బోరుమంటున్న రైతు | District 5 thousand new bores per month! | Sakshi
Sakshi News home page

బోరుమంటున్న రైతు

Published Sun, Jan 11 2015 4:16 AM | Last Updated on Mon, Oct 1 2018 2:00 PM

బోరుమంటున్న రైతు - Sakshi

బోరుమంటున్న రైతు

జిల్లాలో నెలకు 5 వేల కొత్త బోర్లు!
20 శాతం మేర నిరుపయోగమే..
కానరాని జియాలజిస్టులు
మంత్రగాళ్లను ఆశ్రయిస్తున్న రైతులు
కొబ్బరికాయ తిరిగిందని కొనితెచ్చుకుంటున్న కష్టాలు

సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: కలిసిరాని కాలంతో అన్నదాతలు పోటీ పడుతున్నారు. పాతాళానికి పైపులు వేసి గంగను పైకి తెచ్చేందుకు పడరాని పాట్లు పడుతున్నారు. నెర్రెలు బారిననేల మీద నీరు పారించే ప్రయత్నం అపర భగీరథ ప్రయత్నాలే చేస్తున్నారు. సాగునీటి సమస్య తీవ్రంగా జిల్లాలోని రైతన్నలు నెలకు సగటున 5 వేల బోర్లు వేయిస్తున్నట్టు అంచనా. ఈ ఏడాది ఇది ఇంకా పెరిగే అవకాశం ఉంది.

కేసీఆర్ ప్రభుత్వం సాగు, తాగు నీటి కోసం భారీ ప్రాజెక్టులకు రూపకల్పన చేస్తున్నప్పటి కీ అన్నదాతలు అప్పటి వరకు ఆగలేకపోతున్నారు. అందిన చోట అప్పులు చేసి బోర్ల మీద బోర్లు వేసుకుంటున్నారు. రెండు, మూడు ఎకరాలు ఉన్న సన్న, చిన్నకారు రైతులు కూడా పదుల సంఖ్యలో బోర్లు వేస్తూ అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. జిల్లాలో రిగ్గులకు డిమాండ్  పెరగటంతో ఆఫ్రికా దేశాలకు పంపించాల్సిన రిగ్గులను కూడా ఇక్కడికే తీసుకు వస్తున్నట్లు బోర్స్‌వెల్స్ మిషన్ల యాజమానులు చెబుతున్నారు.

జిల్లా వ్యాప్తంగా 4.5 లక్షల హెక్టార్ల సాగుభూమి ఉండగా, జిల్లా సగటు వర్షపాతం 808.4  మిల్లీమీటర్లు ఉంది. ఈ లెక్కన చూస్తే మెతుకు సీమ అర్ధ ఉష్ణ, అర్ధమెట్ట ప్రాంతంలోనే ఉంది. నల్లవాగు, ఘణపురం ప్రాజెక్టు కింద 27 వేల ఎకరాలకు మాత్రమే నీళ్లు అందుతున్నాయి. మిగిలిన ప్రాంతంలో చెరువులు, కుంటల ద్వారా సాగునీరందుతున్నప్పటికీ, మూడేళ్లుగా తీవ్ర వర్షాభావ పరిస్థితులతో  చెరువులు కుంటలు అవన్నీ ఎండిపోవడంతో సాగునీటికి సంకటంగా మారింది. ఈ పరిస్థితుల్లో వ్యవసాయానికి కేవలం బోర్లు మాత్రమే ఆధారం అయ్యాయి
 
జియాలజిస్టుల లేక....
ప్రస్తుతం జిల్లా సగటు భూగర్భ జలాల మట్టం 16.98 మీటర్లు ఉంది. మండలాల వారీగా చూస్తే ములుగు మండల కేంద్రంలో 39.78 మీటర్ల లోతులో నీళ్లు ఉన్నాయి. వర్గల్ మండలం మజీద్‌పల్లిలో అత్యల్పంగా 6.02 మీటర్లలో నీళ్లు ఉన్నట్లు భూగర్భ జలాల నిర్ధారణ శాఖ అధికారులు నిర్ధారించారు. ఈ తారతమ్యాలు రైతులకు తెలియదు. ప్రభుత్వ లెక్కల ప్రకారం జిల్లాలో ప్రతి ఏడాది 50 వేల నుంచి 60వేల బోర్లు వేస్తున్నట్లు అంచనా.

వీటిలో కేవలం ఇరవై శాతం మాత్రమే ఫలితం చూపుతున్నాయి.  భూగర్భ జలాల నిల్వలు ఎక్కడ ఉన్నయో... ఎంత లోతులో ఉన్నయో నిర్ధారణ చేసి, ఆ తర్వాత బోరు వేసుకుంటే  అన్నదాతలకు కొంతలో కొంత మేలు జరుగుతుంది. కానీ వాస్తవ పరిస్థితి అలా లేదు. జియాలజిస్టులు అంటే ఎవరో కూడ రైతులకు తెలియని పరిస్థితి. ప్రభుత్వ వైపు ప్రోత్సాహం కూడా అలానే ఉంది.

నిజానికి జిల్లాకు 10 మంది జియాలజిస్టులు అవసరం కాగా, ముగ్గురు అధికారులు మాత్రమే ఉన్నారు. ఈ ముగ్గురు కూడా ఆర్‌డబ్ల్యూఎస్, ఇందిర జలప్రభ తదితర శాఖలు ఇచ్చిన బోర్ పాయింట్లు చూసి నిర్ధారణ చేయడానికే సరిపోతున్నారు. ఇక రైతులను పట్టించుకునే వారే లేరు. దీంతో రైతులు అమాయకత్వంతో ఒక బోరు పడకపోతే... రెండవ బోరైన పడక పోతుందా... మూడోదైన  కాకపోతుందా..! అనే ఆలోచనతో బోర్ల మీద బోర్లు వేసి ఇళ్లు గుళ్ల చేసుకుంటున్నారు.
 
దొరికిన వెసులుబాటుతో...
ఈ ఏడాది బోర్ల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. గతంలో రైతులు  షావుకార్ల వద్ద అప్పు చేసి విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు తెచ్చుకొని సాగు చేసుకునేవాళ్లు. పంట చేతికి వచ్చినపుడు షావుకారి పంట తీసుకొని, తన బాకీ పట్టుకొని మిగిలినది రైతు చేతిలో పెట్టేవాళ్లు.

ఈ మిగిలిన డబ్బు బ్యాంకు లోన్ కట్టేవాళ్లు. ఈ ఏడాది ప్రభుత్వం రైతు రుణమాఫీ చేసింది, రైతులు కూడా నేరుగా మార్కెట్‌లోకి తీసుకొచ్చి పంటను అమ్మడంతో వారి చేతికే డబ్బు వచ్చింది. దీంతో రైతులు షావుకారికి వడ్డీ మాత్రమే కట్టి, అసలు  మరుసటి పంట మీద ఇస్తానని చెప్తున్నారు. ఈ డబ్బుతో రైతులు బోర్లు వేసుకుంటున్నట్లు ‘సాక్షి’ పరిశీలనలో తేలింది. దీంతో ఏడాది జిల్లాలో బోర్ల సంఖ్య పెరగనున్నట్లు తెలుస్తోంది.
 
కొత్త దేవుళ్లతో మోసం...
రైతుల ఆమాయకత్వాన్ని ఆసరా చేసుకొని  కొత్త దేవుళ్లు బయలు దేరారు.  చేతిలో కర్రతో  ఒకరు..కొబ్బరికాయతో మరొకరు...నిమ్మకాయతో ఇంకొకరు పంట పొలాల్లో భూగర్భ జలాలలను చూపిస్తామంటూ మాయమాటలు చెప్పి రైతులను మోసగిస్తున్నారు. ఏదో కుంకుమ బొట్లు పెట్టి, కర్రపుల్ల పట్టుకొని పొలంలో ఐదు, ఆరు బోరు పాయింట్లు చూపిస్తున్నారు. బోరులో నీళ్లు పడితే ఇతగాని క్రెడిట్.  లేదంటే రైతు దురదృష్టం. ఇక ఈ మోసగాళ్ల మాయలో పడి రైతులు తమ ఆర్థిక స్థితిని మరిచిపోయి బోర్లు వేస్తున్నారు. జిల్లాలో నాలుగైదు బోర్ల కంటే తక్కువ వేయించని రైతులు లేకపోవడం గమనార్హం.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement