
న్యూఢిల్లీ: బడా టెక్ కంపెనీలు టెలికం రంగంలోకి దొడ్డిదారిన ప్రవేశించేందుకు ప్రయత్నిస్తున్నాయన్న వార్తలను బ్రాడ్‌బ్యాండ్ ఇండియా ఫోరం (బీఐఎఫ్) ఖండించింది. టెక్ కంపెనీలపై అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని ఆరోపించింది. సొంత అవసరాలకు ఉపయోగించుకునే క్యాప్టివ్ నెట్‌వర్క్‌లకు (సీఎన్‌పీఎన్) కావాల్సిన స్పెక్ట్రం కోసం కూడా వేలంలో పాల్గొనాలన్న వాదనలు పూర్తిగా అసంబద్ధమైనవని వ్యాఖ్యానించింది.
రెండు వేర్వేరు రకాల సర్వీసులు, పబ్లిక్..ప్రైవేట్ నెట్‌వర్క్‌లను నిర్వహించే కంపెనీలకు ఒకే తరహాలో సమాన వ్యాపార అవకాశాలు కల్పించాలంటూ తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్నారని బీఐఎఫ్ పేర్కొంది. టెక్ కంపెనీలు తమ సామర్థ్యాలను పెంచుకునేందుకు మాత్రమే క్యాప్టివ్ నెట్‌వర్క్‌లు ఉపయోగపడతాయి తప్ప ప్రజలకు సర్వీసులు అందించేందుకు కాదని స్పష్టం చేసింది. సీఎన్‌పీఎన్‌లకు స్పెక్ట్రం ఇచ్చేందుకు ప్రతిపాదించిన నాలుగు విధానాల్లోనూ టెల్కోల ప్రమేయం ఉంటుందని బీఐఎఫ్ తెలిపింది.
వాస్తవానికి ఒక విధానంలో ప్రైవేట్ కంపెనీలతో పోలిస్తే టెల్కోల వైపే ఎక్కువ మొగ్గు కూడా ఉందని వివరించింది. ఈ నేపథ్యంలో టెల్కోలకు దీటుగా తమకే సమాన అవకాశాలు కల్పించాల్సి ఉంటుందని బీఐఎఫ్ పేర్కొంది. ప్రైవేట్ 5జీ నెట్‌వర్క్‌లకు స్పెక్ట్రంను కేటాయించడం సరికాదంటూ టెల్కోల సమాఖ్య సీవోఏఐ ఆక్షేపించిన నేపథ్యంలో బీఐఎఫ్ స్పందన ప్రాధాన్యం సంతరించుకుంది. క్యాప్టివ్ నెట్‌వర్క్‌ల కోసం స్పెక్ట్రం కేటాయించడమంటే టెక్ కంపెనీలకు దొడ్డిదారిన టెలికంలోకి ఎంట్రీ ఇచ్చినట్లే అవుతుందంటూ సీవోఏఐ ఆరోపించింది.
Comments
Please login to add a commentAdd a comment