4జీ స్మార్ట్‌ఫోన్లు (ఫైల్ ఫోటో)
న్యూఢిల్లీ : దేశీయ టెలికాం ఆపరేటర్లు రూ.500 కన్నా తక్కువ ధరలో 4జీ స్మార్ట్‌ఫోన్‌లను మార్కెట్‌లోకి తీసుకురావడానికి కసరత్తు చేస్తున్నాయి. రిలయన్స్ జియో లాంచ్‌చేసిన జియోఫోన్‌కు గట్టి పోటీ ఇచ్చేందుకు ఎయిర్‌టెల్, వొడాఫోన్, ఐడియా సెల్యులార్‌లు ఈ కసరత్తు చేస్తున్నాయని తెలిసింది. కానీ 500 రూపాయలకే స్మార్ట్‌ఫోన్లను తీసుకొస్తున్న ఈ కంపెనీలకు, అసలెంత భారం పడుతుందో వివరిస్తూ.. టెలికాం ఇండస్ట్రీ అంచనాలు విడుదల చేసింది. ఈ అంచనాల్లో కంపెనీ భరించబోయే భారం చాలా పెద్ద మొత్తంలోనే ఉన్నట్టు తేలింది.
ఎంట్రీ-లెవల్ 4జీ ఎనాబుల్డ్ స్మార్ట్‌ఫోన్‌ను తయారు చేయడానికి సగటును 3వేల రూపాయల మేర ఖర్చు అవుతుంది. ఈ డివైజ్‌లకు కనుక ఎక్కువ మొత్తంలో ఆర్డర్ చేస్తే.. దీని ఖర్చు 2700 రూపాయలకు తగ్గవచ్చు. కానీ దీని కంటే ఐదింతల తక్కువ రేటుకు అంటే 500 రూపాయలకే 4జీ స్మార్ట్‌ఫోన్‌ను ఆఫర్ చేస్తామని కంపెనీలు చెబుతున్నాయి. ఇలా 500 రూపాయలకే స్మార్ట్‌ఫోన్లను అందించడం వల్ల టెలికాం కంపెనీలు దాదాపు 26వేల కోట్ల భారాన్ని భరించాల్సి వస్తుందని తెలుస్తోంది. ఇప్పటికే ఆర్థికంగా చితికి పోయిన టెలికాం పరిశ్రమకు, ఈ సబ్సిడీ అదనపు భారమని, కాస్త జాగ్రత్తగా వ్యవహరించాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అంతేకాక రుణాలు కూడా మరో రూ.5 లక్షల కోట్లకు పెరుగుతాయని పేర్కొంటున్నారు.
నెలకు 60 రూపాయల రీఛార్జ్ ప్లాన్‌తో ఈ డివైజ్‌లను టెలికాం కంపెనీలు ప్రవేశపెట్టబోతున్నాయి. అంటే ఏడాదికి 117 మిలియన్ యూజర్ల నుంచి రూ.8,424 కోట్లను టెలికాం కంపెనీలు రికవరీ చేసుకోవచ్చు. దీని ప్రకారం కంపెనీలు ఆఫర్ చేసిన మొత్తం సబ్సిడీని రికవరీ చేసుకోవాలంటే దాదాపు మూడేళ్లకు పైగానే సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది. అదీ కూడా కస్టమర్ ఒకే ఆపరేటర్‌ను వాడితే తప్ప, ఆ రికవరీ సాధ్యం కాదు. మరోవైపు భారీగా పెరుగుతున్న పోటీతర వాతావరణ నేపథ్యంలో, రికవరీ కాలం మరింత పెరిగినా ఆశ్చర్యం పోక్కర్లేదని తెలుస్తోంది.
మొత్తం 1.2 బిలియన్ మంది వైర్‌లెస్ సబ్‌స్క్రైబర్లుండగా.. 780 మిలియన్ల మంది ఫీచర్ ఫోన్ వాడుతున్నారు. దేశీయ మార్కెట్‌లో స్మార్ట్‌ఫోన్ వాడకం తక్కువగా ఉందని, ఇంటర్నెట్ ఎనాబుల్డ్ ఫోన్లను ఎక్కువగా ప్రజలకు ఆఫర్ చేయాల్సినవసరం ఉందని ఐడీసీ ఇండియా సీనియర్ మార్కెట్ అనాలిస్ట్ జైపాల్ సింగ్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment