డేటా నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు
టెల్కోలకు ట్రాయ్ చైర్మన్ ఆర్‌ఎస్ శర్మ హెచ్చరిక
న్యూఢిల్లీ: వెబ్‌సైట్‌ను బట్టి వివిధ రకాల చార్జీలు వసూలు చే యకూడదన్న నిబంధనలతో టెలికం ఆపరేటర్లు దారికి రాని పక్షంలో మరిన్ని కఠిన చర్యలు తప్పవని టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ చైర్మన్ ఆర్‌ఎస్ శర్మ హెచ్చరించారు. ‘కావాలంటే జరిమానా కట్టుకుంటూ పోతాం .. యథేచ్ఛగా నిబంధనలు ఉల్లంఘిస్తాం అంటే కుదరదు’ అని ఆయన స్పష్టం చేశారు. ఆదేశాలను ఉల్లంఘిస్తే తీసుకునే ఇతర చర్యలు కూడా నిబంధనల్లో పొందుపర్చడం జరిగిందని శర్మ తెలిపారు.
నెట్ న్యూట్రాలిటీకి మద్దతు పలికిన ట్రాయ్.. డేటా సర్వీసులకు కంటెం ట్‌ను బట్టి వివిధ రకాల చార్జీలు వసూలు చేయడం కుదరదని, అలా చేస్తే భారీ జరిమానాలు తప్పవని నిబంధనలు విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే, కంపెనీలు జరిమానాలు కట్టుకుంటూ నిబంధనలకు విరుద్ధంగా తమ వ్యాపారాలను యథాప్రకారం కొనసాగించే ప్రమాదం ఉందం టూ ఆందోళనలు వ్యక్తం కావడంతో శర్మ వివరణ ప్రాధాన్యం సంతరించుకుంది. కంపెనీలు కొత్త టారిఫ్ ప్లాన్ రూపొందిస్తే దాన్ని కచ్చితంగా ట్రాయ్‌కు అందించాలని, అది నిబంధనలకు విరుద్ధంగా ఉన్నట్లు తేలితే జరిమానాలు విధిస్తామని శర్మ చెప్పారు.
గుత్తాధిపత్యం కుదరదు: ఇంటర్నెట్‌పై కొన్ని సంస్థలు గుత్తాధిపత్యం చలాయిస్తామంటే ఊరుకోబోమని, ఇలాంటి ధోరణులను అనుమతించే ప్రసక్తే లేదని కేంద్ర టెలికం మంత్రి రవి శంకర్ ప్రసాద్ స్పష్టం చేశారు. ఫేస్‌బుక్ ఫ్రీ బేసిక్స్ కావొచ్చు మరొకటి కావొచ్చు ఇటువంటి పథకాలు ఎంతమాత్రం ఆమోదయోగ్యమైనవి కావన్నారు. ట్రాయ్ తాజా నిబంధనలతో ప్రపంచవ్యాప్తంగా నెటిజనుల్లో భారత ప్రతిష్ట పెరిగిందని మంత్రి చెప్పారు.
ట్రాయ్ ఆదేశాలు నిరాశపర్చాయి: జుకర్‌బర్గ్
నెట్ న్యూట్రాలిటికీ మద్దతుగా ట్రాయ్ ఇచ్చిన ఆదేశాలు నిరాశపర్చాయని సోషల్ నెట్‌వర్కింగ్ సైటు ఫేస్‌బుక్ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ చెప్పారు. కొన్ని డేటా సర్వీసులను ఉచితంగా అందించే తమ వంటి సంస్థల పథకాలకు ఈ నిబంధనల వల్ల ఆంక్షలు, అడ్డంకులు ఏర్పడతాయని ఆయన పేర్కొన్నారు. అయితే, ప్రతీ ఒక్కరికి ఇంటర్నెట్‌ను అందుబాటులోకి తెచ్చే దాకా కృషి కొనసాగిస్తూనే ఉంటామని ఆయన పేర్కొన్నారు.