సాక్షి, న్యూఢిల్లీ : చైనాతో సరిహద్దు వివాదం రగులుతున్న కొద్దీ ఆ దేశ ఉత్పత్తులను బహిష్కరించాలని, ఆ దేశ కంపెనీలపై నిషేధం విధించాలని రాజకీయ నేతల నుంచి సామాన్య మానవుల వరకు డిమాండ్ చేస్తోన్న విషయం తెలిసిందే. చైనాకు చెందిన వావై, జెడ్‌టీఈ కంపెనీల ఉత్పత్తులను కొనుగోలు చేయరాదంటూ భారతీయ టెలికామ్ సంస్థలను కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం ఆదేశించినట్లు ‘ఫైనాన్సియల్ టైమ్స్’ ఆగస్టు 25వ తేదీన ఓ వార్తను ప్రచురించింది.
ప్రధాని నరేంద్ర మోదీ అంతటి సాహసానికి సిద్ధపడి ఉండవచ్చుగాక, ఆ కంపెనీల ఉత్పత్తులను వినియోగించకుండా భారతీయ టెలికాం సంస్థలు బతకగలవా అని పారిశ్రామిక మార్కెటింగ్ వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. భారతీయ టెలికామ్ పరిశ్రమ ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న నేపథ్యంలో భారత వైర్‌లెస్ టెలికామ్ రంగంలో 55 శాతం వాటా కలిగిన భారతి ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా కంపెనీలు ప్రధానంగా చైనాకు చెందిన ‘వావై’ కంపెనీకి ప్రధాన కస్టమర్లు. అతి చౌక టెలికామ్ పరికరాల కోసం ఈ రెండు భారతీయ కంపెనీలు ‘వావై’ పైనే ఆధార పడ్డాయి. 4జీ నెట్‌వర్క్ పరికరాల్లో ‘వావై’ కంపెనీకి 40 శాతం లాభాలు భారత్ నుంచే వస్తున్నాయి.
ప్రభుత్వ రంగంలో పని చేస్తోన్న బీఎస్‌ఎన్‌ఎల్ ప్రధానంగా చైనాకు చెందిన జెడ్‌టీఈ కంపెనీపై ఆధారపడి మనుగడ సాగిస్తోంది. బీఎస్‌ఎన్‌ఎల్‌లో 40 శాతం 3జీ నెట్‌వర్క్‌ను అభివద్ధి చేసింది జెడ్‌టీఈ కంపెనీయే. 2018లో 5జీ నెటవర్క్ ట్రయల్స్‌ను చైనా వావై కంపెనీతో కలిసి ఎయిర్‌టెల్ నిర్వహించింది. వావై, జెడ్‌టీఈ, ఎరిక్‌సన్ కంపెనీలతో 5జీ టెక్నాలజీ పరికరాల కోసం ఐడియా వోడాఫోన్ ఒప్పందం కుదుర్చుకుంది. నష్టాల్లో ఉన్న భారతీయ టెలికామ్ సంస్థలు ‘వావై, జెడ్‌టీఈ’ లాంటి చైనా కంపెనీల సహకారంతో బయట పడాలని భావిస్తున్నాయి. అలాంటి సమయంలో వావై, జెడ్‌టీఈ కంపెనీలను దూరం చేసుకోవడం అంటే ఆత్మహత్యా సదృశ్యమే అవుతుందని ‘కేఎస్ లీగల్ అండ్ అసోసియేట్’ సంస్థ హెచ్చరిస్తోంది.
ముకేశ్ అంబానీకి చెందిన ‘రిలయన్స్ జియో’ నుంచి ఎయిర్‌టెల్, వొడాఫోన్ సంస్థలకు గట్టి పోటీ ఎదురవుతుండగా, జూన్ 30వ తేదీ నాటికి వొడాఫోన్ నష్టాలు 25,460 కోట్ల రూపాయలు కాగా, ఎయిర్‌టెల్ నష్టం 15,933 కోట్ల రూపాయలు. చైనాకు చెందిన వావై, జెడ్‌టీఈ కంపెనీలకు ప్రత్యామ్నాయంగా దక్షిణ కొరియాకు చెందిన శ్యామ్‌సంగ్, స్వీడన్‌కు చెందిన ఎరిక్‌సన్, ఫిన్‌లాండ్‌కు చెందిన నోకియా కంపెనీలు ఉన్నాయి. చైనా కంపెనీలంత నాణ్యతగల పరికరాలను ఈ కంపెనీలు అందజేయక పోవడమే కాకుండా దిగుమతుల భారం ఎక్కువ పడుతోంది. ఈ రెండు చైనా కంపెనీలను నిషేధించాలనే డిమాండ్ అమెరికా, బ్రిటన్‌తోపాటు ఆస్ట్రేలియాలో కూడా ఇప్పుడు డిమాండ్ ఊపందుకుంది. ఈ విషయంలో ఆ దేశ ప్రభుత్వాలు ఇప్పటికీ తర్జనభర్జన పడుతున్నాయి.
చదవండి: మావాళ్లకు ఇవ్వొద్దు
Comments
Please login to add a commentAdd a comment