‘టెలికం’కు ఆర్‌కామ్‌ గుడ్‌బై... | RCom to exit telecom fully to focus on realty: Anil Ambani | Sakshi
Sakshi News home page

‘టెలికం’కు ఆర్‌కామ్‌ గుడ్‌బై...

Published Wed, Sep 19 2018 12:13 AM | Last Updated on Wed, Sep 19 2018 10:59 AM

RCom to exit telecom fully to focus on realty: Anil Ambani - Sakshi

ముంబై: ఒకప్పుడు టెలికం రంగంలో సంచలనాలు సృష్టించిన రిలయన్స్‌ కమ్యూనికేషన్స్‌ (ఆర్‌కామ్‌) మొత్తానికి ఆ వ్యాపారం నుంచే పూర్తిగా వైదొలగనుంది. ఇకపై భవిష్యత్‌లో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారంపై ప్రధానంగా దృష్టి పెట్టనుంది. మంగళవారం జరిగిన ఆర్‌కామ్‌ 14వ వార్షిక సాధారణ సమావేశంలో .. రిలయన్స్‌ గ్రూప్‌ (అడాగ్‌) చైర్మన్‌ అనిల్‌ అంబానీ ఈ విషయాలు వెల్లడించారు. అన్నింటికన్నా ముందుగా ఆర్‌కామ్‌కు ఉన్న రూ. 40,000 కోట్ల రుణభారాన్ని పరిష్కరించుకోనున్నట్లు ఆయన పేర్కొన్నారు.

’ టెలికం రంగం భవిష్యత్‌ స్పష్టంగా కనిపిస్తోంది. ఈ రంగంలో ఇక కొనసాగరాదని నిర్ణయించుకున్నాం. ఇంకా చాలా కంపెనీలు కూడా ఇలాంటి నిర్ణయమే తీసుకున్నాయి. భవిష్యత్‌లో రిలయన్స్‌ రియల్టీ ఈ సంస్థకు వృద్ధి చోదకంగా ఉండనుంది’ అని అనిల్‌ అంబానీ పేర్కొన్నారు. ముంబై శివార్లలో ఉన్న 133 ఎకరాల ధీరుభాయ్‌ అంబానీ నాలెడ్జ్‌ సిటీ (డీఏకేసీ) గురించి ప్రస్తావిస్తూ.. ఈ సైట్‌ ద్వారా దాదాపు రూ. 25,000 కోట్ల మేర విలువను సృష్టించేందుకు పుష్కలంగా అవకాశాలు ఉన్నాయని అంబానీ చెప్పారు.

అన్న ముకేశ్‌కు థ్యాంక్స్‌..
కంపెనీ రుణభారానికి మరికొద్ది నెలల్లో తగు పరిష్కార మార్గం లభించగలదని ఆయన ధీమా వ్యక్తం చేశారు. టెలికం ఇన్‌ఫ్రా, ఫైబర్‌ వ్యాపారాలను రిలయన్స్‌ జియోకి విక్రయించే ప్రక్రియ తుది దశలో ఉందని.. ఇలాగే ఇతరత్రా విభాగాల విక్రయం తదితర చర్యలతో నిధులు సమీకరించుకునే ప్రయత్నాల్లో ఉన్నామని అనిల్‌ అంబానీ చెప్పారు. స్పెక్ట్రం షేరింగ్, ట్రేడింగ్‌కు సంబంధించి టెలికం శాఖ నుంచి తుది అనుమతుల కోసం ఎదురుచూస్తున్నామన్నారు.

అప్పట్లో అవిభాజ్య రిలయన్స్‌ గ్రూప్‌ను టెలికం రంగం వైపు నడిపించడంతో పాటు ప్రస్తుతం సంక్షోభంలో ఉన్న ఆర్‌కామ్‌ అసెట్స్‌ను కొనుగోలు చేయడం ద్వారా ఇప్పుడు కూడా ఆర్థికంగా తోడ్పాటు అందిస్తున్న పెద్దన్న ముకేశ్‌ అంబానీకి అనిల్‌ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. ’వ్యక్తిగతంగా నాకు, ఆర్‌కామ్‌కు, .. మార్గనిర్దేశనం చేసి, తోడ్పాటు అందించిన నా సోదరుడు ముకేశ్‌ భాయ్‌ అంబానీకి కృతజ్ఞతలు తెలుపుకోవడానికి ఇది సరైన సమయం’ అని అనిల్‌ పేర్కొన్నారు.

టెలికం రంగంలో సృజనాత్మక విధ్వంసం జరుగుతోందని.. సాముదాయిక గుత్తాధిపత్యానికి దారి తీసిందని అనిల్‌ చెప్పారు. తర్వాత రోజుల్లో ఇది ద్విదాధిపత్యం (రెండే కంపెనీల ఆధిపత్యం), అటు పైన పూర్తి గుత్తాధిపత్యానికి కూడా దారితీయొచ్చని అనిల్‌ అంబానీ పేర్కొన్నారు. రిలయన్స్‌ సామ్రాజ్యం విభజన అనంతరం టెలికంతో పాటు కొన్ని విభాగాలు అనిల్‌ అంబానీకి, రిఫైనరీ తదితర వ్యాపార విభాగాలు ముకేశ్‌ అంబానీకి లభించిన సంగతి తెలిసిందే. ముకేశ్‌ అంబానీ తాజాగా మళ్లీ రిలయన్స్‌ జియోతో.. టెలికం రంగంలోకి ప్రవేశించారు.

రిలయన్స్‌ రియల్టీ..
మొబైల్‌ వ్యాపార విభాగాన్ని జియోకి విక్రయించేసిన తర్వాత ఆర్‌కామ్‌ ప్రస్తుతం ఎంటర్‌ప్రైజ్, డేటా సెంటర్స్, అండర్‌సీ కేబుల్స్‌ మొదలైన వ్యాపార విభాగాల ద్వారా 35,000 సంస్థలకు సర్వీసులు అందిస్తోందని అనిల్‌ అంబానీ చెప్పారు. వీటన్నింటి నుంచి వైదొలగడంతో పాటు బ్యాంకులకు రుణాలను తిరిగి చెల్లించడానికి కూడా ఆర్‌కామ్‌ కట్టుబడి ఉందని.. దీనిపై తగు సమయంలో నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పారు. ఆర్‌కామ్‌కు అనుబంధ సంస్థగా ఏర్పాటైన రిలయన్స్‌ రిటైల్‌.. నవీ ముంబైలోని డీఏకేసీని అభివృద్ధి చేస్తుందని పేర్కొన్నారు. కంపెనీకి ముప్పై లక్షల చ.అ.ల బిల్టప్‌ స్పేస్‌ ఉందని.. దీన్ని బహుళజాతి సంస్థలకు లీజుకివ్వనున్నామని అనిల్‌ చెప్పారు. తొలి ఏడాది నుంచే వీటిపై ఆదాయాలు రాగలవన్నారు.


ఆర్థికేతర వ్యాపారాల నుంచి రిలయన్స్‌ క్యాపిటల్‌ నిష్క్రమణ..
రిలయన్స్‌ క్యాపిటల్‌ వచ్చే 12–18 నెలల్లో ఆర్థికేతర వ్యాపార విభాగాల నుంచి వైదొలగడం ద్వారా రుణభారం తగ్గించుకోవాలని భావిస్తున్నట్లు కంపెనీ 32వ వార్షిక సాధారణ సమావేశంలో చైర్మన్‌ అనిల్‌ అంబానీ తెలిపారు. రిలయన్స్‌ జనరల్‌ ఇన్సూరెన్స్‌ను ఈ ఆర్థిక సంవత్సరంలోనే లిస్టింగ్‌ చేయాలని యోచిస్తున్నట్లు ఆయన వివరించారు. రిలయన్స్‌ క్యాపిటల్‌కి ప్రస్తుతం అసెట్‌ మేనేజ్‌మెంట్, బీమా, గృహ.. వాణిజ్యరుణాలు, ఈక్విటీలు.. కమోడిటీల బ్రోకింగ్‌ వ్యాపారాలు ఉన్నాయి.

తమ రిలయన్స్‌ హోమ్‌ ఫైనాన్స్‌ సంస్థలో గణనీయమైన వాటాల కొనుగోలు కోసం వ్యూహాత్మక భాగస్వామితో చర్చలు జరుగుతున్నాయని.. మరికొద్ది నెలల్లో ఈ డీల్‌ పూర్తి కాగలదని అనిల్‌ పేర్కొన్నారు. మరోవైపు ఈ త్రైమాసికంలో రిలయన్స్‌ హెల్త్‌ ఇన్సూరెన్స్‌ను కూడా ప్రవేశపెడుతున్నట్లు కంపెనీ ఈడీ అన్‌మోల్‌ అంబానీ తెలిపారు. మరోవైపు, ఆర్బిట్రేషన్‌ ప్యానెల్‌ ఉత్తర్వుల తర్వాత కూడా చెల్లింపులు జరపకుండా ప్రభుత్వ విభాగాలు జాప్యం చేస్తున్నాయంటూ రిలయన్స్‌ ఇన్‌ఫ్రా వార్షిక సాధారణ సమావేశంలో పాల్గొన్న అనిల్‌ అంబానీ ఆరోపించారు. దీనివల్ల తమకు రావాల్సిన దాదాపు రూ. 8,000 కోట్ల బకాయిలు నిల్చిపోయాయని ఆయన పేర్కొన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement