న్యూఢిల్లీ: డిజిటల్ కమ్యూనికేషన్స్ రంగంలో లక్షల సంఖ్యలో ఉద్యోగాల కల్పనతో పాటు భారీగా పెట్టుబడులను రప్పించటమే లక్ష్యంగా కొత్త టెలికం విధానం (ఎన్‌టీపీ) ముసాయిదా రూపొందింది. 2022 నాటికల్లా ఈ రంగంలో 40 లక్షల ఉద్యోగాలు కొత్తగా కల్పించాలని, 5జీ సర్వీసులు ప్రవేశపెట్టడంతో పాటు 50 ఎంబీపీఎస్ వేగంతో అందరికీ బ్రాడ్‌బ్యాండ్ సేవలు అందుబాటులోకి తేవాలని టెలికం శాఖ ఇందులో ప్రతిపాదించింది. అలాగే నియంత్రణపరమైన సంస్కరణలతో డిజిటల్ కమ్యూనికేషన్స్ రంగంలో 2022 నాటికి 100 బిలియన్ డాలర్ల పెట్టుబడులను ఆకర్షించాలని నిర్దేశించుకుంది. ‘జాతీయ డిజిటల్ కమ్యూనికేషన్స్ విధానం 2018’ పేరిట ఆవిష్కరించిన ముసాయిదా పాలసీలో ఈ మేరకు పలు ప్రతిపాదనలున్నాయి. దాదాపు రూ. 7.8 లక్షల కోట్ల రుణభారంతో కుంగుతున్న టెల్కోలకు ఊరటనిచ్చే దిశగా స్పెక్ట్రం చార్జీలు సహా పలు లెవీలను క్రమబద్ధీకరించేలా హామీలున్నాయి. లైసెన్సు ఫీజులు, స్పెక్ట్రం యూసేజి చార్జీలు, యూనివర్సల్ సర్వీస్ ఆబ్లిగేషన్ ఫండ్ లెవీ మొదలైన వాటన్నింటినీ సమీక్షించేలా పాలసీలో ప్రతిపాదించారు. దీని ప్రకారం స్థూల దేశీయోత్పత్తిలో 6 శాతంగా ఉన్న టెలికం రంగం వాటాను 8 శాతానికి పెంచే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది.
నియంత్రణపరమైన ప్రతిబంధకాల తొలగింపు..
వినియోగదారుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని పెట్టుబడుల రాకకు, కొత్త ఆవిష్కరణలకు నియంత్రణపరమైన ప్రతిబంధకాలను తొలగించేలా టెలికం విధానం ముసాయిదాలో ప్రతిపాదనలు ఉన్నాయి. ఈ రంగంలో మరిన్ని పెట్టుబడులు వచ్చేలా తీసుకోనున్న చర్యలను ప్రస్తావిస్తూ.. ‘డిజిటల్ కమ్యూనికేషన్స్ రంగంలో సముచిత పోటీ ఉండేలా చూడటంతో పాటు పెట్టుబడులను ఆకర్షించేందుకు నియంత్రణ విధానాలను ఎప్పటికప్పుడు మెరుగుపరుస్తూ ఉండాలన్న విషయం దృష్టిలో ఉంచుకుని పాలసీ రూపొందించడం జరిగింది. ఈ రంగంలో పెట్టుబడులు భారీగా అవసరమవుతాయి. ఇది దృష్టిలో ఉంచుకునే దీర్ఘకాలికమైన, మెరుగైన, నిలకడగా కొనసాగే పెట్టుబడులను ఆకర్షించేలా చర్యలు ఉండాలన్నది పాలసీ లక్ష్యం’ అని టెలికం విధానం ముసాయిదాలో పేర్కొన్నారు. డిజిటల్ కమ్యూనికేషన్స్ పరికరాలు, ఇన్‌ఫ్రా, సర్వీసులపై విధిస్తున్న పన్నులు, సుంకాలను క్రమబద్ధీకరించనున్నారు. అలాగే, హై స్పీడ్ బ్రాడ్‌బ్యాండ్ నెట్‌వర్క్‌ను నిర్మించే క్రమంలో నేషనల్ బ్రాడ్‌బ్యాండ్ మిషన్‌ను ఏర్పాటు చేయనున్నారు.
ఎన్‌టీపీ సత్వర అమలు కీలకం: సీవోఏఐ
ఎన్‌టీపీలో నిర్దేశించుకున్న లక్ష్యాలు సాధించాలంటే.. సుంకాలను 10%కన్నా తక్కువకి తగ్గించడంతో పాటు ప్రతిపాదిత విధానాన్ని వేగవంతంగా అమల్లోకి తేవాలని సెల్యులార్ ఆపరేటర్స్ అసోసియేషన్ (సీవోఏఐ) అభిప్రాయపడింది. ‘ప్రస్తుతం మొత్తం పన్నులు, సుంకాలు కలిపి సుమారు 30% దాకా ఉంటున్నాయి. ముసాయిదా విధానంలో నిర్దేశించుకున్న పెట్టుబడుల లక్ష్యాలను సాధించాలంటే వీటిని పది శాతం కన్నా తక్కువకి పరిమితం చేయడం కీలకం’ అని సీవోఏఐ డైరెక్టర్ జనరల్ రాజన్ మాథ్యూస్ పేర్కొన్నారు. జులై ఆఖరు నాటికల్లా టెలికం విధానం పూర్తిగా ఖరారై, అమల్లోకి రావాలని తీవ్ర ఆర్థిక ఒత్తిడిలో ఉన్న టెలికం పరిశ్రమ కోరుకుంటోందని ఆయన చెప్పారు. ఎన్‌టీపీ ముసాయిదాకు మొబైల్ పరిశ్రమ నుంచి పూర్తి మద్దతు ఉందన్నారు.
ల్యాండ్‌లైన్ పోర్టబిలిటీ..
దాదాపు 50 శాతం కుటుంబాలకు ఫిక్సిడ్ లైన్ బ్రాడ్‌బ్యాండ్‌ను అందుబాటులోకి తేవాలని, ల్యాండ్‌లైన్ పోర్టబిలిటీ సేవలు కూడా ప్రవేశపెట్టాలని టెలికం శాఖ ఎన్‌టీపీలో ప్రతిపాదించింది. 2020 నాటికి అన్ని గ్రామ పంచాయతీలకు 1 జీబీపీఎస్ స్పీడ్‌తోనూ, 2022 నాటికి 10 జీబీపీఎస్ స్పీడ్‌తో బ్రాడ్‌బ్యాండ్ సేవలు విస్తరించాలని పాలసీలో సిఫార్సులు ఉన్నాయి. టెలికం సంస్థలు.. కమ్యూనికేషన్స్ సేవలను చౌకగా, నిలకడగా అందించేందుకు వెసులుబాటు కల్పించేలా స్పెక్ట్రం ధరలను సముచిత స్థాయిలో ఉండే విధానాన్ని అమలు చేయాలని టెలికం శాఖ భావిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment