
ముంబై: దేశీయ టెలికం రంగం ఎదుర్కొంటున్న సమస్యలకు సమీప కాలంలోనూ ఉపశమనం ఉండబోదని, స్థిరీకరణ వల్ల ప్రయోజనాలు దీర్ఘకాలంలోనే ఉంటాయని మూడీస్ ఇన్వెస్టర్ సర్వీసెస్ అంచనా వేసింది. టెలికం రంగంలో స్థిరీకరణతో ధరల పరంగా మరింత అనుకూల వాతావరణం ఏర్పడుతుందని, ఇది దీర్ఘకాలానికి సానుకూలమని పేర్కొంది. రిలయన్స్ జియో 2016 సెప్టెంబర్‌లో టెలికం మార్కెట్లోకి ప్రవేశించడంతో... అప్పటికే ఈ రంగంలో ఉన్న ఎయిర్‌టెల్, వొడాఫోన్, ఐడియా, ఆర్‌కామ్‌పై తీవ్ర ఒత్తిళ్లు పడ్డాయి. దీంతో స్థిరీకరణ, ఆస్తుల విక్రయాలు, ఉద్యోగాల నష్టం, దివాలా పరిస్థితులూ నెలకొన్నాయి. ఇవన్నీ మూడీస్ తన నివేదికలో గుర్తు చేసింది. ఆదాయం, లాభాలు క్షీణించి, రుణాలు పెరిగిపోవడంతో... వొడాఫోన్, ఐడియాల మధ్య... టెలినార్, ఎయిర్‌టెల్, టాటా డొకోమోల విలీనాలు చోటు చేసుకున్న విషయం విదితమే. రిలయన్స్ కమ్యూనికేషన్స్, ఎయిర్‌సెల్ సేవలు నిలిపివేశాయి.
ఎయిర్‌టెల్ అయితే తన చరిత్రలో తొలిసారి దేశీయ కార్యకలాపాలపై జూన్ క్వార్టర్లో నష్టాలను ప్రకటించింది. సమీప కాలంలో టెలికంలో 60,000 ఉద్యోగాలు తగ్గుతాయని మూడీస్ అంచనా వేసింది. ‘‘మూడు నుంచి నాలుగు సంస్థలతోపాటు ధరల పరంగా మరింత సహేతుక పరిస్థితులు దీర్ఘకాలంలో సాధ్యమవుతాయి. కానీ, సమీప కాలంలో సగటు కస్టమర్‌పై వచ్చే ఆదాయం (ఏఆర్‌పీయూ) పెరిగేందుకు అవకాశాల్లేవు’’ అని మూడీస్ తేల్చి చెప్పింది. టెలికం కంపెనీల లాభాల మెరుగుదలకు ఏఆర్‌పీయూ వృద్ధి చాలా కీలకం. జియో సైతం సెప్టెంబర్ క్వార్టర్లో ఏఆర్‌పీయూ క్షీణతను ఎదుర్కోవడం గమనార్హం. ఎయిర్‌టెల్‌కు దేశీయంగా సమస్యలను ఎదుర్కొనేందుకు ఆఫ్రికా కార్యకలాపాలు చేదోడుగా నిలుస్తాయని మూడీస్ పేర్కొంది.