
న్యూఢిల్లీ: టెలికం రంగంలో సంచనాలకు తెరతీసిన రిలయన్స్ జియో ఇప్పుడు చౌక ధర 4జీ స్మార్ట్‌ఫోన్స్, ల్యాప్‌టాప్స్, ఐవోటీ, బ్రాడ్‌బాండ్, క్రిప్టోకరెన్సీ వంటి పలు రకాల ఉత్పత్తులపై దృష్టి పెట్టింది. వీటిలో ప్రస్తుతం బ్రాడ్‌బాండ్ సర్వీసులకు అధిక ప్రాధాన్యమిస్తూ... ఫైబర్–టు–హోమ్ ద్వారా దూసుకెళ్లేందుకు సిద్ధమవుతోంది.
జియో ఈ ఏడాది చివరిలో ఫైబర్–టు–హోమ్ వాణిజ్య సేవలను ప్రారంభించవచ్చన్నది కంపెనీ వర్గాల సమాచారం. ‘జియో దృష్టంతా ఫైబర్–టు–హోమ్‌పైనే ఉంది. తక్కువ కాలంలోనే 16.8 కోట్ల వైర్‌లెస్ సబ్‌స్క్రైబర్లను దక్కించుకుని... ఇపుడు గృహాలకు వైర్డ్ ఇంటర్నెట్ సేవలు అందించడంపై ఫోకస్ పెట్టింది. ఈ సర్వీసుల ఆవిష్కరణకి సంబంధించి డిసెంబర్ 28న అధికారిక ప్రకటన వెలువడొచ్చు’ అని ఆ వర్గాలు పేర్కొన్నాయి.
ఇప్పటికే ట్రయల్స్ మొదలు...
రిలయన్స్ జియో.. వైర్డ్ బ్రాడ్‌బాండ్ సర్వీసులకు సంబంధించి దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఇప్పటికే ట్రయల్స్‌ను ప్రారంభించింది. న్యూఢిల్లీ, ముంబైలలో బ్రాడ్‌బాండ్ సేవలను అందిస్తోంది. రూ.4,500 సెక్యూరిటీ డిపాజిట్‌తో 100 ఎంబీపీఎస్ స్పీడ్‌తో అపరిమిత ఇంటర్నెట్‌ను ఆఫర్ చేస్తోంది.
‘వైర్డ్ బ్రాడ్‌బాండ్ సేవల కోణంలో చూస్తే మనం వెనుకబడి ఉన్నాం. కనీసం 20 కోట్ల గృహాల్లో ఈ సేవలుండాలని మేం కోరుకుంటున్నాం’ అని రిలయన్స్ జియో గ్లోబల్ స్ట్రాటజీ అండ్ సర్వీస్ డెవలప్‌మెంట్, నెట్‌వర్క్ ప్రెసిడెంట్ మథ్యూ ఊమ్మెన్ చెప్పారు.
బ్రాడ్‌బాండ్‌తో ఆదాయం మెరుగు...
బ్రాడ్‌బాండ్ ఇంటర్నెట్ సేవలను అందుబాటులోకి తీసుకువస్తే రిలయన్స్ జియో స్థూల ఆదాయం మూడేళ్లలో రూ.4,000 కోట్లు పెరగొచ్చని బ్రోకరేజ్ సంస్థ సీఎల్‌ఎస్‌ఏ ఇండియా అంచనా వేసింది. ఇక్కడ వైర్డ్ ఇంటర్నెట్ సర్వీసుల వ్యాప్తి చాలా తక్కువగా ఉండటం జియోకి కలిసొచ్చే అంశం.
టెలికం రెగ్యులేటర్ ట్రాయ్ గణాంకాల ప్రకారం.. డిసెంబర్ చివరి నాటికి ఇండియాలో 2.12 కోట్ల వైర్డ్ ఇంటర్నెట్ సబ్‌స్క్రైబర్లున్నారు. అదే వైర్‌లెస్ ఇంటర్నెట్ సబ్‌స్క్రైబర్ల సంఖ్య 42.46 కోట్లుగా ఉంది. వైర్డ్ ఇంటర్నెట్ విభాగంలో భారత్ సంచార్ నిగమ్ (బీఎస్‌ఎన్‌ఎల్) 93.8 లక్షల యూజర్లతో 52.53 శాతం మార్కెట్ వాటాను కలిగి ఉంది. దీని తర్వాతి స్థానంలో భారతీ ఎయిర్‌టెల్ (10.12 శాతం వాటా), అట్రియ కన్వర్జెన్స్ టెక్నాలజీస్ (ఏసీటీ) (6.02 శాతం) ఉన్నాయి.
డేటా వినియోగం పెరుగుతోంది..
దేశంలో గత ఏడాది కాలంలో డేటా వినియోగం గణనీయంగా పెరిగింది. ట్రాయ్ గణాంకాల ప్రకారం.. 2017 అక్టోబర్–డిసెంబర్లో ఒక నెలలో ఒక సబ్‌స్క్రైబర్ సగటు డేటా వినియోగం 1,945 ఎంబీగా ఉంది. అదే 2016 అక్టోబర్–డిసెంబర్‌కు వచ్చేసరికి ఇది 878 ఎంబీ మాత్రమే.
డేటా వినియోగం పెరుగుతుండటంతో దీన్ని అందిపుచ్చుకోవాలని రిలయన్స్ ఇండస్ట్రీస్ భావిస్తోంది. అందుకే తన డిజిటల్ మ్యూజిక్ సర్వీస్ జియో మ్యూజిక్‌కు మ్యూజిక్ యాప్ సావన్‌ను అనుసంధానం చేస్తున్నట్లు ప్రకటించింది. అలాగే ఈరోస్ ఇంటర్నేషనల్‌లో 5 శాతం వాటా కొనుగోలు చేసింది.
కంటెంట్‌కు డిమాండ్.. ఫైబర్ బెటర్
కంటెంట్‌కు అధిక డిమాండ్ ఉండటంతో వైర్‌లెస్ కన్నా ఫైబర్ మెరుగైనదని కన్సల్టింగ్ సంస్థ కమ్‌ఫస్ట్ ఇండియా డైరెక్టర్ మహేశ్ ఉప్పల్ చెప్పారు. ఫైబర్ సామర్థ్యాన్ని సులభంగా విస్తరించుకోవచ్చంటూనే... ఫైబర్ వ్యాపారం కష్టతరమైందని అభిప్రాయపడ్డారు.
‘ఫైబర్ విధానంలో ప్రతి లొకేషన్‌కు భౌతికంగా వెళ్లాలి. అండర్ గ్రౌండ్ ఫైబర్ ఏర్పాటు సవాళ్లతో కూడుకున్నది. అనుమతులు కావాలి. ఖర్చులెక్కువ. ఆలస్యం కూడా కావచ్చు’’ అన్నారాయన. అయితే ఒక్కసారి విజయవంతమైతే.. మార్కెట్ నుంచి అధిక రివార్డులను ఆశించొచ్చని తెలిపారు.
చిన్న పట్టణాలపై డెన్ నెట్‌వర్క్స్ దృష్టి
పెద్ద కంపెనీలు మెట్రో నగరాల్లో మార్కెట్‌ను దక్కించుకుంటుండటంతో కేబుల్ టీవీ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ డెన్ నెట్‌వర్క్స్ తన దృష్టిని చిన్న పట్టణాలకు మరల్చింది. వచ్చే మూడేళ్లలో టైర్–2, టైర్–3 పట్టణాల్లో బ్రాడ్‌బాండ్ సేవలందించాలని చూస్తోంది. దీనికోసం స్థానిక కేబుల్ ఆపరేటర్లతో జతకడుతోంది.
ట్రాయ్ ప్రకారం.. దేశంలో డిసెంబర్ చివరి నాటికి 156 మంది ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లున్నారు. వైర్డ్ ఇంటర్నెట్ విభాగంలో వాణిజ్య సేవలు అందించనప్పటికీ మొత్తం ఇంటర్నెట్ సబ్‌స్క్రైబర్ల విషయంలో జియో 35.9 శాతం మార్కెట్ వాటాను ఆక్రమించింది. దీని తర్వాతి స్థానంలో భారతీ ఎయిర్‌టెల్ (22.12 శాతం) ఉంది.
స్పీడ్ పెంచిన ఎయిర్‌టెల్
జియో ప్రత్యర్థి ఎయిర్‌టెల్ 89 పట్టణాల్లో 21 లక్షల మంది యూజర్లకు 100 ఎంబీపీఎస్ వరకు స్పీడ్‌తో వైర్డ్ బ్రాడ్‌బాండ్ సేవలను అందిస్తోంది. డిసెంబర్ చివరి నాటికి ఎయిర్‌టెల్ తన హోమ్స్ సర్వీసెస్ విభాగం ద్వారా ఒక యూజర్ నుంచి సగటున రూ.948 ఆదాయం పొందింది.
తన హోమ్ సర్వీసెస్ విభాగంలో బ్రాడ్‌బాండ్ కస్టమర్లది 93.5 శాతం వాటా. దీంతో ఎక్కడి నుంచైతే మంచి ఆదాయం వస్తుందో.. ఆ ప్రాంతాల్లోనే ఇది అధిక దృష్టి పెట్టింది. గతవారం సరికొత్త సూపర్‌ఫాస్ట్ హోమ్ బ్రాడ్‌బాండ్ ప్లాన్‌ను ఆవిష్కరించింది. ఇందులో 300 ఎంబీపీఎస్ వరకు స్పీడ్‌తో నెలకు రూ.2,990 ధరతో 1,200 జీబీ డేటాను ఆఫర్ చేస్తోంది. ఈ ప్లాన్‌లో ఎయిర్‌టెల్ ఓటీటీ యాప్స్, వింక్ మ్యూజిక్, ఎయిర్‌టెల్ టీవీ ఉచిత సబ్‌స్క్రిప్షన్ ఉంది.
Comments
Please login to add a commentAdd a comment