4జీతో ఈ-కామర్స్కు రెక్కలు! | 4G Could Address Connectivity Issues With E-Commerce | Sakshi
Sakshi News home page

4జీతో ఈ-కామర్స్కు రెక్కలు!

Published Sat, Oct 1 2016 1:24 AM | Last Updated on Mon, Sep 4 2017 3:39 PM

4జీతో ఈ-కామర్స్కు రెక్కలు!

4జీతో ఈ-కామర్స్కు రెక్కలు!

రిలయన్స్ జియో రంగ ప్రవేశంతో టెలికం రంగంలో చోటు చేసుకుంటున్న మార్పులు...

చౌక డేటాతో మరింత మంది ఆన్‌లైన్లోకి
తక్కువ ధరలోనే 4జీ ఫోన్లు  
ఇవన్నీ లాభిస్తాయంటున్న ఈ-కామర్స్ పరిశ్రమ

 హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: రిలయన్స్ జియో రంగ ప్రవేశంతో టెలికం రంగంలో చోటు చేసుకుంటున్న మార్పులు... ఇటు టెలికం వినియోగదారులతో పాటు అటు ఈ-కామర్స్ విక్రయాల పెరుగుదలకూ దోహదం చేస్తాయనే అంచనాలు పెరుగుతున్నాయి. తాజా పరిణామాలతో అత్యాధునిక 4జీ స్మార్ట్‌ఫోన్లు సైతం రూ.3 వేల నుంచే లభించటం మొదలెట్టాయి. ఒకవైపు స్మార్ట్ ఫోన్లు, మరోవైపు చౌక 4జీ... ఈ రెండూ కలసి నెటిజన్లు ఎక్కువసేపు బ్రౌజింగ్ చేయటానికి ఉపకరిస్తాయని, దీంతో తమ అమ్మకాలు కూడా పెరుగుతాయని ఈ-కామర్స్ కంపెనీలు అంచనా వేస్తున్నాయి.

ప్రస్తుతం మొబైల్ కస్టమర్లలో 10 శాతం మందే ఇంటర్నెట్‌ను విస్తృతంగా వాడుతున్నారు. ఇంటర్నెట్ ఉపయోగాలు వీరికి బాగా తెలుసు. డేటా చార్జీలు ఎక్కువగా ఉండడం, కనెక్టివిటీ సమస్యలతో మరో 30 శాతం మంది పరిమితంగా వాడుతున్నారు. మిగిలిన వారు నెట్ బ్రౌజింగ్‌కు ఇంకా అలవాటు పడాల్సి ఉందని ‘షాప్‌క్లూస్ డాట్‌కామ్’ మార్కెటింగ్ అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ నితిన్ అగర్వాల్ చెప్పారు. ప్రస్తుతం మొబైల్ వినియోగదారులు సగటున నెలకు 320 ఎంబీ డేటా వినియోగిస్తున్నారు. జియో రాకతో కొద్ది రోజుల్లో ఇది 1జీబీ దాటుతుందని ఇండస్ ఓఎస్ కంపెనీ చెబుతోంది.

90 రోజులపాటు ఉచితంగా డేటా, వాయిస్ కాల్స్‌ను జియో అందిస్తున్న సంగతి తెలిసిందే. జియోకు ధీటుగా ఇప్పటికే  మిగిలిన టె లికం కంపెనీలు డేటా చార్జీలను భారీగా తగ్గించాయి. ఈ పరిణామంతో ఇంటర్నెట్ వినియోగం భారీగా పెరిగి కస్టమర్లు ఎక్కువ సమయం సర్ఫింగ్‌కు కేటాయిస్తారని, తద్వారా ఈ-కామర్స్ కంపెనీల అమ్మకాలు పెరగడం ఖాయమని అమెజాన్ కేటగిరీ మేనేజ్‌మెంట్ డెరైక్టర్ నూర్ పటేల్ ‘సాక్షి బిజినెస్ బ్యూరో’ ప్రతినిధితో చెప్పారు. స్మార్ట్‌ఫోన్ల ధరలు కూడా దిగిరావడం కలసివచ్చే పరిణామమని చెప్పారాయన. అమెజాన్ ద్వారా జరుగుతున్న స్మార్ట్‌ఫోన్ విక్రయాల్లో 80 శాతం 4జీ మోడళ్లేనని తెలియజేశారు.

సింహభాగం మొబైల్ నుంచే..
ఈ-కామర్స్ కంపెనీలకు 70 శాతానికి పైగా ట్రాఫిక్ మొబైల్స్ నుంచే సమకూరుతోంది. అంటే మొబైల్ నుంచే ఉత్పత్తులకు ఆర్డర్లిస్తున్నారు. వాస్తవానికి ప్రధాన ఈ-కామర్స్ కంపెనీల్లో ఒకొక్కటీ ఎంతకాదన్నా 6-10 కోట్ల ఉత్పత్తులను ఆన్‌లైన్‌లో విక్రయిస్తున్నాయి. అందుకే కస్టమర్లను మరింత ఆకట్టుకోవడానికి యూజర్ ఎక్స్‌పీరియన్స్‌పై పెద్ద ఎత్తున దృష్టి పెట్టాయి. కస్టమర్లు సర్చ్ చేస్తున్నప్పుడు టాప్ సెల్లింగ్ ఉత్పత్తులను సూచించడం ఈ కోవలోకే వస్తుంది. అలాగే కావాల్సిన ఉత్పాదనను సులువుగా ఎంచుకునేలా, ఆర్డరు ఇచ్చేందుకు వీలుగా యాప్స్‌ను అప్‌డేట్ చేస్తున్నాయి. ఉత్పత్తులను విభజించి కేటగిరీల వారీగా ప్రమోట్ చేస్తున్నాయి. ఇక మొబైల్ తయారీ కంపెనీలు సైతం ఇన్‌బిల్ట్‌గా టాప్ ఈ-కామర్స్ సైట్ల యాప్స్‌ను జోడిస్తున్నాయని సెల్‌కాన్ సీఎండీ వై.గురు తెలియజేశారు.

ఇదీ ఈ-కామర్స్ మార్కెట్..
మొబైల్ ఇంటర్నెట్‌పై కస్టమర్లు చేస్తున్న వ్యయం 2014లో 54 శాతం, 2015లో 64 శాతం వృద్ధి చెందింది. దేశంలో ప్రస్తుతం 33 కోట్ల మంది ఇంటర్నెట్ యూజర్లున్నారు. వీరిలో 6 కోట్ల మంది ఆన్ లైన్ కొనుగోలుదారులు. 2013లో ఆన్‌లైన్ వినియోగదారులు 1.5 కోట్లలోపే. ఇక 2019-20 నాటికి ఆన్‌లైన్ కస్టమర్ల సంఖ్య 11 కోట్లకు చేరుతుందని బ్రోకరేజ్ కంపెనీ కోటక్ ఇన్‌స్టిట్యూషనల్ ఈక్విటీస్ తన రీసెర్చ్ నివేదికలో వెల్లడించింది. తద్వారా ఈ-టైలింగ్ పరిమాణం 28 బిలియన్ డాలర్లకు ఎగుస్తుందని తెలిపింది. ప్రస్తుతం ఈ-టైలింగ్ పరిమాణం 15 బిలియన్ డాలర్లుంది. ఆన్‌లైన్ షాపింగ్ 2014లో 14 శాతం వృద్ధి చెందితే, 2016లో 27 శాతం అధికమయింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement