సంవత్సరాంతానికి స్పెక్ట్రమ్ షేరింగ్, ట్రేడింగ్ మార్గదర్శకాలు
న్యూఢిల్లీ: స్పెక్ట్రమ్ షేరింగ్, ట్రేడింగ్‌కు సంబంధించి మార్గదర్శకాలు ఈ సంవత్సరాంతానికి సిద్ధమయ్యే అవకాశం ఉందని టెలికం మంత్రి రవి శంకర్ ప్రసాద్ శనివారం పేర్కొన్నారు. శాఖకు మంత్రిగా బాధ్యతలు చేపట్టి 100 రోజులు పూర్తవుతున్న సందర్భంగా ఇక్కడ జరిగిన విలేకరుల సమావేశంలో ప్రసాద్ మాట్లాడారు. అన్ని కేటగిరీల స్పెక్ట్రమ్‌నూ టెలికం కంపెనీలు పంచుకునేందుకు ట్రాయ్ గత జూలైలో ఆమోదముద్ర వేసిన సంగతి తెలిసిందే.
ఎయిర్‌టెల్, వొడాఫోన్, ఐడియా, ఆర్‌కామ్‌లకు చెందిన కొన్ని లెసైన్సుల కాలపరిమితి 2015-16లో ముగియనుండడంతో ఆ స్పెక్ట్రమ్ వేలానికి సంబంధించిన మలివిడత సంప్రదింపుల ప్రక్రియనూ టెలికం రెగ్యులేటర్ ట్రాయ్ జూలైలో ప్రారంభించింది. దేశవ్యాప్తంగా 18 టెలికం సర్వీస్ ఏరియాల్లో 900, 1800 మెగాహెర్ట్జ్ బ్యాండ్ల స్పెక్ట్రమ్ వేలానికి సంబంధించిన రిజర్వు ధరను ఈ ప్రక్రియలో నిర్ణయిస్తారు. సంప్రదింపుల పత్రంపై స్టేక్‌హోల్డర్ల వ్యాఖ్యానాల స్వీకరణకు తుది గడువు సెప్టెంబర్ 8. వ్యతిరేక వ్యాఖ్యానాల స్వీకరణ గడువు సెప్టెంబర్ 15. ఈ అంశంపై వివరంగా చర్చించేందుకు షెడ్యూల్ ప్రకారం ట్రాయ్ ఇదే నెల 22న సమావేశం నిర్వహించనుంది.