
పీవీ గొప్ప సంస్కరణవేత్త కాదు
- తప్పనిసరి పరిస్థితుల వల్లే సంస్కరణలు తెచ్చారు: జైట్లీ
- పీవీ ప్రధాని అయినపుడు దేశం దివాలా తీసే పరిస్థితి ఉంది
ముంబై : మాజీ ప్రధాని పి.వి.నరసింహారావు గొప్ప సంస్కరణవేత్తో, పెద్ద సరళీకరణవేత్తో కాదని, నెహ్రూ తరహా ఆర్థిక విధానాలు విఫలమవటంతో తప్పనిసరి పరిస్థితుల్లోనే పీవీ సంస్కరణలను ప్రారంభించారని కేంద్ర ఆర్థికమంత్రి జైట్లీ వ్యాఖ్యానించారు. పీవీ ప్రధానిగా ఉండగా 1991లో దేశంలో ఆర్థిక సంస్కరణలను ప్రారంభించారు. జైట్లీ శనివారం ముంబైలో బీజేపీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. పీవీ మీద రాసిన పుస్తకం (హాఫ్ లయన్: హౌ పి.వి.నరసింహారావ్ ట్రాన్స్‌ఫార్మ్‌డ్ ఇండియా)లో ప్రస్తావించిన ఒక ఘటనను ఉటంకిస్తూ.. ‘‘పీవీ ఏపీలో న్యాయశాఖ మంత్రిగా ఉన్నపుడు ప్రైవేటు కాలేజీలన్నిటినీ రద్దుచేయాలని, ప్రభుత్వమే కాలేజీలు నడపాలన్నది ఆయన తొలి నిర్ణయం. కానీ ఆయన ప్రధాని అయినపుడు దేశ ఖజానాలో విదేశీ మారకద్రవ్య నిల్వలు లేవని ఆయన గుర్తించారు.
దేశం దివాలా దిశగా పోతోంది. తప్పనిసరి స్థితి కారణంగా సంస్కరణలు తెచ్చారు.’ అని అన్నారు. తీవ్ర విమర్శల పాలైన ‘హిందూ వృద్ధి రేటు’ (ఆర్థిక సంస్కరణలకు పూర్వం 1950 - 1980ల మధ్య దేశంలో వృద్ధి రేటు)కు నెహ్రూ ఆర్థికవిధానాలే కారణమన్నారు. ‘‘1950, 60లలో మనకు పరిమిత వనరులు ఉన్నాయి. 70లు, 80లలో వృథా అయ్యాయి. అప్పుడు కొన్ని పనులు తామే చేయాలనేది ప్రభుత్వ ఆలోచన. టెలికం రంగం ఇందుకు ఉదాహరణ. 1947-95 వరకూ ఫోన్ కనెక్షన్ ఇవ్వడం తమ పనేనని ప్రభుత్వాలు భావించాయి. తొలి 50 సంవత్సరాల్లో భారతీయుల్లో ఒక శాతం కన్నా తక్కువ మందికే టెలిఫోన్లు ఉన్నాయి. కానీ టెలికాం రంగంలోకి ప్రైవేటు రంగం ప్రవేశించాక కనెక్షన్ల సంఖ్య 20 ఏళ్లలో 80 శాతానికి పెరిగాయి. తప్పనిసరి పరిస్థితితో నెహ్రూ తరహా ఆలోచనా విధానం నుంచి బయటకు వచ్చాం’’ అని అన్నారు.