జియోకు పోటీగా ఎయిర్‌టెల్ బంపర్ ఆఫర్?
ప్రస్తుతం టెలికం రంగంలో టారిఫ్ వార్ జోరుగా నడుస్తోంది. ఒకవైపు రిలయన్స్ జియో అన్‌లిమిటెడ్ కాల్స్, బోలెడంత డేటా అని ఊదరగొడుతుంటే మరోవైపు దానికి పోటీగా ఎయిర్‌టెల్ కూడా బరిలోకి దూకుతోంది. సరికొత్త ప్రీపెయిడ్ ప్లాన్ ఒకదాన్ని ప్రకటించబోతోంది. ఈ విషయాన్ని ప్రముఖ టెలికం బ్లాగర్ సంజయ్ బఫ్నా ట్వీట్ చేశారు. కొత్త ప్లాన్ ప్రకారం రూ. 399తో రీచార్జి చేసుకుంటే 70 రోజుల వ్యాలిడిటీతో రోజుకు 1 జీబీ 4జీ డేటా వస్తుంది, దాంతోపాటు అన్‌లిమిటెడ్ కాల్స్ కూడా చేసుకోవచ్చు. అయితే, ఇదంతా 4జీ సిమ్ కార్డుతో పాటు 4జీ సదుపాయం ఉన్న ఫోన్లకు మాత్రమే వర్తిస్తుంది.
దాంతోపాటు జియో ఇటీవల ప్రకటించిన ధన్ ధనాధన్ ఆఫర్‌కు పోటీగా రోజుకు 1జీబీ, 2జీబీ డేటా లిమిట్‌తో వేర్వేరు ప్లాన్లు ప్రకటించాలని కూడా ఎయిర్‌టెల్ యోచిస్తున్నట్లు సమాచారం. కంపెనీ నుంచి ఇంతవరకు దీనిపై అధికారిక ప్రకటన ఏమీ రాలేదు గానీ, టెలికం రంగానికి సంబంధించి కచ్చితమైన లీకులు ఇవ్వడంలో బఫ్నాకు మంచి రికార్డు ఉంది. దాంతో ఈ కొత్త ప్లాన్ల విషయంలో కూడా ఆయన చెప్పింది కరెక్టే కావచ్చని అంటున్నారు.