దేశీయ సూచీలు సోమవారం లాభాల్లో ప్రారంభమయ్యాయి.
లాభాల్లో ప్రారంభమైన మార్కెట్లు
Published Mon, Oct 3 2016 9:49 AM | Last Updated on Sat, Mar 9 2019 4:28 PM
ముంబై : దేశీయ సూచీలు సోమవారం లాభాల్లో ప్రారంభమయ్యాయి. గతవారం ముగింపులో స్వల్పలాభాల్లో గట్టెక్కిన సెన్సెక్స్ 150 పాయింట్లకు పైగా ఎగిసింది. ప్రస్తుతం 242.45 పాయింట్ల లాభంలో 28,108 వద్ద ట్రేడ్ అవుతోంది. అదేవిధంగా నిఫ్టీ 82.9 పాయింట్లు ఎగిసి కీలకమార్కు 8700కు దగ్గర్లో 8694గా కొనసాగుతోంది. మారుతీ, అదానీ పోర్ట్స్, ఐషర్ మోటార్స్, టాటామోటార్స్ లాభాల్లో నడుస్తుండగా.. ఓఎన్జీసీ, విప్రో, ఇన్ఫోసిస్, పవర్గ్రిడ్లు నష్టాలను గడిస్తున్నాయి.
పండుగ సీజన్ కు ముందే సెప్టెంబర్ నెలలో కార్ల కంపెనీలన్నీ దాదాపు మంచి వృద్ధిని నమోదుచేసినట్టు ప్రకటించాయి. దేశీయ దిగ్గజం మారుతీ అమ్మకాల్లో దూసుకుపోగా, ఎమ్ అండ్ ఎమ్, ఐషర్ మోటార్స్ సైతం అంచనాలకు అనుగుణంగా విక్రయాలు జరిపాయి. దీంతో నేటి మార్కెట్లో ఆటో రంగ షేర్లపై పెట్టుబడిదారులు ఎక్కువగా దృష్టిపెట్టే అవకాశముంటుందని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు.
అదేవిధంగా దేశంలోనే అతిపెద్ద స్పెక్ట్రమ్ వేలం జరుగుతున్న నేపథ్యంలో టెలికాం స్టాక్స్పై కూడా ఇన్వెస్టర్లు ఫోకస్ చేయనున్నట్టు తెలుస్తోంది. నేచురల్ గ్యాస్ ధరలను తగ్గడంతో కొన్ని ఆయిల్ కంపెనీలు ఒత్తిడికి గురయ్యే అవకాశముందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. గ్యాస్ ధరల తగ్గింపు ఇటు ఫెర్టిలైజర్స్ స్టాక్స్కు పూర్తి మద్దతు ఇవ్వనుంది. అటు డాలర్తో రూపాయి మారకం విలువ బలపడింది.శుక్రవారం ముగింపుకు 7 పైసలు బలపడి 66.54గా ప్రారంభమైంది.
Advertisement
Advertisement