
న్యూఢిల్లీ: నష్టాలు, రుణాలతో కుదేలవుతున్న టెలికం సంస్థ వొడాఫోన్ ఐడియాకు తాజాగా ఏజీఆర్ బాకీలు మరింత భారంగా మారాయి. దీంతో ప్రస్తుతం ఏజీఆర్ బకాయిలను కట్టే పరిస్థితుల్లో లేమని కేంద్ర సమాచార శాఖకు కంపెనీ లేఖ రాసింది. సంక్షోభంలో ఉన్న టెలికం రంగంలో కనీస చార్జీ విధానం అమలుకు అనుమతించడంతో పాటు సుంకాలు తగ్గించాలని, విడతలవారీగా బాకీలు చెల్లించే వెసులుబాటు కల్పించాలని కోరింది. ప్రభుత్వం నుంచి రావల్సిన జీఎస్‌టీ క్రెడిట్‌ను సర్దుబాటు చేస్తే .. ఏజీఆర్ చెల్లింపులపరంగా కొంత తోడ్పాటు లభించగలదని వివరించింది. సవరించిన స్థూల ఆదాయం (ఏజీఆర్) లెక్కలకు అనుగుణంగా టెలికం శాఖ అంచనాల ప్రకారం వొడాఫోన్ ఐడియా రూ. 53,000 కోట్లు పైగా కట్టాల్సి ఉంది. ఇందులో ఇప్పటిదాకా 7 శాతం మాత్రమే కట్టింది. సుమారు 30 కోట్ల పైగా యూజర్లు, 10,000 పైచిలుకు ఉద్యోగులు ఉన్న తమ సంస్థను ఆదుకునేందుకు ప్రభుత్వం తక్షణ తోడ్పాటు చర్యలు తీసుకోవాలని వొడాఫోన్ ఐడియా కోరింది.
మూడేళ్ల మారటోరియం..
కేంద్రం దగ్గరున్న సుమారు రూ. 8,000 కోట్ల జీఎస్‌టీ క్రెడిట్‌ను బాకీల కింద సెటాఫ్ చేసుకునే వెసులుబాటు కల్పిస్తే స్వీయ మదింపు ప్రకారం తాము కట్టాల్సిన మిగతా మొత్తాన్ని చెల్లించగలమని వొడాఫోన్ ఐడియా తెలిపింది. వడ్డీ, పెనాల్టీ చెల్లింపుపై మూడేళ్ల మారటోరియం విధించాలని, మిగతా మొత్తాన్ని చెల్లించేందుకు 15 ఏళ్ల గడువు ఇవ్వాలని, ఆరు శాతం రేటు చొప్పున వడ్డీ విధించాలని కోరింది. అలాగే లైసెన్సు ఫీజును ప్రస్తుతమున్న ఎనిమిది శాతం నుంచి మూడు శాతానికి తగ్గించాలని, స్పెక్ట్రం యూసేజీ చార్జీలను (ఎస్‌యూసీ) సున్నా స్థాయికి లేదా అన్ని రకాల స్పెక్ట్రంనకు ఒకే విధంగా ఒక్క శాతం రేటును వర్తింపచేయాలని విజ్ఞప్తి చేసింది.
డేటా కనీస చార్జీలను రూ. 35కు పెంచాలి..
పోటీ ఎదుర్కొనేందుకు తప్పనిసరై చౌక టారిఫ్‌లు అమలు చేస్తుండటమే తమ ప్రస్తుత దుస్థితికి కారణమని, తక్షణం కనీస చార్జీల విధానాన్ని తక్షణం ఏప్రిల్ 1 నుంచే అమల్లోకి వచ్చేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని కోరింది. మొబైల్ డేటా 1 జీబీకి కనీస టారిఫ్ రూ. 35గా నిర్ణయించాలని, అలాగే నెలవారీ కనీస కనెక్షన్ చార్జీలను రూ.50కి పెంచాలని కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. ప్రస్తుతం మొబైల్ డేటా ఖరీదు ప్రతీ జీబీకి రూ. 4–5 శ్రేణిలో ఉంటోంది. మరోవైపు, వొడాఫోన్ ఐడియా విజ్ఞప్తుల అమలు కష్టసాధ్యమని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. చార్జీలను 50 శాతం దాకా ఇటీవలే పెంచిన వొడాఫోన్ ఐడియా.. మూడు నెలలు కూడా గడవకముందే మళ్లీ కాల్, ఇంటర్నెట్ రేట్లను పెంచాలంటూ కోరుతుండటం గమనార్హం.
సీవోఏఐ కూడా అదే బాటలో..
బాకీల చెల్లింపు విషయంలో నిబంధనలను సడలించాలని, తక్కువ వడ్డీ రేట్లపై రుణాలు లభించేలా చూడాలని, కనీస చార్జీల విధానాన్ని సత్వరం అమలు చేయాలంటూ సెల్యులార్ ఆపరేటర్ల సమాఖ్య సీవోఏఐ కూడా కూడా కేంద్రాన్ని కోరింది. సంక్షోభంలో చిక్కుకున్న టెల్కోలకు రుణాలివ్వడానికి బ్యాంకులు ముందుకు రావడం లేదని, టెలికం రంగానికి ప్రభుత్వం దన్నుగా ఉంటుందని కేంద్రం భరోసానివ్వాలని విజ్ఞప్తి చేసింది. టెలికం శాఖ కార్యదర్శి అన్షు ప్రకాష్‌కి సీవోఏఐ డైరెక్టర్ జనరల్ రాజన్ మాథ్యూస్ ఈ మేరకు లేఖ రాశారు. లైసెన్సు ఫీజులకు సంబంధించి బ్యాంక్ గ్యారంటీలిచ్చే విధానాన్ని తొలగించాలని, ఒకవేళ వీలు కాని పక్షంలో గ్యారంటీ మొత్తాన్ని.. లైసెన్సు ఫీజులో పావు శాతానికైనా తగ్గించాలని సీవోఏఐ కోరింది. ఏజీఆర్ బాకీల కింద మొత్తం 15 టెల్కోలు సుమారు రూ. 1.47 లక్షల కోట్లు కట్టాల్సి ఉంది.
నేడు డీసీసీ సమావేశం..
సంక్షోభంలో చిక్కుకున్న టెలికం రంగానికి తోడ్పాటునిచ్చే చర్యలపై చర్చించేందుకు డిజిటల్ కమ్యూనికేషన్స్ కమిషన్ (డీసీసీ) నేడు (శుక్రవారం) సమావేశం కానున్నట్లు సమాచారం. విడతలవారీగా చెల్లించే అవకాశం కల్పించడంతో పాటు ఇతరత్రా ప్రత్యామ్నాయ చర్యలు కూడా ఇందులో చర్చకు రావొచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి. అయితే, వొడాఫోన్ ఐడియా వంటి కంపెనీలు అదనంగా కట్టే దాన్ని బట్టి ఊరట చర్యలు ప్రకటించే అవకాశం ఉందని వివరించాయి.
Comments
Please login to add a commentAdd a comment