబడులు పెడుతున్నాయని తెలిపారు. కాల్ డ్రాప్స్‌కి టెలికం నెట్‌వర్క్స్ మాత్రమే కారణం కాదని, ఇతర అంశాల ప్రభావం కూడా ఉంటుందన్నారు. అయితే నిబంధనలు ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకోవడం లేదని తెలిపారు. 2జీ, 3జీ టెక్నాలజీలో కన్నా వీవోఎల్‌టీఈ వంటి డేటా ఆధారిత నెట్‌వర్క్స్‌లో కాల్ డ్రాప్స్ సమస్యలు ఎక్కువగా ఉంటాయని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment