సాక్షి, న్యూఢిల్లీ : ‘35 మిలియన్ పౌండ్ల యాట్ (దాదాపు 337 కోట్ల రూపాయల విలాసవంతమైన విహార పడవ), 60 మిలియన్ పౌండ్ల (దాదాపు 579 కోట్ల రూపాయల) బోయింగ్ జెట్ ప్రైవేటు విమానంతోపాటు ముంబైలో రెండు బిలియన్ డాలర్ల (దాదాపు 19 వేల కోట్ల రూపాయల) విలాసవంతమైన 27 అంతస్తుల కుటుంబ భవనం కలిగిన అనిల్ అంబానీ చేతిలో చిల్లి గవ్వ లేకపోవడం ఏమిటీ?’ అంటూ లండన్ హైకోర్టులో మూడు చైనా బ్యాంకుల తరఫున న్యాయవాది అనిల్ అంబానీని ఉద్దేశించి వాదించారు.
ఈ వాదనను ఆసక్తిగా విన్న హైకోర్టు జడ్జీ డేవిడ్ వాక్స్‌మన్ జోక్యం చేసుకొని ‘మీది విలాసవంతమైన జీవితం అని మాకు తెలుసు. ఒకప్పుడు ప్రైవేటు హెలికాప్టర్‌లో తిరిగిన మీరు బొంబార్డియర్ లెగసీ 650 ప్రైవేటు జెట్ విమానంలో తిరుగుతున్నారు. దాదాపు 2.31 మిలియన్ పౌండ్ల (దాదాపు 22 కోట్ల రూపాయలు) విలువైన 11 కార్లు మీ కుటుంబానికి ఉన్నాయి. పైగా మీకు ప్రత్యేకంగా దక్షిణ బొంబాయిలోని అత్యంత ఖరీదైన భవనంలో రెండు అంతస్థులు ఉన్నాయి.(అప్పులు చెల్లించలేను.. వైరాగ్యంలో అనిల్)
చెల్లించడానికి మీ వద్ద డబ్బు లేకపోవడం ఏమిటీ? మార్చి 20వ తేదీలోగా 80 మిలియన్ పౌండ్లు (దాదాపు 772 కోట్ల రూపాయలు) బ్యాంకులకు చెల్లించండి’ అంటూ అనిల్ అంబానీని ఆదేశించారు. ఒకప్పుడు ప్రపంచ కుబేరుల్లో ఆరువ వ్యక్తిగా రికార్డు సృష్టించిన అనిల్ అంబానీ 2008లో ఆర్థిక మాంద్యం వల్ల రిలయెన్స్ కమ్యూనికేషన్ల ద్వారా తీవ్రంగా నష్టపోయారు. దాన్ని పునరుద్ధరించడంలో భాగంగా ఆయన 2012లో చైనాకు చెందిన మూడు ప్రభుత్వ బ్యాంకుల నుంచి 550 మిలియన్ పౌండ్లు (దాదాపు 5,310 కోట్ల రూపాయలు) రుణంగా తీసుకున్నారు. నాడు అంబానీ వ్యక్తిగత పూచీకత్తుపైనే అంత మొత్తం తీసుకున్నారు. తీసుకున్న రుణాలకు అసలు సంగతి అటుంచితే వడ్డీ కూడా చెల్లించక పోవడంతో చైనాకు చెందిన మూడు బ్యాంకులు ఓ బృందంగా ఏర్పడి అంతర్జాతీయ వాణిజ్య ఒప్పందాల మేరకు లండన్ హైకోర్టులో కేసు పెట్టాయి.
గత డిసెంబర్‌లో ఈ కేసు విచారణ జరగ్గా, నాలుగు రోజుల కిందట మరోసారి కేసు విచారణకు వచ్చింది. కాగా, తన కంపెనీల షేర్ల విలువ మొత్తం 63.7 మిలియన్లు అని, నగదు జీరో అని, తాను రుణాలు చెల్లించే పరిస్థితుల్లో లేనని అనిల్ అంబానీ వాదించారు. ఆ సమయంలో చైనా బ్యాంకుల న్యాయవాది వాదనతో ఏకీభవించిన హైకోర్టు జడ్జీ డేవిడ్ వాక్స్‌మన్, అంబానీని నిలదీశారు. దానికి సమాధానంగా గతంలో స్వీడన్ కంపెనీ ఎరిక్‌సన్‌కు తాను చెల్లించాల్సిన 60 మిలియన్ పౌండ్లను తన సోదరుడు ముకేశ్ అంబానీ చెల్లించారని, ఇంకేమాత్రం తన అప్పులు చెల్లించేందుకు ఆయన సిద్ధంగా లేరని అనిల్ అంబానీ పేర్కొన్నారు. ‘ఫర్వాలేదు. ముందు చెల్లించారు, మొన్న చెల్లించారు, ఇక ముందు కూడా చెల్లిస్తారు. చెల్లించేందుకు ఉమ్మడి ఆస్తులు లేవా?’ అని జడ్జీ ప్రశ్నించారు. తన క్లైయింట్‌ని డబ్బులు చెల్లించాల్సిందిగా ఒత్తిడి తీసుకరావద్దని, అలా చేసినట్లయితే ఆయన తన కేసును తాను సరిగ్గా వాదించుకునే మానసిక పరిస్థితిలో ఉండరని అంబానీ న్యాయవాది వాదించారు. మార్చి 20లోగా చెల్లించాల్సిందేనంటూ హైకోర్టు జడ్జీ కేసు తదుపరి విచారణను వాయిదా వేశారు. కోర్టు ఆదేశాలను పాటిస్తారా ? అని ఇంగ్లండ్ మీడియా అనిల్ అంబానీ న్యాయవాదిని సంప్రదించగా, చట్టపరంగా తదుపరి ప్రత్యామ్నాయాలు ఏమున్నాయో పరిశీలించాల్సి ఉందన్నారు.
చైనా బ్యాంకుల నుంచి డబ్బులు తీసుకున్న ఏడాదే స్టీఫెన్ స్పీల్‌బెర్గ్ దర్శకత్వం వహించిన ‘లింకన్’ హాలివుడ్ చిత్రానికి ఫైనాన్స్ చేయడం ద్వారా అంబానీకి భారీగా డబ్బులు వచ్చినట్లు వార్తలొచ్చాయి. ఆ చిత్రానికి ఉత్తమ చిత్రంతోపాటు ఉత్తమ నటుడిగా రెండు ఆస్కార్ అవార్డులు వచ్చాయి.
Comments
Please login to add a commentAdd a comment