ముంబై: మెటల్, ఆటో, బ్యాంకింగ్ షేర్లు రాణించడంతో స్టాక్ సూచీలు శుక్రవారం స్వల్పలాభపడ్డాయి. అమెరికా ఉద్యోగ గణాంకాల వెల్లడి, కేంద్ర బ్యాంకుల వడ్డీ రేట్ల పెంపు ఆందోళనల నేపథ్యంలో ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరించారు. ఉదయం సెన్సెక్స్ 173 పాయింట్ల పెరిగి 62,602 వద్ద, నిఫ్టీ 63 పాయింట్లు బలపడి 18,551 వద్ద మొదలయ్యాయి. సానుకూలంగా ట్రేడింగ్‌ను ప్రారంభించిన సూచీలు మిడ్ సెషన్‌లో కొంత అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. అయితే అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న సానుకూల సంకేతాలు కలిసి రావడంతో తిరిగి లాభాల బాటపట్టాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 340 పాయింట్ల పరిధిలో 62,380 వద్ద కనిష్టాన్ని, 62,720 వద్ద గరిష్టాన్ని తాకింది.
నిఫ్టీ 18,478 – 18,574 శ్రేణిలో ట్రేడైంది. ఆఖరికి సెన్సెక్స్ 119 పాయింట్లు బలపడి 62,547 వద్ద ముగిసింది. నిఫ్టీ 46 పాయింట్లు పెరిగి 18,534 వద్ద నిలిచింది. బీఎస్‌ఈ మిడ్, స్మాల్‌క్యాప్ సూచీ లు అరశాతానికి పైగా లాభపడ్డాయి. ఐటీ, వినిమయ, ఇంధన షేర్లు మాత్రమే అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. ఈ వారం మొత్తంగా సెన్సెక్స్ 45 పాయింట్లు, నిఫ్టీ 35 పాయింట్లు స్వల్పంగా లాభపడ్డాయి. ‘‘అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందాయి. దేశీయంగా మే నెల ఆటో అమ్మకాలు మెరుగ్గా ఉండటం, జీఎస్‌టీ ఆదాయ వృద్ధి, తయారీ కార్యకలాపాలను సూచించే పీఎంఐ సూచీ 31 నెలల గరిష్టానికి చేరుకోవడం వంటి అంశాలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను పెంచాయి’’ అని మోతీలాల్ ఓస్వాల్ సర్వీసెస్ రిటైల్ రీసెర్చ్ హెడ్ సిద్ధార్థ ఖేమా తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment