ముడి చమురు దిగుమతిలో స్వేచ్ఛ
♦ 1979 నాటి విధానం మార్పు
♦ లాభం చూసుకునే ఇక కంపెనీల దిగుమతి
♦ నీటి సమర్థ నిర్వహణకు ప్రాజెక్టు
♦ టెలికం టవర్ కంపెనీలో వాటా విక్రయం
♦ ఇక రైల్వేలకు స్వీడన్ టెక్నాలజీ
♦ కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు
న్యూఢిల్లీ: భూగర్భ జల వనరుల్ని మదించటం నుంచి రిజర్వాయర్లు, వరద సమస్య దాకా అన్నిటికీ పరిష్కారంగా జాతీయ హైడ్రాలజీ ప్రాజెక్టుకు (ఎన్‌హెచ్‌పీ) కేంద్రం పచ్చజెండా ఊపింది. బుధవారం ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర కేబినెట్... దీంతో పాటు పలు నిర్ణయాలకు ఆమోదముద్ర వేసింది. వీటిలో రైల్వేల్లో విదేశీ సాంకేతిక సహకారం, ముడి చమురును కంపెనీలు స్వేచ్ఛగా దిగుమతి చేసుకోవటం, టెలికం టవర్ సంస్థ వినోమ్‌లో వాటా విక్రయం వంటి కీలకాంశాలున్నాయి.
రూ.3,680 కోట్లతో ఎన్‌హెచ్‌పీ
జాతీయ హైడ్రాలజీ ప్రాజెక్ట్ మొత్తం కేటాయింపులు రూ.3,680 కోట్లు. జాతీయ జల సమాచార కేంద్రం ద్వారా డేటా సేకరణ, మార్పిడి, విశ్లేషణ, పంపిణీ జరుగుతుంది. వరద ముప్పును 3 రోజుల ముందే అంచనావేయటం, వరద బాధిత ప్రాంతాల గుర్తింపు, భూగర్భ, ఉపరితల జలవనరుల విశ్లేషణ.. వంటివి దీని పరిధిలో ఉంటాయి.తొలిదశలో 13 రాష్ట్రాలకు వర్తించే ఎన్‌హెచ్‌పీ కార్యకలాపాలు... క్రమంగా దేశమంతటికీ విస్తరిస్తాయి.
రైల్వేలో సాంకేతిక అభివృద్ధి
రైల్వేలను టెక్నాలజీ పరంగా మరింత మెరుగుపరచటానికి అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం అందించేలా భారత్-స్వీడన్ మధ్య కుదిరిన అవగాహనా ఒప్పందానికి (ఎంఓయూ) కేబినెట్ ఆమోదముద్ర వేసింది. రైల్వేల్లో సాంకేతిక సహకారం, ఇందుకు సంబంధించిన సమాచారాన్ని, విజ్ఞానాన్ని ఇచ్చిపుచ్చుకోవడం వంటి అంశాలు ఈ ఎంఓయూ పరిధిలో ఉన్నాయి. సరుకు రవాణా, నిల్వ, సామర్థ్యం పెంపు వంటి అంశాల్లో కూడా రెండు దేశాలూ సహకరించుకుంటాయి.
క్రూడ్ ఆయిల్ సేకరణలో ప్రతిపత్తి...
ముడి చమురు దిగుమతికి సంబంధించి ప్రస్తుతం ఉన్న విధానాన్ని సవరించడానికి కేబినెట్ ఆమోదముద్ర వేసింది. సవరించిన విధానం ప్రకారం... ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు ఇకపై ముడి చమురును దిగుమతి చేసుకోవటానికి తమకు అనువైన పాలసీని తామే రూపొందించుకోవచ్చు. ప్రస్తుతం ముడి చమురు దిగుమతికి ఉన్న విధానం 1979లో అమల్లోకి వచ్చింది. 2001లో నాటి కేబినెట్ కొన్ని సవరణలు చేసింది. మార్కెట్లో పోటీ పడేలా కొనుగోలు విధానం ఉండాల్సిన ఈ తరుణంలో... ప్రస్తుత విధానంలో కొన్ని పరిమితులు, ఆంక్షలు ఉన్నాయని, అందుకే సవరించామని ప్రభుత్వం తెలిపింది.
‘ఆండ్రూ యూల్’లో డిజిన్వెస్ట్‌మెంట్‌కు ఓకే...
కోల్‌కతా కేంద్రంగా పనిచేస్తున్న ఆండ్రూ యూల్ సంస్థకు బ్యాంక్ ఆఫ్ బరోడా (బీఓబీ) ఇచ్చిన వర్కింగ్ క్యాపిటల్ టర్మ్ లోన్ రూ.29.91 కోట్లను ఈక్విటీ షేర్ల రూపంలోకి మార్చడానికి కేబినెట్ ఆమోదముద్ర వేసింది. వచ్చే మూడు నెలల్లో ఈ కంపెనీ నుంచి పెట్టుబడుల ఉపసంహరించుకోవటానికి ఈ చర్య మార్గం సుగమం చేయనుంది.
కర్ణాటకలో భారీ హైవే ప్రాజెక్టు...
తన ప్రధాన రహదారుల అభివృద్ధి ప్రాజెక్టు- ఎన్‌హెచ్‌డీపీ కింద కర్ణాటకలో రూ.1,622 కోట్లతో హైవే ప్రాజెక్టుకు కేంద్రం అనుమతి ఇచ్చింది. దీని ప్రకారం దాదాపు 95 కిలోమీటర్ల పొడవున... హోస్పేట్-బళ్లారి-కర్ణాటక/ఆంధ్రప్రదేశ్ సరిహద్దు సెక్షన్ నేషనల్ హైవే-63 నాలుగు లైన్ల రహదారి నిర్మాణం జరుగుతుంది.
వినోమ్ వాటా అమ్మకానికి ఓకే...
దేశీయ టెలికం టవర్ సంస్థ వినోమ్ నెట్‌వర్క్‌లో 51 శాతం వాటాను అమెరికా టవర్ కార్పొరేషన్ కొనుగోలు చేయడానికి క్యాబినెట్ ఆమోదముద్ర వేసింది. ఈ వాటా విక్రయ విలువ దాదాపు రూ.5,856 కోట్లు.
స్పెక్ట్రమ్ విధానంలో మార్పునకు ఓకే
న్యూఢిల్లీ: వేలం ద్వారా ధర నిర్ణయం కాని చోట పాలనపరంగా కేటాయించిన స్పెక్ట్రమ్ సరళీకరణకు కేబినెట్ అనుమతినిచ్చింది. దీనివల్ల టెలికం ఆపరేటర్లు తమ స్పెక్ట్రమ్‌ను ఇతర ఆపరేటర్లతో షేర్ చేసుకోవటం, క్రయవిక్రయాలు చేయటం, వినియోగానికి సంబంధించి కొత్త టెక్నాలజీలు వాడటం వంటివి వీలవుతాయి. ట్రాయ్ సిఫారసుల మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. దీన్ని అమలు చేయటం వల్ల దాదాపు రూ.1,300 కోట్లు సమకూరుతాయి. దీని ప్రకారం... వేలంలో ధర నిర్ణయం కాని చోట ట్రాయ్ తాజాగా ఏ ధరను సిఫారసు చేస్తే దాన్నే పరిగణనలోకి తీసుకుంటారు. వేలం పూర్తయ్యాక నిర్ణీత ధరకు దానికి మధ్యనున్న తేడాను సర్దుబాటు చేస్తారు. తాజా నిర్ణయంతో రిలయన్స్ కమ్యూనికేషన్స్ సంస్థ 800 మెగా హెర్ట్జ్ స్పెక్ట్రమ్‌ను ముకేష్ అంబానీకి చెందిన రిలయన్స్ జియోతో పంచుకోవటానికి వీలవుతుంది.