న్యూఢిల్లీ: టెలికం రంగ మొబైల్ దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్ ఈ ఆర్థిక సంవత్సరం(2020–21) మూడో త్రైమాసికంలో ఆకర్షణీయ ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన క్యూ3(అక్టోబర్–డిసెంబర్)లో రూ. 854 కోట్ల నికర లాభం ఆర్జించింది. గతేడాది క్యూ3లో రూ. 1,035 కోట్ల నికర నష్టం ప్రకటించింది. వెరసి ఆరు క్వార్టర్ల తదుపరి టర్న్‌అరౌండ్ ఫలితాలు ప్రకటించింది. కాగా.. ప్రస్తుత సమీక్షా కాలంలో మొత్తం ఆదాయం 24 శాతం ఎగసి రూ. 26,518 కోట్లను తాకింది. తద్వారా మూడు నెలల కాలానికి కంపెనీ చరిత్రలోనే అత్యధిక ఆదాయాన్ని అందుకుంది. ఇందుకు మొబైల్ టారిఫ్‌లు మెరుగుపడటం, కస్టమర్ల సంఖ్య పుంజుకోవడం వంటి అంశాలు దోహదపడ్డాయి. క్యూ3లో దేశీ బిజినెస్ టర్నోవర్ సైతం 25 శాతం జంప్‌చేసి రూ. 19,007 కోట్లకు చేరింది. ఒక్కో వినియోగదారుపై సగటు ఆదాయం(ఏఆర్‌పీయూ) రూ. 135 నుంచి రూ. 166కు ఎగసింది. క్యూ3లో ఆఫ్రికా నుంచి ఆదాయం 22 శాతం పుంజుకుని రూ. 7,644 కోట్లను అధిగమించింది.
యూజర్లు 45.79 కోట్లకు...
కంపెనీ కస్టమర్ల సంఖ్య 9.4 శాతం పెరిగి 45.79 కోట్లకు చేరింది. దేశీయంగా ఈ సంఖ్య 30.87 కోట్ల నుంచి 33.62 కోట్లకు ఎగసింది. ఆఫ్రికాలో వినియోగదారుల సంఖ్య 11% వృద్ధితో 11.89 కోట్లను తాకింది. డిసెంబర్‌కల్లా కంపెనీ రుణ భారం రూ. 1,47,438 కోట్లుగా ఉంది. డిబెంచర్లు, బాండ్లు తదితర మార్గాలలో నిధుల సమీకరణకు బోర్డు అనుమతించినట్లు ఎయిర్‌టెల్ తాజాగా వెల్లడించింది. ఒకేసారి లేదా దశలవారీగా రూ. 7,500 కోట్లవరకూ సమీకరించేందుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు తెలిపింది.
అనిశ్చితి ఉన్నా
ఏడాది పొడవునా అనిశ్చిత వాతావరణం ఉన్నప్పటికీ మరోసారి పటిష్ట పనితీరును చూపగలిగినట్లు భారతీ ఎయిర్‌టెల్ దక్షిణాసియా ఎండీ, సీఈవో గోపాల్ విఠల్ పేర్కొన్నారు. పోర్ట్‌ఫోలియోలోని ప్రతీ విభాగంలోనూ స్థిరమైన వృద్ధిని సాధించినట్లు తెలియజేశారు. పెరిగిన మార్కెట్ వాటా ద్వారా ఇది ప్రతిఫలిస్తున్నట్లు చెప్పారు. క్యూ3లో ప్రధానంగా 13 మిలియన్ల 4జీ కస్టమర్లు కొత్తగా జత కలిసినట్లు పేర్కొన్నారు. తద్వారా ఈ సంఖ్య 165.6 మిలియన్లకు చేరినట్లు తెలియజేశారు. దేశంలోనే తొలిసారిగా హైదరబాద్ నగరంలో ఒక వాణిజ్య నెట్‌వర్క్‌పై 5జీ లైవ్‌ను ప్రదర్శించినట్లు వెల్లడించారు.
ఫలితాల నేపథ్యంలో భారతీ ఎయిర్‌టెల్ షేరు ఎన్‌ఎస్‌ఈలో
2 శాతం లాభపడి రూ. 612 వద్ద ముగిసింది.
మళ్లీ ఎయిర్‌టెల్ లాభాల ట్యూన్
Published Thu, Feb 4 2021 4:42 AM | Last Updated on Thu, Feb 4 2021 4:42 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment