
ప్రస్తుత టెలికం యూజర్లకూ ఆధార్..
నకిలీ పత్రాలతో సిమ్ కార్డులు తీసుకున్న ఉదంతాలు అనేకం బైటపడుతున్న నేపథ్యంలో ఆధార్ ఆధారిత ఈ–కేవైసీ విధానం ద్వారా టెలికం సంస్థలు...
ధృవీకరణ కోసం డాట్‌కు ట్రాయ్ సిఫార్సు
న్యూఢిల్లీ: నకిలీ పత్రాలతో సిమ్ కార్డులు తీసుకున్న ఉదంతాలు అనేకం బైటపడుతున్న నేపథ్యంలో ఆధార్ ఆధారిత ఈ–కేవైసీ విధానం ద్వారా టెలికం సంస్థలు ప్రస్తుత మొబైల్ యూజర్లు కూడా ధృవీకరించవచ్చని టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ సిఫార్సు చేసింది. ఈ విధానం అమలు దిశగా ఆయా ఆపరేటర్లు టాక్ టైమ్ లేదా డేటాను యూజ ర్లకు ఉచితంగా అందించవచ్చని పేర్కొంది. టెలికం శాఖ (డాట్)కు పంపిన సిఫార్సుల్లో ట్రాయ్ ఈ అంశాలు ప్రస్తావించింది.
’కొత్త సబ్‌స్క్రయిబర్స్ మాత్రమే కాకుండా ఇప్పటికే ఉన్న యూజర్లను కూడా దశలవారీగా ఈ–కేవైసీ విధానం ద్వారా ధృవీకరించాల్సిన అవసరం ఉంది’ అని ట్రాయ్ పేర్కొంది. అయితే, ఇటు సర్వీస్ ప్రొవైడర్లకు అటు యూజర్లకు ఇది ఐచ్ఛికంగా మాత్రమే ఉండాలని సూచించింది. నకిలీ పత్రాలతో పొందిన వందలాది సిమ్ కార్డులు చలామణీ అవుతున్న కేసులు అనేకం తమ దృష్టికి వచ్చిన నేపథ్యంలో ట్రాయ్ ఈ సిఫార్సులు చేసింది. పేపర్ ఆధారిత కేవైసీతో పోలిస్తే ఆధార్ ఆధారిత ఈ–కేవైసీ విధానం చాలా పటిష్టమైనదిగా పేర్కొంది.