టెలికంలోనూ ఇక అంబుడ్స్మన్!
♦ త్వరలో ట్రాయ్ నిర్ణయం
♦ ప్రస్తుత ఫిర్యాదుల పరిష్కార విధానం సరిగ్గాలేదన్న ట్రాయ్ చైర్మన్ శర్మ
న్యూఢిల్లీ : టెలికం సేవల విషయంలో వినియోగదారుల నుంచి ఫిర్యాదులు పెరిగిపోతుండడంతో పరిష్కారం కోసం ప్రత్యేకంగా అంబుడ్స్‌మన్‌ను ఏర్పాటు చేయాలని ట్రాయ్ యోచిస్తోంది. ఈ ప్రతిపాదనపై ప్రజాభిప్రాయం తెలుసుకున్న అనంతరం తగిన నిర్ణయం తీసుకోనుంది. ప్రస్తుతమున్న ఫిర్యాదుల పరిష్కార విధానం ప్రభావవంతంగా లేదని ట్రాయ్ చైర్మన్ ఆర్‌ఎస్ శర్మ అన్నారు. ఇందుకు సంబంధించి సంస్థాగత ఏర్పాటుపై రెండు వారాల్లో సంప్రదింపుల ప్రక్రియ చేపడతామని చెప్పారు. ప్రజాభిప్రాయాన్ని సైతం తెలుసుకుంటామన్నారు. ఆటోమేటెడ్ విధానం లేదా టెక్నాలజీ ఆధారిత వేదిక ఏర్పాటు చేయాలా అన్నది పరిశీలించాల్సి ఉందని, దీనిపై సలహా తీసుకుంటామని శర్మ చెప్పారు.
పరిస్థితి ఇదీ...: టెలికం వినియోగదారుల సంఖ్య 100 కోట్లుగా ఉండడంతో ఫిర్యాదుల సంఖ్య భారీగా ఉంటోంది. ఎక్కువ శాతం ఫిర్యాదులు బిల్లులు, విలు వ ఆధారిత సేవలను యాక్టివేట్ చేయడం, టారిఫ్‌ను మార్చడంపైనే ఉంటున్నాయి. అనవసర వ్యయం ఎందుకన్న భావనలో ఎవరూ కోర్టుల వరకు వెళ్లడం లేదు. సుప్రీంకోర్టు ఉత్తర్వుల వల్ల వినియోగదారుల ఫోరం టెలికం ఫిర్యాదులను స్వీకరించడం లేదు. దీంతో ప్రస్తుతం వినియోగదారులు ట్రాయ్, టెలికం శాఖలకు ఫిర్యాదు చేస్తున్నారు. వాటిని ఆయా విభాగాలు సంబంధిత ఆపరేటర్‌కు పంపించి ఊరుకుంటున్నాయి. దీంతో పరిష్కారం లభించడం లేదు.