
ముంబై: రిలయన్స్ జియో ప్రవేశంతో టెలికం రంగంలో నెలకొన్న ప్రతికూల పరిస్థితులు కొనసాగుతాయని, వరుసగా మూడో ఏడాది టెలికం కంపెనీల ఆదాయం తగ్గనుందని ఇక్రా రేటింగ్స్ తెలిపింది. 2019–20 ఆర్థిక సంవత్సరంలో స్వల్ప రికవరీకి అవకాశాలున్నాయని అంచనా వేసింది. ‘‘జియో సేవల ఆరంభం తర్వాత మొదలైన తీవ్ర పోటీ, ధరల ఒత్తిళ్లు కంపెనీల ఆర్థిక పనితీరును తీవ్రంగా కుంగదీసింది. దీంతో వాటి ఆదాయాలు, లాభాలు క్షీణించాయి’’ అని ఇక్రా పేర్కొంది. 2017–18లో టెలికం కంపెనీల ఆదాయం 11 శాతం క్షీణించి రూ.2.1 లక్షల కోట్లుగా ఉండగా, 2018–19లో 7% తగ్గుతాయని ఇక్రా అంచనా వేసింది. 2019–20లో మాత్రం 6% వృద్ధి ఉంటుందని పేర్కొంది.
నిర్వహణ లాభం గత ఆర్థిక సంవత్సరంలో 21% క్షీణించగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 18% తగ్గుదలకే పరిమితం కావచ్చని తెలిపింది. పరిస్థితులు కొంత మెరుగుపడినప్పటికీ ఇది తక్కువ స్థాయిలోనే ఉండొచ్చంది. 2019–20లో టెల్కోలు రూ.90,000 కోట్ల నుంచి లక్ష కోట్ల వరకు రుణాలను తగ్గించుకోవచ్చని అంచనా వేసింది. మొత్తం మీద టెలికం రుణ భారం రూ.4.75 లక్షల కోట్ల నుంచి, వచ్చే ఆర్థిక సంవత్సరానికి రూ.4.3 లక్షల కోట్లకు తగ్గొచ్చని పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment