రూ. 45 వేల కోట్ల టెలికాం స్కాం
* కాగ్ బయటపెట్టినా మోదీ సర్కారు చాప కింద దాచేస్తోంది: కాంగ్రెస్
* ఆరు ప్రముఖ సంస్థలను కాపాడేందుకు కేంద్రం సాయం చేస్తోంది
న్యూఢిల్లీ: కేంద్రంలో రూ.45వేల కోట్లకు పైగా టెలికాం కుంభకోణం చోటు చేసుకుందని.. కాగ్ బయటపెట్టిన ఈ కుంభకోణంతో ప్రమేయమున్న ఆరు ప్రముఖ టెలికాం సంస్థలను కాపాడేందుకు మోదీ ప్రభుత్వం తెరవెనుక చర్యలు చేపడుతోందని ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. ‘‘తాజా భారీ టెలికాం కుంభకోణం విలువ రూ. 45,000 కోట్లకు పై మాటే. దానిని మోదీ సర్కారు చాప కింద దాచేస్తోంది’’ అని పార్టీ ముఖ్య అధికార ప్రతినిధి రణ్‌దీప్ సూర్జేవాలా గురువారం విలేకరుల సమావేశంలో ఆరోపించారు.
‘‘భారతి ఎయిర్‌టెల్, ఒడాఫోన్, రిలయన్స్, ఐడియా, టాటా, ఎయిర్‌సెల్ టెలికాం సంస్థలు ప్రభుత్వానికి న్యాయంగా చెల్లించాల్సిన చార్జీలను ఎగవేసేందుకు ప్రభుత్వం సాయం చేస్తోంది’’ అని ఆరోపణలు గుప్పించారు. ప్రధాని ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఆమోదించనిదే ఇది జరగదన్నారు.
కాగ్ నివేదికలో బయటపెట్టింది: గత యూపీఏ ప్రభుత్వం ఆదేశాలతో కాగ్.. ఆరు టెలికాం సంస్థల 2006-07 నుంచి 2009-10 వరకూ లావాదేవీలపై ఆడిట్ ప్రారంభించిందని సూర్జేవాలా పేర్కొన్నారు. కాగ్ ఈ ఏడాది సమర్పించిన నివేదికను ఉటంకిస్తూ ఆయన చేసిన ఆరోపణల్లోని ముఖ్యాంశాలివీ... ఆదాయాన్ని తక్కువ చేసి చూపటం, ఖాతాల నిర్వహణలో ఏకరూపత లేకపోవటం.. ఫలితంగా లెసైన్సుల ఫీజు మొత్తాన్ని, స్పెక్ట్రమ్ వినియోగ చార్జీలను చెల్లించాల్సిన బాధ్యత లేకపోవటం వంటి అంశాలపై కాగ్ ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఆరు టెలికాం సంస్థలు నాలుగేళ్లలో రూ. 46,045.75 కోట్ల మేర ఆదాయాన్ని తక్కువగా చూపాయని గుర్తించింది.
దానివల్ల.. ప్రభుత్వానికి రావాల్సిన రూ.12,488.93 కోట్ల మొత్తం రాలేదని కాగ్ పేర్కొంది. దీనికి జరిమానాలు, ఇతర చార్జీలు అదనం. ఆయా టెలికాం సంస్థల వ్యాపారం, వినియోగదారుల పరిధి, ఆదాయం గణనీయంగా పెరిగినా కూడా - కాగ్ లెక్కించిన ప్రాతిపదికనే ఆయా సంస్థల నిర్వాకం వల్ల 2010-11 నుంచి 2015-16 వరకూ ప్రభుత్వ ఖజానాకు వాటిల్లిన నష్టాన్ని లెక్కిస్తే.. ఆ మొత్తం రూ. 45,000 కోట్లకు పైగా ఉంటుంది.
ఆ సంస్థలను కాపాడే చర్యలా: ఖజానాకు భారీ నష్టం జరుగుతున్న దిగ్భాంతికర వాస్తవాలను బయటపెట్టిన కాగ్ నివేదిక ఆధారంగా తక్ష ణం చర్యలు చేపట్టాల్సింది పోయి.. మోదీ ప్రభుత్వం ఆ సంస్థలను కాపాడే చర్యలు చేపట్టిందని సూర్జేవాలా ఆరోపించారు.