SoftBank Group Corporation
-
భారత్‌లో టిక్‌టాక్‌పై సాఫ్ట్‌బ్యాంక్ కన్ను?
న్యూఢిల్లీ: వీడియో షేరింగ్ యాప్ టిక్‌టాక్ భారత వ్యాపార విభాగాన్ని కొనుగోలు చేయడంపై జపాన్‌కి చెందిన ఇన్వెస్ట్మెంట్ దిగ్గజం సాఫ్ట్‌బ్యాంక్ గ్రూప్ కార్పొరేషన్ దృష్టి పెట్టింది. ఇందుకోసం దేశీ సంస్థలతో జట్టు కట్టడంపై కసరత్తు చేస్తోంది. చైనాకు చెందిన టిక్‌టాక్ మాతృసంస్థ బైట్‌డ్యాన్స్‌లో కూడా పెట్టుబడులు ఉన్న సాఫ్ట్‌బ్యాంక్.. గత నెల రోజులుగా దేశీ టెలికం దిగ్గజాలు రిలయన్స్ జియో ఇన్ఫోకామ్, భారతి ఎయిర్‌టెల్‌తో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఇవి పెద్దగా ఫలవంతం కాకపోయినప్పటికీ.. సాఫ్ట్‌బ్యాంక్ ప్రత్యామ్నాయ అవకాశాలను ఇంకా అన్వేషిస్తోందని సంబంధిత వర్గాలు తెలిపాయి. సాఫ్ట్‌బ్యాంక్, బైట్‌డ్యాన్స్, రిలయన్స్, భారతి ఎయిర్టెల్ సంస్థలు ఈ వార్తలపై స్పందించలేదు. పలు దేశాల్లో టిక్‌టాక్ బంద్.. కీలకమైన యూజర్ల డేటా అంతా చైనా చేతికి చేరిపోతోందనే ఆందోళనతో భద్రతా కారణాలరీత్యా పలు దేశాలు టిక్‌టాక్‌ను నిషేధిస్తున్న సంగతి తెలిసిందే. చైనాతో సరిహద్దుల్లో ఘర్షణల నేపథ్యంలో భారత్ కూడా దీనితో పాటు పలు చైనా యాప్‌లను నిషేధించింది. దాదాపు 20 కోట్ల మంది పైగా యూజర్లతో టిక్‌టాక్‌కు భారత్ అతి పెద్ద మార్కెట్లలో ఒకటిగా ఉంటోంది. వ్యాపారాన్ని అమ్మేసుకుని వెళ్లిపోకపోతే, తమ దేశంలోనూ టిక్‌టాక్‌ను నిషేధిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. ఈ పరిణామాలతో ఆయా దేశాల్లోని కార్యకలాపాలను అక్కడి సంస్థలకే విక్రయించి, వైదొలిగేందుకు టిక్‌టాక్ మాతృసంస్థ బైట్‌డ్యాన్స్ ప్రయత్నిస్తోంది. బైట్‌డ్యాన్స్‌లో స్వల్ప వాటాలే ఉన్నప్పటికీ.. టిక్‌టాక్ విక్రయ ప్రయత్నాల్లో సాఫ్ట్‌బ్యాంక్ కీలక పాత్రే పోషిస్తోంది. అమెరికా విషయానికొస్తే.. రిటైల్ దిగ్గజం వాల్‌మార్ట్ ప్రధాన ఇన్వెస్టరుగా ఒక గ్రూప్‌ను తయారు చేసింది. ఇందులో టెక్ దిగ్గజం గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్ వంటి సంస్థలను కూడా భాగం చేసింది. అయితే, ఈ కన్సార్షియం ఏర్పాటు ప్రయత్నాలు పూర్తిగా కుదరలేదు. టిక్‌టాక్‌పై తనకు ఆసక్తి లేదంటూ గూగుల్ తప్పుకోగా, మరో టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ వేస్తున్న బిడ్‌లో వాల్‌మార్ట్ కూడా చేరింది. ప్రస్తుతం సాఫ్ట్‌బ్యాంక్ ఏ గ్రూప్‌తో కలిసి పనిచేస్తోందన్న దానిపై స్పష్టత లేదు. భారత్‌తో సాఫ్ట్‌బ్యాంక్ బంధం.. సాఫ్ట్‌బ్యాంక్ మసయోషి సన్ భారత్‌లోని అనేక స్టార్టప్‌లు, కంపెనీల్లో దీర్ఘకాలంగా ఇన్వెస్ట్ చేస్తున్నారు. దేశీ వ్యాపార సంస్థలతో మంచి సంబంధాలు కూడా ఉన్నాయి. సాఫ్ట్‌బ్యాంక్ ఇన్వెస్ట్ చేసిన వాటిల్లో ఈ–కామర్స్ సంస్థ స్నాప్‌డీల్‌డాట్‌కామ్, ట్యాక్సీ సేవల సంస్థ ఓలా క్యాబ్స్, హోటల్ బుకింగ్ యాప్ ఓయో రూమ్స్ మొదలైనవి ప్రధానంగా ఉన్నాయి. గతేడాది డిసెంబర్లో కళ్లజోళ్ల విక్రయ సంస్థ లెన్స్‌కార్ట్‌లో ఏకంగా 275 మిలియన్ డాలర్లు సాఫ్ట్‌బ్యాంక్ ఇన్వెస్ట్ చేసింది. భారతి ఎంటర్ప్రైజెస్, తైవాన్‌కు చెందిన ఫాక్స్‌కాన్ టెక్నాలజీ సంస్థలతో కలిసి సోలార్ పవర్ జాయింట్ వెంచర్ ఏర్పాటు చేసింది. -
టిక్‌టాక్ ఇండియా : సాఫ్ట్‌బ్యాంక్ కన్ను
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో నిషేధానికి గురైన చైనా షార్ట్ వీడియో షేరింగ్ ప్లాట్‌ఫామ్ టిక్‌టాక్ వ్యాపారాన్ని కొనుగోలు చేసేందుకు జపాన్ కు చెందిన సాఫ్ట్‌బ్యాంక్ గ్రూప్ కార్పొరేషన్ పథకాలు రచిస్తోంది. ఇందుకు స్థానికంగా భాగస్వాముల కోసం వెతుకుతోంది. ముఖ్యంగా దేశీయ టెలికాం దిగ్గజాలు, రిలయన్స్ జియో, భారతి ఎయిర్టెల్ అధిపతులతో చర్చలు జరిపినట్లు తాజా నివేదికల ద్వారా తెలుస్తోంది. (రిలయన్స్ చేతికి టిక్‌టాక్?) టిక్‌టాక్ యాజమాన్య సంస్థ బైట్‌డాన్స్‌లో వాటా ఉన్న సాఫ్ట్‌బ్యాంక్ టిక్‌టాక్ భారత ఆస్తులను కొనుగోలు చేయాలని యోచిస్తోంది. ఈ మేరకు గత నెలలో జియో, ఎయిర్టెల్ తో చర్చలు జరిపిందని విశ్వసనీయ వర్గాల సమాచారం. దీంతో టిక్‌టాక్ కొనుగోలుకు రిలయన్స్ ప్రయత్నిస్తున్నట్టు ఇటీవల వెలువడిన పలు అంచనాలకు మరింత బలంచేకూరింది. అయితే ఈ వార్తలపై సాఫ్ట్‌బ్యాంక్, బైట్‌డాన్స్, రిలయన్స్, భారతి ఎయిర్టెల్ ప్రతినిధులు స్పందించడానికి నిరాకరించారు. కాగా చైనా సరిహద్దు వివాదం, చైనా దుశ్చర్యతో 20 మంది సైనికుల అమరత్వం తరువాత కేంద్రం టిక్‌టాక్‌తో సహా చైనా యాప్ లను గత నెలలో నిషేధిచింది. దీంతోపాటు పబ్జీ సహా118 చైనా యాప్‌లను కేంద్రం తాజాగా నిషేధించింది. దీంతో 200 మిలియన్లకు పైగా వినియోగదారులున్న అతిపెద్ద మార్కెట్లో టిక్‌టాక్ కు భారీ ఎదురు దెబ్బ తగిలింది. అటు జాతీయ భద్రతా సమస్యల కారణంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టిక్‌టాక్ నిషేధంపై హెచ్చరికలు చేశారు. దేశంలోని ఆస్తులను విక్రయించుకోమని బైట్‌డాన్స్‌ను ఆదేశించిన సంగతి తెలిసిందే. -
టిక్‌టాక్‌కు షాకివ్వనున్న మ్యూజిక్ కంపెనీలు!
వాషింగ్టన్: చైనీస్ యాప్ టిక్‌టాక్‌కు వరుసగా షాకులు తగులుతున్నాయి. 2019 ఫిబ్రవరిలో ఫెడరల్ ట్రేడ్ కమిషన్(ఎఫ్‌టీసీ)తో కుదుర్చుకున్న ఒప్పందాన్ని(కన్సెంట్ డిక్రీ) ఉల్లంఘించిందని పలు అమెరికా అడ్వకసీ గ్రూపులు టిక్‌టాక్‌పై ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. కాలిఫోర్నియాకు చెందిన మ్యూజికల్.ఎల్వై(Musical.ly)ఒప్పందం కుదుర్చుకున్న టిక్‌టాక్ జాతీయ చిన్నారుల భద్రతా చట్టాన్ని అతిక్రమించిందని ఎఫ్‌టీసీ ఇదివరకే సంస్థకు 5.7 మిలియన్ డాలర్ల మేరు జరిమానా విధించింది. ఇక ప్రస్తుత ఫిర్యాదుతో మరోసారి కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలో తమ పాటలను యథేచ్చగా వాడుకుంటూ కాపీరైట్ నిబంధనలు ఉల్లంఘించినందుకు పలు టాప్ అమెరికన్ మ్యూజిక్ కంపెనీలు టిక్‌టాక్‌పై దావా వేసేందుకు సిద్ధమవుతున్నట్లు తాజా సమాచారం. (అప్పట్లో భారీ జరిమానా.. టిక్‌టాక్‌కు మరోదెబ్బ!) పాటలకు పెదవి కలుపుతూ, నర్తిస్తూ సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతున్న టిక్‌టాక్ పట్ల ఆకర్షితులు కాని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. సినిమా పాటలు, భావోద్వేగాలు, డైలాగులకు అనుగుణంగా అభినయిస్తూ వీడియోలు అప్లోడ్ చేసే అవకాశం కల్పించిన ఈ యాప్ వల్ల ఎంతోమంది సామాన్యులు సెలబ్రిటీలుగా మారారు. దీంతో వయసుతో సంబంధం లేకుండా కోట్లాది మంది టిక్‌టాక్‌లో అకౌంట్‌ను క్రియేట్ చేసుకుని తమ టాలెంట్ బయటపెట్టుకుంటున్నారు. ముఖ్యంగా తమకిష్టమైన పాటలకు పెదవి కలుపుతూ.. నర్తిస్తూ ఫ్యాన్స్‌ను సంపాదించుంటున్న వారి సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది. ఈ క్రేజ్‌ను క్యాష్ చేసుకుని టిక్‌టాక్ ప్రజల్లో విపరీతమైన ఆదరణ పొందుతోంది. ఈ నేపథ్యంలో యూనివర్సల్ సహా పలు కంపెనీలు అనుమతి లేకుండా తమ పాటలను వినియోగించుకుంటున్నందుకు చట్టపరంగా చర్యలు తీసుకునేందుకు ఉపక్రమించినట్లు తెలుస్తోంది. ఈ విషయం గురించి నేషనల్ మ్యూజిక్ పబ్లిషర్స్ అసోసియేషన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ డేవిడ్ ఫైనాన్షియల్ టైమ్స్‌తో మాట్లాడుతూ.. టిక్‌టాక్‌పై భవిష్యతులో దావా వేసే అవకాశం ఉందన్నారు. ప్రస్తుతం టిక్‌టాక్‌లో అందుబాటులో ఉన్న 50 శాతం మ్యూజిక్ లైసెన్స్ లేకుండానే పబ్లిష్ చేసిందన్నారు. కాగా ప్రపంచంలోనే అతిపెద్ద ఆడియో సంస్థగా పేరొందిన యూనివర్సల్ మ్యూజిక్.. లైసెన్స్ విషయంలో టిక్‌టాక్‌తో ఒప్పందం కుదర్చుకునేందుకు సంప్రదింపులు జరుపుతోంది. తద్వారా పెద్ద మొత్తంలో డబ్బు వసూలు చేయాలని యోచిస్తోంది. రాయల్టీలు చెల్లించడం లేదు కాగా యూనివర్సల్ సాంగ్రైటర్స్ బిల్లీ ఎలిష్, లేడీ గాగా, ఎల్టన్ జాన్, టేలర్ స్విప్ట్ వంటి ప్రఖ్యాత పాప్ సింగర్ల పాటలు వాడుకుంటున్న టిక్‌టాక్ వారికి రాయల్టీలు చెల్లించడం లేదు. ఈ క్రమంలో వారి క్రేజ్‌తో యూజర్లను ఆకట్టుకుంటూ కోట్లాది రూపాయలు సంపాదిస్తున్న టిక్‌టాక్‌లో మ్యూజిక్ ఒక ప్రధాన అవసరంగా మారిన నేపథ్యంలో పాటల కంపెనీలు ఈ మేరకు సంస్థ నుంచి తమకు రావాల్సిన మొత్తాన్ని రాబట్టేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. కాగా 75 బిలియన్ డాలర్ల విలువ కలిగిన టిక్‌టాక్ మాతృసంస్థ బైట్‌డ్యాన్స్ పబ్లిక్ ఆఫర్‌కు వెళ్లే యోచనలో ఉంది. (సాఫ్ట్‌బ్యాంకు బోర్డు సభ్యత్వానికి జాక్ మా రాజీనామా!) జపాన్ దిగ్గజం సాప్ట్‌బ్యాంక్, సికోఇయా క్యాపిటల్ వంటి ఇన్వెస్టర్లను కలిగి ఉన్న ఈ సంస్థ పబ్లిక ఆఫర్ ప్రకటించనుందన్న వార్తల నేపథ్యంలో.. యూనివర్సల్ మ్యూజిక్ వారం రోజుల్లోగా తమ ప్రతిపాదనకు స్పందించి... లైసెన్సింగ్ డీల్‌పై అభిప్రాయం చెప్పాలని టిక్‌టాక్‌కు డెడ్‌లైన్ విధించింది. లేనిపక్షంలో న్యాయపోరాటానికి సిద్ధమవనున్నట్లు హెచ్చరించిందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఇక ఈ విషయం గురించి టిక్‌టాక్ అధికార ప్రతినిధి మాట్లాడుతూ.. ‘‘ మ్యూజిక్ ఇండస్ట్రీతో వేల కొద్ది లైసెన్స్ ఒప్పందాలు కుదుర్చుకోవడానికి మేం గర్వపడుతున్నాం. అయితే వీటి గురించి మేం వివరాలు వెల్లడించలేం’’అని స్పష్టం చేశారు. -
‘అలీబాబా’ జాక్ మా కీలక నిర్ణయం!
