5జీ మొబైల్స్‌ సందడి షురూ | Sales of 10 lakh 5G phones in three months | Sakshi
Sakshi News home page

5జీ మొబైల్స్‌ సందడి షురూ

Published Tue, Dec 1 2020 1:45 AM | Last Updated on Tue, Dec 1 2020 4:35 AM

Sales of 10 lakh 5G phones in three months - Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: దేశంలో ఇప్పటికీ టెలికం రంగంలో 4జీ సేవలు విస్తరించలేదు. మరోవైపు 5జీ అందుబాటులోకి రావడానికి మరికొంత సమయం పడుతుంది. అయినప్పటికీ హ్యాండ్‌సెట్స్‌ తయారీ సంస్థలు దూకుడుగా ఉన్నాయి. 5జీ మోడళ్లతో పోటీకి సై అంటున్నాయి. ఐడీసీ గణాంకాల ప్రకారం ఈ ఏడాది జూలై–సెప్టెంబరులో భారత్‌లో 10 లక్షల పైచిలుకు 5జీ స్మార్ట్‌ఫోన్లు కస్టమర్ల చేతుల్లోకి వెళ్లాయి.

ఏప్రిల్‌–జూన్‌తో పోలిస్తే ఇది 500 శాతం అధికం. దీనినిబట్టి చూస్తే అటు కస్టమర్లూ నూతన టెక్నాలజీ పట్ల ఆసక్తిగా ఉన్నట్టు స్పష్టమవుతోంది. 5జీ సేవలు రాకముందే ఈ స్మార్ట్‌ఫోన్లు పెద్ద ఎత్తున వినియోగదార్ల చేతుల్లోకి వచ్చే అవకాశం ఉందని టెలికం రంగం అంచనా వేస్తోంది. క్వాల్‌కాం, మీడియాటెక్‌ వంటి చిప్‌సెట్‌ తయారీ సంస్థలు నూతన టెక్నాలజీ చిప్‌సెట్లను ఆఫర్‌ చేస్తున్నాయి. సేవల కంటే ముందే చిప్‌సెట్ల ధరలూ దిగొస్తున్నాయి.  

ఒకదాని వెంట ఒకటి..
యాపిల్, శామ్‌సంగ్, షావొమీ, వన్‌ప్లస్, ఆసస్, వివో, ఒప్పో, మోటరోలా, రియల్‌మీ, హువావే ఇప్పటికే భారత 5జీ హ్యాండ్‌సెట్స్‌ మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చాయి. హానర్, సోని, నోకియా, గూగుల్, ఎల్‌జీ, నూబియా, బ్లాక్‌షార్క్, జడ్‌టీఈ, టీసీఎల్, మీజు, షార్ప్‌ త్వరలో రంగ ప్రవేశం చేయనున్నాయి. ప్రస్తుతం ఆన్‌లైన్‌తోపాటు ఆఫ్‌లైన్‌లో 40 దాకా మోడళ్లు అందుబాటులో ఉన్నాయి. వీటి ధరలు సుమారు రూ.24,000 నుంచి ప్రారంభం.

త్వరలో 120కి పైగా కొత్త మోడళ్లు రానున్నాయి. 4జీతో పోలిస్తే 5జీ స్మార్ట్‌ఫోన్ల ధర పెద్దగా వ్యత్యాసం లేకపోవడం కూడా కలిసి వచ్చే అంశమని బిగ్‌–సి ఫౌండర్‌ ఎం.బాలు చౌదరి సాక్షి బిజినెస్‌ బ్యూరోకు తెలిపారు. ‘ఇప్పటికే సగటు స్మార్ట్‌ఫోన్‌ ధర రూ.14–15 వేలకు వచ్చింది. 5జీ విషయంలో తయారీ సంస్థలు, కస్టమర్లు రెడీగా ఉన్నారు. ప్రభుత్వం వేగంగా చర్యలు తీసుకుంటే 5జీ టెలికం సేవలు త్వరితంగా అందుబాటులోకి వస్తాయి’ అని అన్నారు.

వచ్చే ఏడాది నుంచి..
భారత్‌లో ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి 5జీ మోడళ్ల రాక క్రమంగా పెరుగుతూ వస్తోంది. 2021 ప్రారంభంలో రూ.15,000–25,000 ధరల శ్రేణిలో స్మార్ట్‌ఫోన్లన్నీ 5జీ టెక్నాలజీతో రానున్నాయని అంచనా. రూ.8–15 వేల ధరల శ్రేణిలో మోడళ్లు వస్తే కొనుగోళ్లు అనూహ్యంగా అధికమవుతాయని సెల్‌ పాయింట్‌ ఫౌండర్‌ మోహన్‌ ప్రసాద్‌ పాండే తెలిపారు. సోషల్‌ మీడియాలో యువత చాలా చురుకుగా ఉంటోంది. 5జీ టెక్నాలజీ వస్తే ఫొటోలు, వీడియోలు వేగంగా అప్‌లోడ్‌ చేసుకోవచ్చు, వీక్షించొచ్చు అని అన్నారు.

5జీ హ్యాండ్‌సెట్స్‌ కోసం కస్టమర్లు పరుగెత్తాల్సిన అవసరం లేదు. బ్రాండ్స్‌ దూకుడు చూస్తుంటే 4జీ నుంచి 5జీకి వినియోగదార్లు సులభంగా మళ్లుతారని టెక్‌ఆర్క్‌ అనలిస్ట్‌ ఫైజల్‌ కవూసా చెప్పారు. 3జీ నుంచి 4జీకి కస్టమర్ల ఆదరణకు నాలుగేళ్లు పట్టింది. 2012లో దేశంలో 4జీ ప్రారంభం అయినప్పుడు ఒక్క బ్రాండ్‌ నుంచి కూడా స్మార్ట్‌ఫోన్లు అందుబాటులో లేకపోవడం గమనార్హం. 5జీ విషయంలో ప్రస్తుతం అందుకు భిన్నమైన వాతావరణం ఉంది.

ఆరేళ్లలో 35 కోట్లకు 5జీ యూజర్లు
► ప్రపంచవ్యాప్తంగా 350 కోట్ల కనెక్షన్లు
► 2026 నాటికి ఎరిక్సన్‌ అంచనా

న్యూఢిల్లీ: భారత్‌లో 5జీ కనెక్షన్లు 2026 నాటికి 35 కోట్లకు చేరవచ్చని అంతర్జాతీయ టెలికం సంస్థ ఎరిక్సన్‌ అంచనా వేస్తోంది. అలాగే ప్రపంచవ్యాప్తంగా సబ్‌స్క్రిప్షన్స్‌ సంఖ్య 350 కోట్లకు చేరగలవని ’ఎరిక్సన్‌ మొబిలిటీ రిపోర్ట్‌ 2020’ పేరుతో విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. వచ్చే ఏడాది తొలినాళ్లలో స్పెక్ట్రం వేలం నిర్వహించిన పక్షంలో 2021లోనే భారత్‌లో తొలి 5జీ కనెక్షన్‌ అందుబాటులోకి రాగలదని ఎరిక్సన్‌ నెట్‌వర్క్‌ సొల్యూషన్స్‌ విభాగం హెడ్‌ (ఆగ్నేయాసియా, భారత్‌) నితిన్‌ బన్సల్‌ తెలిపారు. ‘2026లో ప్రపంచ జనాభాలో 60 శాతం మందికి 5జీ కవరేజీ ఉంటుంది.

కనెక్షన్ల సంఖ్య 350 కోట్ల దాకా చేరొచ్చని అంచనా. భారత్‌లో 5జీ సబ్‌స్క్రైబర్స్‌ సంఖ్య 35 కోట్లు దాటిపోవచ్చు. 2026లో మొత్తం మొబైల్‌ సబ్‌స్క్రిప్షన్స్‌లో దీని వాటా 27 శాతంగా ఉండవచ్చు‘ అని బన్సల్‌ పేర్కొన్నారు.  టెలికం సేవలకు సంబంధించి భారత్‌లో ప్రస్తుతం ఎల్‌టీఈ (4జీ) టెక్నాలజీదే ఆధిపత్యం ఉందని, మొత్తం మొబైల్‌ సబ్‌స్క్రిప్షన్స్‌లో దీని వాటా 63 శాతంగా ఉందని నివేదికలో వెల్లడైంది. 2026 నాటికి దశలవారీగా 3జీ సేవలు నిల్చిపోతాయని అంచనా వేస్తున్నట్లు తెలిపింది. భారత్‌లో ఎల్‌టీఈ యూజర్ల సంఖ్య 2020లో 71 కోట్లుగా ఉండగా 2026 నాటికి సుమారు 2 శాతం వార్షిక వృద్ధితో 82 కోట్లకు చేరవచ్చని భావిస్తున్నట్లు నివేదిక పేర్కొంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement