
కాల్ డ్రాప్స్‌కి పరిహారం ఇవ్వాల్సిందే..
మొబైల్ కాల్ డ్రాప్ అయితే జనవరి 1 నుంచి కస్టమర్లకు నష్ట పరిహారం చెల్లించాల్సిందేనని టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్.. టెల్కోలకు స్పష్టం చేసింది.
టెల్కోలకు స్పష్టం చేసిన ట్రాయ్
న్యూఢిల్లీ: మొబైల్ కాల్ డ్రాప్ అయితే జనవరి 1 నుంచి కస్టమర్లకు నష్టపరిహారం చెల్లించాల్సిందేనని టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్.. టెల్కోలకు స్పష్టం చేసింది. ఇందుకు తగ్గట్లుగా తమ సిస్టమ్స్‌ను సంసిద్ధం చేసుకోవాలని సూచించింది. టెలికం కంపెనీల ప్రతినిధులతో సమావేశమైన ట్రాయ్ చైర్మన్ ఆర్‌ఎస్ శర్మ ఈ విషయాలు తెలిపారు. పరిహారం నిబంధనను సవరించడం గానీ, రద్దు చేయడం గానీ జరగలేదని ఆయన స్పష్టం చేశారు. కనుక ఆపరేటర్లు దీన్ని అమలు చేయడానికి సిద్ధం కావాల్సిందేనన్నారు.
నెట్‌వర్క్ లోపాల మూలంగా కాల్‌కి అంత రాయం (కాల్ డ్రాప్) కలిగిన పక్షంలో.. కాల్ చేసిన కస్టమరుకు సదరు టెల్కో రూ. 1 పరిహారం చెల్లించాలంటూ ట్రాయ్ ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ పరిహారాన్ని రోజుకు రూ. 3కి పరిమితం చేసింది. అయితే, దీని వల్ల తాము భారీగా నష్టపోవాల్సి ఉంటుందంటూ టెల్కోలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే శర్మ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
సాంకేతిక సాధ్యాసాధ్యాలు పరిశీలించకుండానే పరిహారం నిబంధనను రూపొందించారన్న ఆరోపణలు అవాస్తవమని శర్మ చెప్పారు. ట్రాయ్ అన్ని కోణాలూ అధ్యయనం చేసిన తర్వాతే దీన్ని ప్రతిపాదించిందని ఆయన పేర్కొన్నారు. ఈ నిబంధనను సమీక్షించాలంటూ టెలికం కంపెనీలు కోరుతున్నందున చట్టపరమైన అంశాలను పరిశీలించి తగు నిర్ణయం తీసుకోగలమని, రెండు వారాల్లో టెల్కోలకు ఏ విషయమూ తెలియజేస్తామని శర్మ పేర్కొన్నారు. టెల్కోలను విమర్శించడమే తమ పని కాదని, అవి సర్వీసులు మెరుగుపర్చుకోవడానికి కావాల్సిన తోడ్పాటునివ్వడమే తమ లక్ష్యమన్నారు.
మరోవైపు, కాల్ డ్రాప్స్ సమస్యను టెస్ట్ చేయడానికి ట్రాయ్ ఎంచుకున్న ప్రాంతాలపై టెల్కోలు కొన్ని సందేహాలు వ్యక్తం చేశాయి. దీంతో తాజాపరీక్షల కోసం మరో అయిదు నగరాలను (అహ్మదాబాద్, ఇండోర్, సూరత్, భువనేశ్వర్, కోల్‌కతా) జోడించేందుకు అంగీకరించినట్లు శర్మ పేర్కొన్నారు. సెప్టెంబర్‌లోనే ఈ 5 నగరాల్లోని కొన్ని రూట్లలో పరీక్షలు నిర్వహించినట్లు, దీనికి సంబంధించిన నివేదిక సిద్ధమైందని ఆయన చెప్పారు. దీన్ని ముందుగా టెల్కోలకు ఇచ్చి, వారి వాదనలను తెలుసుకున్నాక.. బహిర్గతం చేయనున్నట్లు శర్మ తెలిపారు.