చైనాకు చెక్ పెట్టేందుకు...
సాక్షి, న్యూఢిల్లీ : కీలక రంగాల్లో చైనా కంపెనీల ప్రవేశానికి చెక్ పెట్టేందుకు విద్యుత్, టెలికం నిబంధనలను భారత్ కఠినతరం చేయనుంది. వైరస్‌లను వ్యాప్తి చేసే మాల్‌వేర్‌కు అడ్డుకట్ట వేసేందుకూ ప్రభుత్వం ఈ దిశగా యోచిస్తోంది. దేశీయ మార్కెట్‌లో చైనా స్మార్ట్ ఫోన్లు వెల్లువెత్తిన క్రమంలో స్మార్ట్ ఫోన్ తయారీదారులను భద్రతా ప్రమాణాలు, ఆర్కిటెక్చర్ ఫ్రేమ్ వర్క్‌లపైనా ప్రభుత్వం పూర్తి వివరాలు అందించాలని ప్రభుత్వం కోరింది.
కీలక రంగాల్లో చైనా ఉత్పత్తుల దూకుడుకు కళ్లెం వేయాలని పరిశ్రమ వర్గాలూ ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నాయి. విద్యుత్ పంపిణీ నిర్వహణ, పరికరాల సరఫరాలో పలు చైనా కంపెనీలు సేవలందింస్తుండగా, భారత కంపెనీలను చైనాలో ఈ తరహా వ్యాపారానికి అనుమతించడం లేదని పరిశ్రమ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.దీంతో స్థానిక కంపెనీలకు ప్రాదాన్యత ఇచ్చేలా విద్యుత్ సరఫరా, పంపిణీ కాంట్రాక్టుల బిడ్డింగ్‌కు నూతన నిబంధనలను సూచిస్తూ సెంట్రల్ విద్యుత్ అథారిటీ నివేదికను ప్రభుత్వం పరిశీలిస్తోంది.