పన్ను వివాదాలపై ఆర్థిక శాఖ దృష్టి
టెలికం మంత్రి రవిశంకర్ ప్రసాద్
న్యూఢిల్లీ: నోకియా, వొడాఫోన్ వంటి టెలికం సంస్థలు ఎదుర్కొంటున్న పన్ను వివాదాల పరిష్కారంపై కేంద్ర ఆర్థిక శాఖ దృష్టి సారించిందని టెలికం మంత్రి రవిశంకర్ ప్రసాద్ తెలిపారు. ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి కోసం తయారీ రంగాన్ని ప్రోత్సహించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. మూడు వారాల క్రితం మంత్రి పదవి చేపట్టిన ఆయన తొలిసారిగా మంగళవారం మీడియాతో మాట్లాడారు. టెలికం సేవల విస్తరణకు, కొన్ని నగరాల్లో చిప్ తయారీ కంపెనీలకు ప్రోత్సాహకాలు ఇవ్వడానికి, పోస్టల్ బ్యాంకుల ఏర్పాటుకు కేంద్రం యత్నిస్తోందని చెప్పారు.పాత తేదీ నుంచి పన్నులు వసూలు చేసే పద్ధతికి స్వస్తి పలకాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమన్నారు.
నిర్దిష్ట పన్ను వివాదాలపై (వొడాఫోన్, నోకియాలకు సంబంధించినవి) స్పందించడానికి ఆయన నిరాకరించారు. ఈశాన్య రాష్ట్రాల్లో రూ.5 వేల కోట్ల వ్యయంతో 8 వేలకు పైగా మొబైల్ టవర్ల ఏర్పాటుకు కేంద్రం యోచిస్తోందని తెలిపారు. నక్సల్స్ కార్యకలాపాలున్న తొమ్మిది రాష్ట్రాల్లోనూ టవర్లు ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు చెప్పారు. వచ్చే మూడేళ్లలో రెండున్నర లక్షల గ్రామ పంచాయతీలను బ్రాడ్‌బ్యాండ్‌తో అనుసంధానించడంపై దృష్టిసారిస్తానని వివరించారు.