భారత టెలికాం రంగంలో కాలిడిన మూడేళ్లలోనే రిలయన్స్ జియో టాప్‌లోకి దూసుకొచ్చింది. ముకేశ్ అంబానీ నేతృత్వంలోని జియో ఎంట్రీతోనే ప్రత్యర్థి కంపెనీల గుండెల్లో గుబులు రేపిన జియో వినియోగదారుల ఆదరణతో తన జైత్రయాత్రను కొనసాగిస్తోంది. 331.3 మిలియన్ల చందాదారులతో దేశంలో అతిపెద్ద టెలికాం ఆపరేటర్‌గా అవతరించింది. తద్వారా వోడాఫోన్ ఐడియాను వెనక్కి నెట్టేసింది. 2019 జూన్ (మొదటి త్రైమాసికం) నాటికి వొడాఫోన్ ఐడియా వినియోగదారుల సంఖ్య 320 మిలియన్లకు క్షీణించిందని వోడాఫోన్ ఐడియా త్రైమాసిక ఫలితాల సందర్భంగా శుక్రవారం నివేదించింది. మార్చి త్రైమాసికంలో 334.1 మిలియన్ల మంది ఖాతాదారులు నమోదయ్యారు. మాతృ సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ గత వారం ప్రకటించిన క్యూ1 ఆర్థిక ఫలితాల ప్రకారం, అనుబంధ సంస్థ రిలయన్స్ జియో 2019 జూన్ నాటికి 331.3 మిలియన్ల వినియోగదారులు ఉన్నట్టు ప్రకటించింది. ఈ తాజా లెక్కల ప్రకారం అత్యధిక వినియోగదారులతో అతిపెద్ద సంస్థగా జియో నిలిచింది.
టెలికాం రంగ నియంత్రణ మండలి ట్రాయ్ డేటా ప్రకారం..మే నెలలో జియో 32.29 కోట్ల మంది కస్టమర్లు, 27.80 శాతం మార్కెట్ వాటాతో దేశంలో రెండో అతిపెద్ద టెలికాం కంపెనీగా ఎదిగింది. భారతి ఎయిర్‌టెల్ 32.03 కోట్ల యూజర్లు, 27.6 శాతం మార్కెట్ వాటాతో మూడోస్థానానికి పడిపోయింది. మే నెలలో జియో నెట్‌వర్క్‌లోకి నికరంగా 81.80 లక్షల మంది కొత్త వినియోగదారులు చేరగా.. వొడాఫోన్ ఐడియా 56.97 లక్షలు, భారతీ ఎయిర్‌టెల్ 15.08 లక్షల మంది కస్టమర్లను కోల్పోయాయి.
కాగా గత ఏడాదిలో వొడాఫోన్ ఇండియా, ఐడియా సెల్యులార్ విలీనం తరువాత ఏర్పడిన సంస్థ వొడాఫోన్ ఐడియా 400 మిలియన్లకు పైగా సభ్యులతో అతిపెద్ద టెలికాం ఆపరేటర్‌గా అవతరించిన సంగతి తెలిసిందే. అయితే క్రమంగా కస్టమర్లను కోల్పోతూ వచ్చిన వొడాఫోన తాజాగా రెండో స్థానంతో సరిపెట్టుకోగా, వొడా, ఐడియా విలీనానికి ముందువరకు దిగ్గజ కంపెనీగా కొనసాగిన ఎయిర్‌టెల్ ప్రస్తుతం మూడో స్థానానికి జారుకుంది.
Comments
Please login to add a commentAdd a comment