భారత్‌లో టిక్‌టాక్‌పై సాఫ్ట్‌బ్యాంక్‌ కన్ను? | SoftBank Is Said to Consider Bid for TikTok in India | Sakshi
Sakshi News home page

భారత్‌లో టిక్‌టాక్‌పై సాఫ్ట్‌బ్యాంక్‌ కన్ను?

Published Sat, Sep 5 2020 4:24 AM | Last Updated on Sat, Sep 5 2020 4:38 AM

SoftBank Is Said to Consider Bid for TikTok in India - Sakshi

న్యూఢిల్లీ: వీడియో షేరింగ్‌ యాప్‌ టిక్‌టాక్‌ భారత వ్యాపార విభాగాన్ని కొనుగోలు చేయడంపై జపాన్‌కి చెందిన ఇన్వెస్ట్‌మెంట్‌ దిగ్గజం సాఫ్ట్‌బ్యాంక్‌ గ్రూప్‌ కార్పొరేషన్‌ దృష్టి పెట్టింది. ఇందుకోసం దేశీ సంస్థలతో జట్టు కట్టడంపై కసరత్తు చేస్తోంది. చైనాకు చెందిన టిక్‌టాక్‌ మాతృసంస్థ బైట్‌డ్యాన్స్‌లో కూడా పెట్టుబడులు ఉన్న సాఫ్ట్‌బ్యాంక్‌.. గత నెల రోజులుగా దేశీ టెలికం దిగ్గజాలు రిలయన్స్‌ జియో ఇన్ఫోకామ్, భారతి ఎయిర్‌టెల్‌తో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఇవి పెద్దగా ఫలవంతం కాకపోయినప్పటికీ.. సాఫ్ట్‌బ్యాంక్‌ ప్రత్యామ్నాయ అవకాశాలను ఇంకా అన్వేషిస్తోందని సంబంధిత వర్గాలు తెలిపాయి. సాఫ్ట్‌బ్యాంక్, బైట్‌డ్యాన్స్, రిలయన్స్, భారతి ఎయిర్‌టెల్‌ సంస్థలు ఈ వార్తలపై స్పందించలేదు.

పలు దేశాల్లో టిక్‌టాక్‌ బంద్‌..
కీలకమైన యూజర్ల డేటా అంతా చైనా చేతికి చేరిపోతోందనే ఆందోళనతో భద్రతా కారణాలరీత్యా పలు దేశాలు టిక్‌టాక్‌ను నిషేధిస్తున్న సంగతి తెలిసిందే. చైనాతో సరిహద్దుల్లో ఘర్షణల నేపథ్యంలో భారత్‌ కూడా దీనితో పాటు పలు చైనా యాప్‌లను నిషేధించింది. దాదాపు 20 కోట్ల మంది పైగా యూజర్లతో టిక్‌టాక్‌కు భారత్‌ అతి పెద్ద మార్కెట్లలో ఒకటిగా ఉంటోంది. వ్యాపారాన్ని అమ్మేసుకుని వెళ్లిపోకపోతే, తమ దేశంలోనూ టిక్‌టాక్‌ను నిషేధిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ హెచ్చరించారు. ఈ పరిణామాలతో ఆయా దేశాల్లోని కార్యకలాపాలను అక్కడి సంస్థలకే విక్రయించి, వైదొలిగేందుకు టిక్‌టాక్‌ మాతృసంస్థ బైట్‌డ్యాన్స్‌ ప్రయత్నిస్తోంది.

బైట్‌డ్యాన్స్‌లో స్వల్ప వాటాలే ఉన్నప్పటికీ.. టిక్‌టాక్‌ విక్రయ ప్రయత్నాల్లో సాఫ్ట్‌బ్యాంక్‌ కీలక పాత్రే పోషిస్తోంది. అమెరికా విషయానికొస్తే.. రిటైల్‌ దిగ్గజం వాల్‌మార్ట్‌ ప్రధాన ఇన్వెస్టరుగా ఒక గ్రూప్‌ను తయారు చేసింది. ఇందులో టెక్‌ దిగ్గజం గూగుల్‌ మాతృసంస్థ ఆల్ఫాబెట్‌ వంటి సంస్థలను కూడా భాగం చేసింది. అయితే, ఈ కన్సార్షియం ఏర్పాటు ప్రయత్నాలు పూర్తిగా కుదరలేదు. టిక్‌టాక్‌పై తనకు ఆసక్తి లేదంటూ గూగుల్‌ తప్పుకోగా, మరో టెక్‌ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌ వేస్తున్న బిడ్‌లో వాల్‌మార్ట్‌ కూడా చేరింది. ప్రస్తుతం సాఫ్ట్‌బ్యాంక్‌ ఏ గ్రూప్‌తో కలిసి పనిచేస్తోందన్న దానిపై స్పష్టత లేదు.

భారత్‌తో సాఫ్ట్‌బ్యాంక్‌ బంధం..
సాఫ్ట్‌బ్యాంక్‌ మసయోషి సన్‌ భారత్‌లోని అనేక స్టార్టప్‌లు, కంపెనీల్లో దీర్ఘకాలంగా ఇన్వెస్ట్‌ చేస్తున్నారు. దేశీ వ్యాపార సంస్థలతో మంచి సంబంధాలు కూడా ఉన్నాయి. సాఫ్ట్‌బ్యాంక్‌ ఇన్వెస్ట్‌ చేసిన వాటిల్లో ఈ–కామర్స్‌ సంస్థ స్నాప్‌డీల్‌డాట్‌కామ్, ట్యాక్సీ సేవల సంస్థ ఓలా క్యాబ్స్, హోటల్‌ బుకింగ్‌ యాప్‌ ఓయో రూమ్స్‌ మొదలైనవి ప్రధానంగా ఉన్నాయి. గతేడాది డిసెంబర్‌లో కళ్లజోళ్ల విక్రయ సంస్థ లెన్స్‌కార్ట్‌లో ఏకంగా 275 మిలియన్‌ డాలర్లు సాఫ్ట్‌బ్యాంక్‌ ఇన్వెస్ట్‌ చేసింది. భారతి ఎంటర్‌ప్రైజెస్, తైవాన్‌కు చెందిన ఫాక్స్‌కాన్‌ టెక్నాలజీ సంస్థలతో కలిసి సోలార్‌ పవర్‌ జాయింట్‌ వెంచర్‌ ఏర్పాటు చేసింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement