
ముంబై: తీవ్రమైన పోటీ, రుణభారంతో కుంగుతున్న టెలికం రంగం ప్రస్తుతం ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఐసీయూ) దాటి ఇంటెన్సివ్ క్రిటికల్ కేర్ యూనిట్ (ఐసీసీయూ)లోకి చేరిందని రిలయన్స్ కమ్యూనికేషన్స్ అధినేత అనిల్ అంబానీ వ్యాఖ్యానించారు. దీంతో ఇటు ప్రభుత్వానికి, అటు రుణదాతలకు కూడా భారీ రిస్కు తప్పదని హెచ్చరించారు.
మరోవైపు గుత్తాధిపత్య ధోరణుల దిశగా మార్కెట్ సాగుతోందని అనిల్ ఆందోళన వ్యక్తం చేశారు. మంగళవారం కంపెనీ వార్షిక సర్వసభ్య సమావేశంలో ఈ విషయాలు చెప్పారు. ‘ఏ కోణం నుంచి చూసినా వైర్‌లెస్ రంగం.. ఇంటెన్సివ్ కేర్ యూనిట్ కూడా కాదు .. ఆ పరిస్థితినీ దాటేసి ఏకంగా ఐసీసీయూలోకి చేరింది. ఇటు ఆదాయాల పరంగా ప్రభుత్వానికి, బ్యాంకింగ్ రంగానికి వ్యవస్థాగత ముప్పుగా మారింది. ఇది సృజనాత్మకంగా ఒక రంగాన్ని సర్వనాశనం చేయడంగా భావిస్తున్నాను‘ అని అనిల్ పేర్కొన్నారు.
రంగానికి నిధుల కటకట..
ఏప్రిల్‌లో ఆర్‌బీఐ అప్రమత్తం చేసినప్పట్నుంచీ టెలికం రంగానికి బ్యాంకుల నుంచి నిధులు రావడం పూర్తిగా ఆగిపోయిందని చెప్పారు. ఒకప్పుడు డజను పైగా కంపెనీలుండగా.. ప్రస్తుతం ఆరుకి తగ్గిపోయాయని, దాదాపు అంతర్జాతీయ సంస్థలన్నీ వెళ్లిపోయాయని ఆయన పేర్కొన్నారు. మార్కెట్లో క్రమంగా పోటీ తగ్గిపోయి, గుత్తాధిపత్య ధోరణి నెలకొనే ముప్పు పొంచి ఉందని అనిల్ వ్యాఖ్యానించారు.
ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ జియో చౌక ఆఫర్లతో టెలికం రంగాన్ని కుదిపేసిన నేపథ్యంలో అనిల్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. మరోవైపు, రుణభారం పేరుకుపోయినప్పటికీ.. రుణదాతలంతా తోడ్పాటు అందిస్తున్న నేపథ్యంలో తమ కంపెనీ మార్చి నాటికల్లా సమస్యల నుంచి గట్టెక్కగలదని అనిల్ ధీమా వ్యక్తం చేశారు. కష్టాల నుంచి గట్టెక్కడానికి తమ సంస్థకి ప్రత్యేక సాయం అవసరం లేదన్నారు. ఆ విధంగా కోరే ’అర్హత’ తమకు లేదని, అలాంటిది కావాలని కోరుకోవడం లేదన్నారు.
బ్లాక్ మెయిలర్లను అనుమతించకూడదు ..
న్యాయస్థానాలు, నియంత్రణ సంస్థలపరమైన జోక్యాలతో అవరోధాలు ఉంటున్నాయని, అయితే ఆర్‌కామ్ వాటిని గౌరవిస్తుందని చెప్పారు. నీ వల్లే ఎయిర్‌సెల్ విలీన ప్రణాళిక అమలు కావడానికి ఏడాది జాప్యం జరిగిందంటూ ఒక షేర్‌హోల్డరు వైపు చూసి అనిల్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి ‘బ్లాక్‌మెయిలర్లను’ ఈ తరహా సమావేశాల్లోకి అనుమతించకుండా చూడాలని నియంత్రణ సంస్థలకు కంపెనీ రాయనున్నట్లు చెప్పారు.