మిషన్ స్లో | Mission Kakatiya slow | Sakshi
Sakshi News home page

మిషన్ స్లో

Published Sat, Mar 12 2016 2:18 AM | Last Updated on Sun, Sep 3 2017 7:30 PM

మిషన్ స్లో

మిషన్ స్లో

ముందుకు సాగని మిషన్ కాకతీయ పనులు
మొదటి విడతలో 830 చెరువులకు 250చెరువుల పనులే పూర్తి
రెండో విడతలో 110 చెరువులకు ఐదింటిలో పనులు ప్రారంభం
ఈనెలాఖరు వరకు పనులు పూర్తి అనుమానమే..
 

మిషన్ కాకతీయ పనులు నత్తనడకన సాగుతున్నాయి. చెరువుల్లో పూడిక తీసి, ఆయకట్టు రైతులకు సాగునీరందించేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ పథకం అధికారుల చిత్తశుద్ధి లోపం, కాంట్రాక్టర్ల నిర్లక్ష్యంతో పనులు ముందుకు సాగడం లేదు. మార్చి నెలాఖరు వరకు మొదటి విడత పనులు పూర్తి చేయాల్సి ఉన్నా... లక్ష్యం చేరే అవకాశం కనిపించడం లేదు. రెండో విడత పనులు ఇప్పుడే మొదలయ్యాయి. మిషన్ కాకతీయ పథకం ప్రారంభమై ఏడాది పూర్తవుతున్న సందర్భంగా ‘సాక్షి’ ఫోకస్..
 
కరీంనగర్
: మిషన్ కాకతీయ పనులు మందకొడిగా జరుగుతున్నాయి. భూగర్భజలాల పెంపు, చెరువుల పూడికతీత లక్ష్యంగా ప్రభుత్వం ఈ పథకం చేపట్టింది. జిల్లాలో ఏడాది క్రితం ఫేజ్-1లో 81,940 ఎకరాల ఆయకట్టుకు నీరందించేందుకు  1,188 చెరువుల మరమ్మతు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. 830 చెరువులకు అనుమతి లభించగా ఇందుకోసం రూ.313.72 కోట్ల నిధులు సైతం ప్రభుత్వం విడుదల చేసింది. పనులు యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించినా.. కాంట్రాక్టర్లు నిర్లక్ష్యం వహిస్తున్నారు. కేవలం 250 చెరువుల్లో మాత్రమే పనులు పూర్తయ్యాయి.

ఇప్పటివరకు జిల్లా వ్యాప్తంగా కాంట్రాక్టర్లకు రూ.62 కోట్లు బిల్లులు చెల్లించారు.  ఫేజ్-1 పనులన్నింటినీ మార్చి నెలాఖరులోగా పూర్తి చేయించేందుకు చర్యలు తీసుకోవాలని సాక్షాత్తూ భారీ నీటి పారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు ఇటీవల సంబంధిత శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించి ఆదేశాలు జారీ చేసినా ఆ మేరకు పూర్తవడం కష్టంగానే ఉంది. ఏప్రిల్, మే నెల వరకు పూర్తవుతాయని అధికారులు చెబుతున్నారు. గతేడాది నిలిచిపోయిన వాటిలో 30 శాతం చెరువుల్లోనే పనులు జరుగుతున్నాయి.

 తూతూమంత్రం పనులు
 చాలా ప్రాంతాల్లో పనులు తూతూమంత్రంగా పూర్తి చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొన్నిచోట్ల చెరువు కట్టకు మట్టి పోసి పటిష్టంగా పనులు చేపడుతుండగా, మరికొన్ని చోట్ల చెరువులో కొంతభాగం మట్టి తీసి మమ అనిపించారు. వీరికి ఇంజినీరింగ్ అధికారులు నోటీసులు జారీ చేయడంతో పనులు మందకొడిగా సాగుతున్నాయి. కొందరు 12 శాతం నుంచి 22 శాతం వరకు లెస్‌కు టెండర్లు వేసి ఇప్పుడు పనులు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. బిల్లుల చెల్లింపుల్లోనూ తీవ్ర జాప్యం జరగడం కూడా ఒక కారణమని చెబుతున్నారు.

మరోవైపు ఫేజ్-2 పనులు చేపట్టేందుకు అధికారులు సన్నద్ధమవుతుండగా, ఫేజ్-1 పనులు పూర్తి చేయించేందుకు పకడ్బందీ చర్యలు తీసుకోవడం లేదు. ఫేజ్-2లో 31,726 ఎకరాల ఆయకట్టు కోసం 1,271 చెరువుల మరమ్మతు లక్ష్యంగా నిర్ణయించుకోగా రూ.159 కోట్లు కేటాయించారు. 110 చెరువులకు కాంట్రాక్టర్లతో ఒప్పందం కాగా, 5 చెరువుల పనులు ప్రారంభించారు. మిగతా చెరువుల పనులు వారం రోజుల్లోపు ప్రారంభమవుతాయని అధికారులు చెబుతున్నారు.

 మినీ ట్యాంక్‌బండ్‌లు
మిషన్‌కాకతీయ రెండో దశలో భాగంగా జిల్లాలోని 13 నియోజకవర్గాలకు మినీట్యాంకు బండ్‌లు నిర్మించేందుకు అధికారులు ప్రతిపాదనలు పంపారు. 10 నియోజకవర్గాల్లో మినీ ట్యాంక్‌బండ్‌లు నిర్మించేందుకు ప్రభుత్వం అనుమతి వచ్చింది. వీటికి గాను రూ.38 కోట్లు కేటాయించింది.

హుజూరాబాద్ : మిషన్ కాకతీయ మొదటి దశలో 20 చెరువులు ఎంపిక చేసి 19 చెరువుల్లో పూడిక తీత పనులు ప్రారంభించారు. మూడు చెరువుల్లో పూడికతీత పనులు పూర్తయ్యాయి. 14 చెరువుల్లో పూడిక పునరుద్ధరణ పనులు కొనసాగుతున్నాయి. మరో 3 చెరువుల పనులను అధికారులు ఇప్పటివరకు ప్రారంభించలేదు. ఫేజ్-2లో 19 చెరువులు గుర్తించి ప్రతిపాదనలు పంపితే 11 చెరువులకు ప్రభుత్వం నుంచి అనుమతి లభించింది. ఇంకా పనులు ప్రారంభం కావాల్సి ఉంది.
  
కరీంనగర్ : మొదటి విడతలో మిషన్ కాకతీయలో మొత్తం 17 చెరువుల అభివృద్ధికి ప్రభుత్వం రూ.7 కోట్ల 28 లక్షలు మంజూరు చేసింది. 3 చెరువుల్లో 100 శాతం పనులు పూర్తికాగా, 10 చెరువులు 50 నుంచి 90శాతం పూర్తయ్యాయి. మరో 4చెరువుల్లో పనులు ప్రారంభం కాలేదు. రెండో విడతలో 14 చెరువులకు అనుమతి వచ్చింది. వీటిలో కొత్తపల్లి ఊరచెరువును మినీట్యాంక్‌బండ్‌గా అభివృద్ధి చే సేందుకు ప్రభుత్వం రూ.5కోట్ల 60వేలు మంజూ రు చేసింది. టెండర్లు వారం రోజుల్లో పూర్తి చేసి పనులు ప్రారంభిస్తామని అధికారులు తెలిపారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement