వీఎన్‌వో వ్యాపారంపై డేటావిండ్ కన్ను
న్యూఢిల్లీ: కెనడాకు చెందిన మొబైల్ ఉపకరణాల తయారీ కంపెనీ డేటావిండ్ తాజాగా టెలికం సర్వీసెస్ బిజినెస్‌లో రూ.100 కోట్లు ఇన్వెస్ట్ చేయాలని ప్రణాళికలు రూపొందించుకుంటోంది. లైసెన్స్ పొందిన తొలి ఆరు నెలల కాలంలోనే ఈ పెట్టుబడులు ఉంటాయని కంపెనీ పేర్కొంది. సంవత్సరానికి రూ.200లతో డేటా సర్వీసులను అందిస్తామని తెలిపింది. చౌక ధరలకే ట్యాబ్లెట్స్, స్మార్ట్‌ఫోన్లను విక్రయించే డేటావిండ్ కంపెనీ ఇదివరకే వర్చువల్ నెట్‌వర్క్ ఆపరేటర్ (వీఎన్‌వో) లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకుంది.
కంపెనీకి ఒకవేళ లైసెన్స్ లభిస్తే.. ప్రస్తుత టెలికం ఆపరేటర్ భాగస్వామ్యంతో మొబైల్ టెలిఫోనీ, డేటా సర్వీసులను కస్టమర్లకు ఆఫర్ చేస్తుంది. ‘ఒక నెలలో లైసెన్స్ రావచ్చు. తర్వాత డేటా సర్వీసులే లక్ష్యంగా ఆరు నెలల కాలంలో రూ.100 కోట్లు ఇన్వెస్ట్ చేస్తాం’ అని డేటావిండ్ ప్రెసిడెంట్, సీఈవో సునీత్ సింగ్ తులి తెలిపారు. నెలకు రూ.20 లేదా అంతకన్నా తక్కువ ధరల్లో డేటా ప్లాన్‌లను ఆవిష్కరిస్తామని పేర్కొన్నారు. అంటే సంవత్సరానికి రూ.200లకే డేటా సర్వీసులు అందుబాటులో ఉంటాయని తెలిపారు. కాగా కంపెనీ తాజాగా రూ.3,999 ధరతో విద్యాట్యాబ్–పంజాబి ట్యాబ్లెట్‌ను మార్కెట్‌లో ఆవిష్కరించింది.