బీజింగ్: అలీబాబా సహ వ్యవస్థాపకుడు జాక్ మా కీలక నిర్ణయం తీసుకున్నారు. సాఫ్ట్‌బ్యాంక్ గ్రూప్ కార్పొరేషన్ డైరెక్టర్ బాధ్యతల నుంచి తప్పుకోనున్నారు. ఈ మేరకు జాక్ మా తన పదవికి రాజీనామా చేస్తున్నారని సదరు సంస్థ సోమవారం తెలిపింది. అదే విధంగా ముగ్గురు కొత్త సభ్యులను బోర్డులోకి ఆహ్వానించే ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు పేర్కొంది. జూన్ 25న జరిగే సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకుంటామని కొత్త నియామకాలతో బోర్డు సభ్యుల సంఖ్య 13కు చేరుకుంటుందని వెల్లడించింది. (రెండో స్థానంలోకి ఆలీబాబా జాక్ మా) ఈ క్రమంలో కాడెన్స్ డిజైన్స్ సిస్టమ్స్ సీఈఓ లిప్- బూ టన్, వెసెడా బిజినెస్ స్కూల్ ప్రొఫెసర్ యుకో కవామోటో కొత్త సభ్యులుగా చేరనున్నట్లు పేర్కొంది. కవామోటో నియామకం ఖరారైన నేపథ్యంలో బోర్డులోని ఏకైక మహిళా సభ్యురాలిగా ఆమె ప్రత్యేకత సంతరించుకోనున్నారు. కాగా చైనీస్ ఇ- కామర్స్ రిటైల్ కంపెనీ, ప్రపంచంలోనే అతిపెద్ద ఈ కామర్స్ దిగ్గజం కో ఫౌండర్, టెక్ బిలియనీర్ జాక్ మా గతేడాది తన చైర్మన్ పదవి నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. శేష జీవితాన్ని సేవా కార్యక్రమాల కోసం వినియోగిస్తానని ఆయన ఈ సందర్భంగా ప్రకటించారు. ప్రస్తుతం సాఫ్ట్‌బ్యాంక్ బోర్డు సభ్యుడిగా కూడా ఆయన వైదొలగనున్నారు. ఇదిలా ఉండగా... షేర్ల కొనుగోలుకై దాదాపు 4.7 బిలియన్ డాలర్లు విడుదల చేసేందుకు బోర్డు ఆమోదం తెలిపిందని సాఫ్ట్‌బ్యాంక్ వెల్లడించింది. కాగా అలీబాబాలో పెద్ద మొత్తంలో వాటాలు దక్కించుకునేందుకు సాఫ్ట్‌బ్యాంక్ ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలుస్తోంది.(జియో ప్లాట్‌ఫామ్స్‌లో నాలుగో భారీ పెట్టుబడి) -
సాఫ్ట్‌బ్యాంక్‌లో భారతీయుడి భారీ పెట్టుబడులు..
- రూ.3,148 కోట్లు ఇన్వెస్ట్ చేసిన నికేశ్ అరోరా - సాఫ్ట్‌బ్యాంక్ ప్రెసిడెంట్, సీఓఓగా విధులు టోక్యో: నికేశ్ అరోరా...గూగుల్ సంస్థలో అత్యున్నత స్థాయిలో పనిచేసి గత ఏడాది బయటకు వచ్చిన ఈయన 48 కోట్ల డాలర్ల(రూ.3,148 కోట్ల) విలువైన సాఫ్ట్‌బ్యాంక్ గ్రూప్ కార్పొరేషన్ షేర్లను కొనుగోలు చేశారు. జపాన్‌కు చెందిన సాఫ్ట్‌బ్యాంక్‌కు ప్రెసిడెంట్, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న భారత్‌లో జన్మించిన అరోరా కొనుగోలును డెరైక్టర్ల బోర్డ్ ఆమోదించిందని సాఫ్ట్‌బ్యాంక్ సంస్థ టోక్యో స్టాక్ ఎక్స్ఛేంజ్కు బుధవారం వెల్లడించింది. ఐఐటీ-వారణాసిలో పట్టభద్రుడైన అరోరా అమెరికా యూనివర్శిటీలో ఎంబీఏ చదివారు. పదేళ్లపాటు గూగుల్‌లో పనిచేసిన ఆయన గత ఏడాది జూలైలో సాఫ్ట్‌బ్యాంక్‌లో చేరారు. అరోరాకు సాఫ్ట్‌బ్యాంక్ 13.5 కోట్ల డాలర్ల వార్షిక వేతనాన్ని ఇస్తోందని సమచారం. దీంతో ప్రపంచంలో అత్యధిక వేతనం పొందుతున్న మూడో ఉన్నతస్థాయి వ్యక్తిగా ఆయన నిలిచారు. నికేశ్ అరోరా గొప్ప బిజినెస్ లీడర్ అని, సహృదయుడని సాఫ్ట్‌బ్యాంక్‌కు చీఫ్ ఎగ్జిక్యూటివ్ మసయోచి సన్ వ్యాఖ్యానించారు. కాగా, మసయోచి స్థానంలో నికేశ్ వచ్చే అవకాశాలు అధికంగా ఉన్నాయి.