ముకేశ్ రీఎంట్రీపై టెల్కోల్లో గుబులు!
• రిలయన్స్ జియో లక్ష ్యం..10 కోట్ల మంది యూజర్లు!
• ఇప్పటికే అనధికారికంగా సేవలు షురూ...
• 90 రోజుల ఉచిత డేటా, వాయిస్ సేవలతో గాలం...
• దీంతో మార్కెట్ వాటాపై పాత టెల్కోల్లో కలవరం...
ముంబై: రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్‌ఐఎల్) అధినేత ముకేశ్ అంబానీ టెలికం రంగంలోకి రీఎంట్రీ పరిశ్రమలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఆర్‌ఐఎల్ అనుబంధ సంస్థ రిలయన్స్ జియో దేశవ్యాప్తంగా 4జీ సేవలను ప్రారంభించే చర్యలను వేగవంతం చేయడమే దీనికి ప్రధాన కారణం. అంతేకాకుండా, వీలైనంత త్వరగా 10 కోట్ల మంది సబ్‌స్క్రయిబర్లను జియో నెట్‌వర్క్‌లోకి తీసుకురావాలన్నది ముకేశ్ మెగా ప్రణాళికగా పరిశ్రమ విశ్లేషకులు చెబుతున్నారు.
ఇందులో భాగంగానే బీటా(ప్రయోగాత్మక) సేవల పేరుతో ఎటువంటి మొబైల్ ఫోన్ వినియోగిస్తున్నా... 90 రోజుల ఉచిత అన్‌లిమిటెడ్ డేటా, వాయిస్ సేవలు అంటూ యూజర్లకు రిలయన్స్ జియో ఇప్పటికే ఆఫర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ముకేశ్ అంబానీ జోరుతో ప్రస్తుత టెల్కోల్లో కలవరం మొదలైంది. ఇది స్పెక్ట్రం వాడక నిబంధనలకు విరుద్ధమని, పరీక్షల పేరుతో రిలయన్స్ జియో పూర్తిస్థాయి సేవలను ఇస్తోందంటూ సెల్యూలార్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(సీఓఏఐ) ఇప్పటికే ప్రభుత్వానికి ఫిర్యాదు కూడా చేసిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా సర్కారు ఖజానాకు కూడా గండికొడుతోందని ఆరోపణలు గుప్పించింది.
మార్కెట్ వాటా కోసమే...
రిలయన్స్ జియో రాక నేపథ్యంలో ఇప్పటికే మొబైల్ డేటా విభాగంలో టెల్కోలు పోటాపోటీగా టారిఫ్‌ల తగ్గింపు, పరిమితి పెంపు వంటి చర్యలతో ధరల పోరుకు తెరతీశాయి. ప్రస్తుతం దేశీ టెలికం పరిశ్రమ మార్కెట్ వాటాలో ఐదింట మూడొంతులు దిగ్గజాలైన భారతీ ఎయిర్‌టెల్, ఐడియా సెల్యులార్, వొడాఫోన్ చేతిలోనే ఉంది. జియో పూర్తిస్థాయి అరంగేట్రానికి ముందే డేటా నెట్‌వర్క్‌ను మరింత విస్తరించేచర్యల్లో భాగంగా ఈ మూడు టెల్కోలు టారిఫ్‌లను తప్పనిసరిగా తగ్గించుకునేలా చేస్తోంది. ఇది ఆయా కంపెనీల వాటాదారులపైనా ప్రభావం చూపుతోంది. జియో 10 కోట్ల మంది యూజర్లను దక్కించుకునే పరిస్థితే ఉంటే ఎక్కడ యూజర్లను కోల్పోవాల్సి వస్తుందోనన్న ఆందోళనలో టెల్కోలు ఉన్నాయి. మార్కెట్ వాటాను చేజార్చుకుంటే మళ్లీ దక్కించుకోవడం కష్టసాధ్యమన్నది ఆయా కంపెనీల కలవరపాటుకు ప్రధాన కారణం.
జియో ఎదురుదాడి...
మరోపక్క, రిలయన్స్ జియో కూడా తనపై వస్తున్న ఆరోపణలను తోసిపుచ్చడంతోపాటు ఎదురుదాడి మొదలుపెట్టింది. తమ బీటా సేవల్లో వినియోగదారులు ఇతర టెల్కోలకు సంబంధించిన నెట్‌వర్క్‌కు కాల్ చేసినప్పుడు తగిన ఇంటర్‌కనెక్షన్ సేవలను అందించకుండా ప్రస్తుత టెల్కోలు తమపై కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నాయని, కాల్‌డ్రాప్‌లకు కారణమవుతున్నాయంటూ రిలయన్స్ జియో కూడా ప్రభుత్వానికి ఫిర్యాదు చేయడం విదితమే. మొత్తంమీద సీఓఏఐ, జియోల మధ్య నెలకొన్న ఈ వివాదంతో కేంద్ర ప్రభుత్వం కూడా గందగోళంలో పడినట్లు కనిపిస్తోంది. దాదాపు మరో నెల రోజుల్లో ప్రారంభం కానున్న అదిపెద్ద స్పెక్ట్రం వేలాన్ని వాయిదా వేసుకునే ఆలోచనలో ఉన్నట్లు వార్తలు రావడం దీనికి నిదర్శనం.
అప్పుల కుప్పలు...
వాస్తవానికి నెట్‌వర్క్ విస్తరణపై ఇప్పటికే వేల కోట్ల రూపాయిలు కుమ్మరిస్తున్నా ఆ స్థాయిలో ఇంకా డేటా వినియోగం మరింతగా పుంజుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఐడియా వార్షిక స్థూల లాభంతో పోలిస్తే నికర రుణ భారం 5.7 రెట్లు కాగా, భారతీ ఎయిర్‌టెల్ విషయానికొస్తే.. 3.3 రెట్లుగా ఉంది. ఇక రిలయన్స్ జియో కూడా దేశవ్యాప్త 4జీ సేవల కోసం ఇప్పటికే 20 బిలియన్ డాలర్లు(దాదాపు రూ. 1.35 లక్షల కోట్లు) పెట్టుబడి పెట్టినట్లు చెబుతోంది.
అయితే, టెలికం విస్తరణ కోసం మరింతగా రుణం సమరించే ప్రణాళికలపై ప్రస్తుత టెల్కోలకు చెందిన మైనారిటీ వాటాదారులు వ్యతిరేక గళం వినిపిస్తుండటం గమనార్హం. మరోపక్క, పెట్రోలియం-రిఫైనింగ్ వ్యాపారంలో లాభాల పంట పండుతుండటంతో ముకేశ్ అంబానీ రిలయన్స్ జియో మాత్రం తన ప్రతిష్టాత్మక ప్రణాళికల విషయంలో ఏమాత్రం తగ్గకుండా పెట్టుబడులను కుమ్మరిస్తోంది. ముకేశ్ లక్ష్యంగా పెట్టుకున్న 10 కోట్ల మంది సబ్‌స్క్రయిబర్ల మార్కుపైనే దృష్టిపెట్టి ముందుకెళ్తోంది.
పానాసోనిక్, మైక్రోమ్యాక్స్ యూజర్లకూ జియో ఉచిత సేవలు...
న్యూఢిల్లీ: మొబైల్ హ్యాండ్‌సెట్స్ తయారీ కంపెనీలు పానాసోనిక్, మైక్రోమ్యాక్స్ కంపెనీలు తాజాగా టెలికం సర్వీసెస్ ప్రొవైడర్ రిలయన్స్ జియోతో జతకట్టాయి. దీంతో పానాసోనిక్, మైక్రోమ్యాక్స్ మొబైల్ హ్యాండ్‌సెట్స్‌ను కొనుగోలు చేసిన వారు జియో 90 రోజులపాటు ఉచిత డేటా, వాయిస్ కాల్స్ సర్వీసులను పొందొచ్చు. జియోతో ఇప్పటికే ఎల్‌జీ, శాంసంగ్ కంపెనీలు జతకట్టాయి. ‘మైక్రోమ్యాక్స్ 4జీ స్మార్ట్‌ఫోన్స్‌ను కొనుగోలు చేసినవారు వారి హ్యాండ్‌సెట్‌తోపాటు జియో సిమ్‌ను పొందొచ్చు.
ఈ సిమ్ ద్వారా 3 నెలలపాటు అపరిమిత హెచ్‌డీ వాయిస్, వీడియో కాలింగ్, ఎస్‌ఎంఎస్, డేటా సేవలను పొందొచ్చు’ అని మైక్రోమ్యాక్స్ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ సుభజిత్ సేన్ తెలిపారు. అలాగే యూ స్మార్ట్‌ఫోన్స్ యూజర్లు కూడా ఈ సేవలను పొందొచ్చని పేర్కొన్నారు. తమ 4జీ స్మార్ట్‌ఫోన్స్ వినియోగదారులు కూడా జియో ప్రివ్యూ ఆఫర్‌ను వినియోగించుకోవచ్చని పానాసోనిక్ ఇండియా బిజినెస్ హెడ్ (మొబిలిటీ డివిజన్) పంకజ్ రాణా తెలిపారు.