సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో నిషేధానికి గురైన చైనా షార్ట్ వీడియో షేరింగ్ ప్లాట్‌ఫామ్ టిక్‌టాక్ వ్యాపారాన్ని కొనుగోలు చేసేందుకు జపాన్ కు చెందిన సాఫ్ట్‌బ్యాంక్ గ్రూప్ కార్పొరేషన్ పథకాలు రచిస్తోంది. ఇందుకు స్థానికంగా భాగస్వాముల కోసం వెతుకుతోంది. ముఖ్యంగా దేశీయ టెలికాం దిగ్గజాలు, రిలయన్స్ జియో, భారతి ఎయిర్‌టెల్ అధిపతులతో చర్చలు జరిపినట్లు తాజా నివేదికల ద్వారా తెలుస్తోంది. (రిలయన్స్ చేతికి టిక్‌టాక్?)
టిక్‌టాక్ యాజమాన్య సంస్థ బైట్‌డాన్స్‌లో వాటా ఉన్న సాఫ్ట్‌బ్యాంక్ టిక్‌టాక్ భారత ఆస్తులను కొనుగోలు చేయాలని యోచిస్తోంది. ఈ మేరకు గత నెలలో జియో, ఎయిర్‌టెల్ తో చర్చలు జరిపిందని విశ్వసనీయ వర్గాల సమాచారం. దీంతో టిక్‌టాక్ కొనుగోలుకు రిలయన్స్ ప్రయత్నిస్తున్నట్టు ఇటీవల వెలువడిన పలు అంచనాలకు మరింత బలంచేకూరింది. అయితే ఈ వార్తలపై సాఫ్ట్‌బ్యాంక్, బైట్‌డాన్స్, రిలయన్స్, భారతి ఎయిర్‌టెల్ ప్రతినిధులు స్పందించడానికి నిరాకరించారు.
కాగా చైనా సరిహద్దు వివాదం, చైనా దుశ్చర్యతో 20 మంది సైనికుల అమరత్వం తరువాత కేంద్రం టిక్‌టాక్‌తో సహా చైనా యాప్ లను గత నెలలో నిషేధిచింది. దీంతోపాటు పబ్‌జీ సహా118 చైనా యాప్‌లను కేంద్రం తాజాగా నిషేధించింది. దీంతో 200 మిలియన్లకు పైగా వినియోగదారులున్న అతిపెద్ద మార్కెట్లో టిక్‌టాక్ కు భారీ ఎదురు దెబ్బ తగిలింది. అటు జాతీయ భద్రతా సమస్యల కారణంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టిక్‌టాక్ నిషేధంపై హెచ్చరికలు చేశారు. దేశంలోని ఆస్తులను విక్రయించుకోమని బైట్‌డాన్స్‌ను ఆదేశించిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment