
టెల్కోల ‘డేటా’ మంత్రం..!
ఫేస్‌బుక్, వాట్సాప్, యూట్యూబ్.. మాధ్యమం ఏదైతేనేం ఇప్పుడు భారత్‌లో స్మార్ట్‌ఫోన్ల విప్లవం నడుస్తోంది
ఆఫర్లతో కస్టమర్లకు వల.. పోటాపోటీగా అదనపు ప్రయోజనాలు
డేటా ఆదాయం పెంచుకోవడమే లక్ష ్యం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : ఫేస్‌బుక్, వాట్సాప్, యూట్యూబ్.. మాధ్యమం ఏదైతేనేం ఇప్పుడు భారత్‌లో స్మార్ట్‌ఫోన్ల విప్లవం నడుస్తోంది. సెకనుకు పైసా, అన్‌లిమిటెడ్ వంటి వాయిస్ ప్యాక్‌ల నుంచి టెలికం కంపెనీలు డేటా వైపు మళ్లుతున్నాయి. డేటా వినియోగం ఊహించని స్థాయిలో అధికమవుతుండడంతో కస్టమర్లను ఆకట్టుకునే పనిలో టెల్కోలు నిమగ్నమయ్యాయి. వాయిస్ ప్యాక్‌ల మాదిరిగానే డేటాకు సైతం రూ.10 లోపే రీచార్జ్ వోచర్లను కంపెనీలు ఇప్పటికే తీసుకొచ్చాయి.
తాజాగా మరో అడుగు ముందుకేసిన సంస్థలు రెండింతల డేటా, అన్‌లిమిటెడ్ వంటి ఆఫర్లు ఇస్తున్నాయి. చార్జీల తగ్గింపు, వినియోగించని డేటాను తదుపరి నెలకు క్యారీ ఫార్వార్డ్ సౌకర్యాన్నీ తీసుకొచ్చాయి. రిలయన్స్ జియో రంగంలోకి దిగితే టెలికం రంగంలో అనూహ్య మార్పులు చోటు చేసుకోనున్నాయి. అందుకే ఇప్పుడు మార్కెట్లో ఉన్న కంపెనీలు తమ వాటాను సుస్థిరం చేసుకునే పనిలో పడ్డాయి.
కస్టమర్లను పెంచుకోవడానికి: మొబైల్ ఫోన్ తయారీ కంపెనీలు ఒకదాన్ని మించి ఒకటి ఆకట్టుకునే ఫీచర్లతో స్మార్ట్‌ఫోన్లను తీసుకొచ్చాయి. మైక్రోమ్యాక్స్, కార్బన్, సెల్‌కాన్ వంటి దేశీయ మొబైల్ ఫోన్ కంపెనీలు రూ.2 వేల నుంచి స్మార్ట్‌ఫోన్లను ప్రవేశపెట్టాయి. అటు ఇ-కామర్స్ భారత్‌లో జోరు మీద ఉంది. వెబ్ వెర్షన్లకు బదులు యాప్ ద్వారా కొనుగోళ్లను ఇ-కామర్స్ సంస్థలు ప్రోత్సహిస్తున్నాయి. కస్టమర్లు తమ షాపింగ్‌ను మొబైల్ ఫోన్లలోనూ చేసేస్తున్నారు.
ఇదంతా టెలికం కంపెనీలకు కలిసి వస్తోంది. పాత చందాదారులు కొనసాగడమేగాక కొత్తవారిని ఆకట్టుకోవడానికి ఇప్పుడు మొబైల్ ఇంటర్నెట్, బ్రాడ్‌బ్యాండ్ ప్యాక్‌లలో ఆఫర్ల మీద ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. మొబైల్ ఫోన్లలో ఇంటర్నెట్ వినియోగిస్తున్న వారి సంఖ్య భారత్‌లో సుమారు 21 కోట్లుంది. వీరిలో 20 శాతం మంది బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్ సైతం తీసుకున్నట్టు అంచనా. బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్లు దేశవ్యాప్తంగా 10 కోట్లు ఉన్నాయి.
పోటా పోటీగా ఆఫర్లు
టెలికం రంగ దిగ్గజం ఎయిర్‌టెల్ కొత్త కస్టమర్లకు హోమ్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్స్ ధర 30 శాతం వరకు తగ్గించింది. అలాగే ఎయిర్‌టెల్ సర్‌ప్రైసెస్ పేరుతో పాత కస్టమర్లకు ప్లాన్ ధరలో మార్పు లేకుండా అధిక స్పీడ్, డేటాను అందిస్తోంది. 3జీ ధరలోనే 4జీని అందించడం మరో విశేషం. వొడాఫోన్ ప్రీ-పెయిడ్ కస్టమర్ల కోసం డబుల్ డేటా ఆఫర్‌ను ప్రకటి ంచింది. 2జీ, 3జీ కస్టమర్లు రెండింతల విలువను అన్ని డేటా రీచార్జ్ ప్యాక్‌లపై పొందవచ్చు. 121 నంబరు, వొడాఫోన్ వెబ్‌సైట్, మై వొడాఫోన్ యాప్ ద్వారా డేటా రిచార్జ్ చేసుకునేవారికి ఈ ఆఫర్ వర్తిస్తుంది.
బీఎస్‌ఎన్‌ఎల్ ప్రీ-పెయిడ్ కస్టమర్లకు ఒక నెలలో వాడకుండా మిగిలిన 2జీ, 3జీ డేటాను తర్వాతి రీచార్జ్‌లో క్యారీ ఫార్వార్డ్ చేసుకునే సౌకర్యాన్ని ఇప్పటికే కల్పించింది. ఐడియా సెల్యులార్ పోస్ట్ పెయిడ్ కస్టమర్లకు 3జీ బ్యాలెన్స్‌ను క్యారీ ఫార్వార్డ్ చేసుకోవచ్చని ప్రకటించింది. ఆర్‌కాం అన్‌లిమిటెడ్ డేటా ప్యాక్‌లను ఆవిష్కరించింది. డేటా రీచార్జ్‌పై ఉచిత కాల్స్‌ను ఎయిర్‌సెల్ ఆఫర్ చేస్తోంది. అన్‌లిమిటెడ్ ఫేస్‌బుక్, వాట్సాప్ ప్యాక్‌లను యునినార్ అందిస్తోంది.