
రిలయన్స్ జియోతో ఆర్‌కామ్ జట్టు
టెలికం రంగంలో అంబానీ బ్రదర్స్ కంపెనీలు చేతులు కలుపుతున్నాయి.
* స్పెక్ట్రమ్ షేరింగ్, ట్రేడింగ్‌కు ఒప్పందంపై కసరత్తు
* ఆర్‌కామ్ ఏజీఎంలో చైర్మన్ అనిల్ అంబానీ
ముంబై: టెలికం రంగంలో అంబానీ బ్రదర్స్ కంపెనీలు చేతులు కలుపుతున్నాయి. పెద్దన్న ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ జియో సంస్థతో తమ్ముడు అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్‌కామ్) స్పెక్ట్రం ట్రేడింగ్, షేరింగ్‌కు ఒప్పందం కుదుర్చుకోనుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన చర్చలు తుది దశల్లో ఉన్నాయని ఆర్‌కామ్ వార్షిక సర్వసభ్య సమావేశంలో సంస్థ చైర్మన్ అనిల్ అంబానీ తెలిపారు.
ఆర్‌జియో, ఆర్‌కామ్ మధ్య వ్యూహాత్మక సహకారం, భాగస్వామ్యం.. టెలికం రంగంలో కన్సాలిడేషన్‌కి సంకేతమని ఆయన పేర్కొన్నారు. టెలికం రంగంలో ఈ డీల్ విప్లవాత్మక మార్పులు తేగలదని, ఆ ప్రయోజనాలు రానున్న రోజుల్లో కనిపించగలవని అనిల్ అంబానీ తెలిపారు. ఇరు సంస్థలు సంయుక్తంగా అత్యుత్తమ ప్రమాణాలతో సర్వీసులు అందించగలవన్నారు.
ఈ ఒప్పందంతో ఆర్‌కామ్ కస్టమర్లకు ఆర్‌జియోకి చెందిన 4జీ నెట్‌వర్క్ అందుబాటులోకి రాగలదని, అలాగే ఆర్‌కామ్‌కి ఉన్న 800-850 మెగాహెట్జ్ స్పెక్ట్రమ్‌ను ఆర్‌జియో ఉపయోగించుకుంటుందని అనిల్ అంబానీ చెప్పారు. తండ్రి ధీరుభాయ్ అంబానీ మరణానంతరం విభేదాలు తలెత్తడంతో 2005లో రిలయన్స్ సామ్రాజ్యాన్ని ముకేశ్, అనిల్ పంచుకున్నారు. అయితే, వ్యాపార ప్రయోజనాల రీత్యా.. కొన్నాళ్ల కిందటి నుంచి రెండు గ్రూప్‌లు మళ్లీ దగ్గరవుతున్న సంగతి తెలిసిందే.
టెలికం రంగంలో సంస్థల సంఖ్య తగ్గాల్సిన అవసరం ఉందని అనిల్ అంబానీ చెప్పారు. ఎస్‌ఎస్‌టీఎల్..ఎంటీఎస్ భారత కార్యకలాపాలను విలీనం చేసుకోవడంపై ఆర్‌కామ్ చర్చలు తుది దశలో ఉన్నాయని చెప్పారు. డీల్ పూర్తయితే ఎనిమిది సర్కిల్స్‌లో తమకు ప్రయోజనం చేకూరుతుందని, మరింత స్పెక్ట్రం చేతికి వస్తుందని ఆయన చెప్పారు.
వాటాల అమ్మకాలపైనే దృష్టి..
రోజు పొడవునా గ్రూప్‌లోని వివిధ సంస్థల ఏజీఎంలలో పాల్గొన్న అనిల్ అంబానీ .. ప్రధానంగా మూడు కంపెనీల్లో వాటాల విక్రయాన్ని ప్రధానంగా ప్రస్తావించారు. ఆర్‌కామ్ ఏజీఎంలో పాల్గొన్నప్పుడు.. టవర్ల విభాగం రిలయన్స్ ఇన్‌ఫ్రాటెల్‌లో వాటాలను విక్రయిస్తున్నట్లు, నెలా .. రెండు నెలల్లో డీల్ పూర్తి కాగలదని ఆయన చెప్పారు. మరోవైపు, ఇండొనేషియాలోని మూడు బొగ్గు గనుల విక్రయాన్ని రిలయన్స్ పవర్ ఏజీఎంలో అనిల్ అంబానీ ప్రకటించారు. రిలయన్స్ క్యాపిటల్ ఏజీఎంలో పాల్గొన్న సందర్భంగా.. రుణభారాన్ని తగ్గించుకునే దిశగా రిలయన్స్ లైఫ్ ఇన్సూరెన్స్, రిలయన్స్ అసెట్ మేనేజ్‌మెంట్‌లో మరిన్ని వాటాలు విక్రయిస్తున్నట్లు చెప్పారు.
పెరగనున్న నిప్పన్ లైఫ్ వాటా...
రిలయన్స్ లైఫ్ ఇన్సూరెన్స్, రిలయన్స్ మ్యూచువల్ ఫండ్ సంస్థల్లో జపాన్‌కు చెందిన నిప్పన్ లైఫ్ తన వాటాను మరింతగా పెంచుకోనున్న అనిల్ అంబానీ పేర్కొన్నారు. ఆర్‌బీఐ అనుమతిస్తే జపాన్‌కు చెందిన సుమిటొమొ మిత్సుయ్ ట్రస్ట్ బ్యాంక్‌తో కలసి భారత్‌లో కొత్త బ్యాంక్‌ను ఏర్పాటు చేస్తామని చెప్పారు.
నాన్నగారుంటే సంతోషించేవారు..
ఏజీఎంలో పాల్గొన్న సందర్భంగా పెద్దన్న ముకేశ్ అంబానీని అనిల్ ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఆయన తనకు అడుగడుగునా ఎనలేని సహకారం అందించారని, మార్గనిర్దేశనం చేశారని అనిల్ పేర్కొన్నారు. తండ్రి ధీరుభాయ్ అంబానీ గానీ ఉండి ఉంటే ఇరు సంస్థలు చేతులు కలుపుతున్న సందర్భాన్ని చూసి ఎంతో సంతోషించేవారన్నారు. ‘పెద్దన్నయ్య ముకేశ్ భాయ్ అడుగడుగున అందించిన తోడ్పాటుకు, చేసిన దిశానిర్దేశానికి నేను కృతజ్ఞతలు చెప్పుకోవాలి. నాన్నగారు ధీరుభాయ్ గానీ ఇప్పుడు ఉండి ఉంటే రెండు సంస్థల భాగస్వామ్యాన్ని చూసి చాలా సంతోషించేవారు’ అని అనిల్ అంబానీ చెప్పారు.