
భూగర్భజలాలు కలుషితం
క్రషర్ బ్లాస్టింగ్‌కు వాడే రసాయనాల ఎఫెక్ట్..
పెట్రోలు, డీజిలు వాసన వస్తున్న బోరుబావుల నీరు
ఎండిపోతున్న పంటలు..రైతులకు కోలుకోలేని దెబ్బ
యాటకల్లుకు చెందిన ఈ రైతు పేరు ఈరన్న. ఈయనకు క్రషర్ సమీపంలో పొలం ఉంది. రెండు నెలల కిందట బోరు కింద ఐదు ఎకరాల్లో వేరుశనగ సాగు చేశాడు. క్రషర్‌లో పేలుళ్ల ధాటికి వెలువడే తెల్లని పొగకు, భూగర్భజలం కలుషితమై బోరు నుంచి వస్తున్న నీటికి పంటలో ఎదుగుదల లోపించింది. పైగా బోరు నుంచి వచ్చే నీరు పెట్రోల్, డీజిల్ లాంటి వాసన వస్తోంది. ఇలా ఒక్క ఈరన్నదే కాదు...గ్రామంలో పదుల సంఖ్యలో రైతులకు చెందిన బోరు బావుల్లో నీరు కలుషితం అయ్యింది.
శెట్టూరు: యాటకల్లు గ్రామం వద్ద గల క్రషర్ కారణంగా సమీపంలోని పొలాలు బీడుగా మారుతున్నాయి. అసలే వర్షాభావ పరిస్థితులతో కొట్టుమిట్టాడుతున్న రైతులు అరకొరగా వచ్చే బోర్ల నీటితోనైనా పంటలు సాగుచేసుకుందామనుకుంటే క్రషర్ రూపంలో అడియాస అవుతోంది. క్రషర్ నుంచి తయారయ్యే కంకరకు భారీ డిమాండ్ పెరగడంతో కొద్ది రోజుల నుంచి క్రషర్‌లో అధిక సామర్థ్యంతో పేలుళ్లు (బ్లాస్టింగ్) జరుపుతున్నారు. బ్లాస్టింగ్‌కు వాడే రసాయనాలు, ఇంధనం, దాని సామర్థ్యాలు అధిక మోతాదులో ఉండటంతో గ్రామంలో ఇళ్లు బీటలు వారాయి. క్రషర్ నుంచి వెలువడే తెల్లని పొడి పంట పొలాలను కప్పేసి భూమి సారవంతాన్ని పీల్చి పిప్పి చేస్తోందని రైతులు మండిపడుతున్నారు.
కలుషితమవుతున్న భూగర్భజలాలు
క్రషర్‌కు ఆనుకుని 15 నుంచి 20 దాకా వ్యవసాయ బోర్లు ఉన్నాయి. వీటి ద్వారా వచ్చే నీటితో సమీపంలోని 15 మంది రైతులు వేరుశనగ సాగు చేసుకున్నారు. బ్లాస్టింగ్ సమయంలో వాడే ఇంధనం వల్ల భూగర్భజలాలు కలుషితం అయ్యాయని రైతులు వాపోతున్నారు. బోరు నుంచి నీరు బయటికి వస్తున్న సమయంలో పెట్రోల్, డీజిల్ వాసన వస్తోందని చెబుతున్నారు. వ్యవసాయ పనులకు వచ్చే కూలీలు ఈ నీటిని తాగితే ప్రాణాలు ఇక అంతేననే ఆందోళన చెందుతున్నారు.
క్రషర్ ప్రభావంతో వట్టిపోయిన బోర్లు
క్రషర్ చుట్టూ ఉన్న వ్యవసాయ బోర్లన్నీ పూర్తిగా వట్టిపోయాయి. గ్రామానికి చెందిన పెద్దన్న, వెంకటేశులు, రామచంద్ర, బోయ తిప్పేస్వామి, తిమ్మన్న, ప్రసాద్, రామాంజనేయులు, తిమ్మప్పతో పాటు మరికొంతమందికి చెందిన బోర్లు ఎండిపోయాయి. దీని కారణంగా 100 ఎకరాలు బీడు భూములుగా మారాయి. ఇటీవల వేసిన కొత్త బోర్లలో సైతం నీరు ఒకటి, రెండు నెలల పాటు వచ్చి వట్టిపోయినట్లు రైతులు చెబుతున్నారు. క్రషర్ బ్లాస్టింగ్ ప్రభావంతో జరుగుతున్న నష్టం గురించి ఫిర్యాదు చేస్తే రెవెన్యూ, పోలీసు ఇతర అధికారులు పరిశీలనకు వచ్చి, మైనింగ్‌శాఖకు నివేదికలు పంపుతామని చెప్పి చేతులు దులుపుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.