వయామ్ నెట్‌వర్క్స్.. అమెరికా టవర్ కార్ప్ పరం | American Tower Corp to buy 51% in Viom Networks | Sakshi
Sakshi News home page

వయామ్ నెట్‌వర్క్స్.. అమెరికా టవర్ కార్ప్ పరం

Published Thu, Oct 22 2015 12:33 AM | Last Updated on Thu, Apr 4 2019 3:21 PM

వయామ్ నెట్‌వర్క్స్.. అమెరికా టవర్ కార్ప్ పరం - Sakshi

వయామ్ నెట్‌వర్క్స్.. అమెరికా టవర్ కార్ప్ పరం

డీల్ విలువ రూ.7,600 కోట్లు
న్యూయార్క్: భారత్‌లో టెలికాం టవర్లను నిర్వహిస్తున్న వయామ్ నెట్‌వర్క్స్‌లో 51 శాతం వాటాను  అమెరికాకు చెందిన అమెరికన్ టవర్ కార్పొ(ఏటీసీ) రూ.7,600 కోట్లకు కొనుగోలు చేయనున్నది. టాటా టెలిసర్వీసెస్, శ్రేయి ఇన్‌ఫ్రా ఫైనాన్స్ సంస్థల నుంచి ఎక్కువ వాటాలను, ఇతర సంస్థల నుంచి కొంత మొత్తంలో వాటాలను  ఏటీసీ కొనుగోలు చేస్తోంది. డీల్ మొత్తం నగదులోనే జరుగుతుందని సమాచారం. భారత టెలికాం రంగంలో ఈ ఆర్థిక సంవత్సరంలో ఇదే అతి పెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి. వయామ్ కంపెనీ 42,200 మొబైల్ టవర్లను నిర్వహిస్తోంది.

1,000 మొబైల్ ఫోన్ మాస్ట్స్ నిర్మాణంలో ఉన్నాయి. ఏటీసీ నిర్వహిస్తున్న 14,000 టెలికాం మొబైల్ మాస్ట్స్‌ను కూడా వయామ్ మాస్ట్స్‌తో విలీనం చేయనున్నారు. వయామ్ నెట్‌వర్క్స్‌లో టాటా టెలి సర్వీసెస్‌కు 54 శాతం వాటా, కోల్‌కతాకు చెందిన శ్రేయి గ్రూప్ కనోరియా కుటుంబానికి 19 శాతం చొప్పున వాటాలున్నాయి. శ్రేయి గ్రూప్ నుంచి మొత్తం వాటాను, టాటా టెలిసర్వీసెస్ నుంచి 20 శాతం వాటాను, ఇంకా ఇతర వాటాదారుల నుంచి కూడా కలుపుకొని, మొత్తం మీద 51 శాతం వాటాను ఏటీసీ కొనుగోలు చేయనున్నది.

ఈ క్యూ1లో వయామ్ కంపెనీ రూ.5,000 కోట్ల అద్దె, నిర్వహణ ఆదాయాలను ఆర్జించింది. ఈ ఏడాది సెప్టెంబర్ చివరినాటికి ఈ కంపెనీ రుణభారం రూ.5,800 కోట్లుగా ఉంది. టాటా టెలిసర్వీసెస్ మొబైల్ టవర్ల విభాగం, శ్రేయి గ్రూప్‌కు చెందిన క్విప్పో టెలికాం సంస్థలు విలీనమై 2009లో వయామ్ నెట్‌వర్క్స్ ఏర్పడింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement