ఆర్కామ్ టవర్ల వ్యాపారంలో బ్రూక్ఫీల్డ్కు 51% వాటా
డీల్ విలువ రూ.11,000 కోట్లు
న్యూఢిల్లీ: రిలయన్స్ కమ్యూనికేషన్స్(ఆర్‌కామ్) సంస్థ టెలికం టవర్ వ్యాపారంలో 51 శాతం వాటాను కెనడాకు చెందిన బ్రూక్‌ఫీల్డ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్‌కు విక్రయించనున్నది. డీల్ విలువ రూ.11,000 కోట్లు. ఈ వాటాను రిలయన్స్ ఇన్‌ఫ్రాటెల్ నుంచి స్పెషల్ పర్పస్ వెహికల్(ఎస్‌పీవీ)కు బదిలీ చేస్తామని, ఈ ఎస్‌పీవీపై యాజమాన్య హక్కులు బ్రూక్‌ఫీల్డ్‌కు ఉంటాయని ఆర్‌కామ్ వివరించింది. ఈ నిధులను రుణభారాన్ని తగ్గించుకోవడానికి వినియోగిస్తామని పేర్కొంది. టవర్ల వ్యాపారంలో ఆర్‌కామ్‌కు ఇంకా 49 శాతం వాటా ఉందని, భవిష్యత్తులో ఈ వాటాను విక్రయించే ఆలోచన ఆర్‌కామ్‌కు ఉందని సంబంధిత వర్గాలంటున్నాయి. రెండేళ్లలో టవర్ల అద్దెల్లో మంచి వృద్ది ఉంటుందని, ఫలితంగా తమ వాటాకు మరింత విలువ వస్తుందని ఆర్‌కామ్ భావిస్తున్నట్లు ఆ వర్గాలు పేర్కొన్నాయి.
దీర్ఘకాలిక మాస్టర్ సర్వీస్ అగ్రిమెంట్(ఎంఎస్‌ఏ) ప్రకారం తమ టెలికం వ్యాపారం కోసం ఈ టవర్ ఆస్తుల్లో యాంకర్ టెనంట్‌గా కొనసాగుతామని ఆర్‌కామ్ పేర్కొంది. ఈ టవర్ల వ్యాపారంలో వాటా విక్రయం, ఎయిర్‌సెల్ విలీనం కారణంగా ఆర్‌కామ్ రుణ భారం రూ.42,000 కోట్ల నుంచి దాదాపు 60% వరకూ తగ్గి రూ.17,000 కోట్లకు దిగివస్తుందని అంచనా. కాగా రియల్ ఎస్టేట్ వ్యాపార విక్రయం ద్వారా మరో రూ.5,000 కోట్లు సమీకరించాలని ఆర్‌కామ్ భావిస్తోంది. దీంతో కంపెనీ రుణ భారం రూ.12,000 కోట్లకు తగ్గొచ్చని అంచనాలున్నాయి.