న్యూఢిల్లీ : జీరో జియోఫోన్ అంటూ ఫీచర్ ఫోన్ మార్కెట్‌లో సంచలన ఆవిష్కరణ సృష్టించిన రిలయన్స్ జియో ఇన్ఫోకామ్, ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌పై దృష్టిపెట్టింది. ఫీచర్ ఫోన్ మాదిరి చౌకైన 4జీ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయాలని జియో చూస్తున్నట్టు చైనీస్ చిప్ తయారీదారి స్ప్రెడ్‌ట్రమ్ కమ్యూనికేషన్ చైర్మన్ లియో లి చెప్పారు. ఆ హ్యాండ్‌సెట్‌కు పరికరాలను సరఫరాల చేయడం కోసం జియో స్ప్రెడ్‌ట్రమ్‌తో చర్చలు జరిపినట్టు తెలిసింది. ఇప్పటికే జియో ఫీచర్‌ఫోన్‌కు పరికరాలను ఇది అందిస్తోంది. ఈ ఏడాది ముగింపు వరకు షాంఘైకి చెందిన తమ కంపెనీ జియోకు చెందిన 10 మిలియన్ 4జీ ఫీచర్ ఫోన్లకు చిప్స్‌ను సరఫరా చేయనుందని లియో లి తెలిపారు.
అతి తక్కువ ధరలో జియో తీసుకొస్తున్న స్మార్ట్‌ఫోన్ 4 అంగుళాల స్క్రీన్‌ను కలిగి ఉంటుందని లి తెలిపారు. అయితే ఈ విషయాన్ని ఇంకా జియో ధృవీకరించలేదు. ప్రపంచవ్యాప్తంగా భారత్ అత్యంత ముఖ్యమైన మార్కెట్ అని లి తెలిపారు. తాము జియోతో కలిసి చాలా సన్నిహితంగా పనిచేస్తున్నామని, తాము 4జీ ఫీచర్‌ఫోన్లను అత్యంత తక్కువ ధరకు అందిస్తున్నామని, ఈ ఏడాది ముగింపు వరకు 10 మిలియన్ డివైజ్‌లను విక్రయించనున్నట్టు పేర్కొన్నారు. 4జీ ఫీచర్‌ఫోన్ల లాంచింగ్‌తో ముఖేష్ అంబానీకి చెందిన జియో మొబైల్ ఫోన్ మార్కెట్‌లో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. గ్రూప్ కంపెనీ అయిన రిలయన్స్ రిటైల్‌లో మూడేళ్ల డిపాజిట్ కింద రూ.1500 కట్టి ఈ డివైజ్‌ను వినియోగదారులు కొనుగోలు చేయవచ్చు. తాజాగా జియో అత్యంత చౌకగా స్మార్ట్‌ఫోన్‌ను కూడా అందించబోతున్నట్టు స్ప్రెడ్‌ట్రమ్ పేర్కొంది. మరోవైపు స్థానిక హ్యాండ్‌సెట్ తయారీదారులతో కూడా భాగస్వామ్యం ఏర్పరచుకోవాలని స్ప్రెడ్‌ట్రమ్ చూస్తోంది. కానీ మార్కెట్ వాటాను చైనీస్ ప్లేయర్లకు ఇచ్చేందుకు దేశీయ కంపెనీలు సుముఖంగా లేనట్టు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment