పీఎస్‌ఆర్ నెల్లూరు జిల్లాలో జలసిరులు తాండవిస్తున్నాయి. గడిచిన మూడేళ్లుగా చెరువులు, ప్రాజెక్ట్‌ల్లో నీరు పుష్కలంగా ఉంది. నదులు పొంగిపొర్లుతున్నాయి. జలవనరుల్లో నీటి లభ్యతనుసరించి ఖరీఫ్, రబీ సీజన్లలో సాగు అంచనాలకు తగినట్లుగా కేటాయించిన సాగునీటి వినియోగం తగ్గింది. జలాశయాలు, చెరువుల్లో నీటి నిల్వలు ఏ మాత్రం తగ్గకపోవడంతో పాటు, కార్తెలకు తగినట్లుగా వర్షాలు కురుస్తుండడంతో నీటి నిల్వలకు కొదవలేదు. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్‌కు కేటాయించిన నీటి వినియోగం జరగలేదు. తాజాగా రబీకి నీటి కేటాయింపులను ఆదివారం ఐఏబీ సమావేశంలో నిర్ణయించనున్నారు.
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి జిల్లాలో నీటికి కొరతే లేదు. జలాశయాలు పూర్తి సామర్థ్యానికి చేరుకుంటున్నాయి. రైతుల్లో నీటి గురించి ఏ మాత్రం చింత లేదు. సోమశిల, కండలేరు ప్రాజెక్ట్‌లతో పాటు మేకపాటి గౌతమ్‌రెడ్డి సంగం, నెల్లూరు పెన్నా బ్యారేజీ పూర్తయిన తర్వాత జరిగే మొట్టమొదటి ఐఏబీ సమావేశం. ప్రస్తుతం సోమశిల జలాశయంలో 66.192 టీఎంసీల నీటి నిల్వ ఉంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ నెల ఆరంభంలోనే సోమశిల 76 టీఎంసీలకు చేరుకుంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో సోమశిలకు భారీగా వరద రావడంతో అంతే సామర్థ్యంలో నీటిని పెన్నానది ద్వారా సముద్రానికి వదిలేస్తున్నారు. ప్రస్తుతం 45,885 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది. రానున్న రోజుల్లో కురిసే వర్షాలకు వచ్చే వరద నీటిని సమన్వయం చేసుకుంటూ డిసెంబర్ నెలకు 78 టీఎంసీల నీటి లభ్యత ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. డెడ్ స్టోరేజీ, తాగునీటి అవసరాలు, రాళ్లపాడు జలాశయం, నీటి ఆవిరి శాతం పోనూ మొత్తం 65.102 టీఎంసీల నీటిని రబీ సీజన్‌లో ఇప్పటికే స్థిరీకరించిన ఆయకట్టుతో పాటు తాజాగా స్థిరీకరించిన అదనంగా 55.1000 ఎకరాలకు నీటిని అందించనున్నారు. పది వేల ఎకరాలకు ఒక టీఎంసీ అందించే అవకాశం ఉంది. దీన్ని బట్టి సోమశిల కింద సుమారు 6.50 లక్షల ఎకరాలు సాగునీటిని అందించనున్నారు.
కండలేరు కింద 3.50 లక్షల ఎకరాలు
కండలేరు జలాశయంలో ప్రస్తుతం 53.852 టీఎంసీల నీరు నిల్వ ఉంది. డిసెంబర్ నాటికి డెడ్ స్టోరేజీ నీటి ఆవిరి మినహా 60.854 టీఎంసీలు ఉండే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఎన్‌టీఆర్ తెలుగుగంగ పథకం కింద చెన్నై నగరానికి నీటి సరఫరాతో పాటు నెల్లూరు జిల్లాలో 74,436 ఎకరాలకు, తిరుపతి జిల్లాలో 1,72,423 ఎకరాల మెట్ట భూములతో పాటు చెరువుల కింద 1.08,357 ఎకరాలకు సాగునీటిని అందించనున్నారు. చెన్నై తాగునీటి అవసరాలకు, రాపూరు, పొదలకూరు, వెంకటగిరి, గూడూరు, శ్రీకాళహస్తి, తిరుపతి పట్టణాలకు, స్వర్ణముఖి బ్యారేజీకి తాగు, సాగునీటి అవసరాలు తీర్చేందుకు నీటిని కేటాయించనున్నారు. ఆదివారం వ్యవసాయశాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి నేతృత్వంలో జిల్లా పరిషత్‌లో 10 గంటలకు సాగునీటి సలహా మండలి సమావేశం కానుంది. నీరు సమృద్ధిగా ఉండడంతో ఐఏబీ సమావేశంలో నీటి కేటాయింపులపై ఈ సమావేశంలో చర్చించి నిర్ణయించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment