జలం.. జఠిలం
తగ్గుతున్న భూగర్భ జలాలు
మెదక్ జోన్ : అన్నదాతల కష్టాలు అన్నీ ఇన్నీ కావు. ఓసారి అనావృష్టి.. మరోసారి అతివృష్టి వల్ల చేతికొచ్చిన పంటలు అందకుండా పోయి.. అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. ఖరీఫ్‌లో కాలం కలిసి రాకున్నా.. వర్షాకాలం ఆఖరులో కురిసిన భారీ వర్షాలకు చెరువులు, కుంటలు నిండుకుండలుగా మారాయి. వాగులు, వంకలు పొంగిపొర్లాయి. దీంతో రైతులు యాసంగిలో జోరుగా నాట్లు వేశారు. కాగా ఎండలు వేసవిని తలపిస్తుండటంతో రోజురోజుకూ భూగర్భజలమట్టం తగ్గిపోతున్నాయి. ఫలితంగా బోరు బావుల్లో నీరు రావడం లేదు. నెలరోజుల వ్యవధిలోనే మీటర్‌కుపైగా నీరు అడుగంటిపోయింది.
గత సంవత్సరం డిసెంబర్‌లో 12.45 మీటర్ల లోతులోకి భూగర్భజలాలు పడిపోగా.. జనవరిలో 13.07 మీటర్ల లోతులోకి పడిపోయాయి. యాసంగిపై రైతులు పెట్టుకున్న ఆశలు అడియాసలే అవుతున్నాయి. భూగర్భజలాలు వేగంగా అడుగంటుతుండడంతో అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు. ఈ ఏడు రబీ సీజన్‌లో జిల్లా వ్యాప్తంగా 20,561 హెక్టార్లలో పంటలు సాగు చేశారు. ఈ సాగు సాధారణంతో పొలిస్తే 40 శాతం అధికంగా నాట్లు వేశారు. బోరు బావుల్లో కేవలం నెలరోజుల వ్యవధిలో సగానికిపైగా నీరు తగ్గిపోవడంతో వరి పంటకు నీటి తడులు అందక భూములు నెర్రలు బారుతున్నాయి. ఇప్పుడే ఇలా ఉంటే.. రానురాను ఎండలు తీవ్రం కానున్నాయి.
మరి ఈ ఏటా యాసంగి పంటలు చేతికి వస్తాయో..? లేదో..? అని రైతులు గుండెలు బాదుకుంటున్నారు. గడిచిన మూడేళ్లలో తీవ్ర కరువుతో అల్లాడిన రైతాంగం ఈ ఏడు కురిసిన భారీ వర్షాలవల్ల రైతన్నకు ప్రాణం పోసినట్లయింది. కానీ వేసవికాలం ప్రారంభంలోనే బోరు బావులు, చెరువులు, కుంటల్లో నీరు ఇంకిపోవడంతో కర్షకులు ఆందోళన చెందుతున్నారు. వేలాది రూపాయల అప్పు చేసి వరి పంటను సాగు చేసిన రైతాంగానికి కన్నీరు మిగిలే పరిస్థితి దాపురించిందని పలు మండలాల రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పంటలకు నీళ్లు అందుత లేవు..
ఎకరంన్నర పొలంలో ఎకరం నాటేసిన.. అద్దెకరంలో మొక్కజొన్న పంట వేసిన. బోర్లో నీళ్లు తగ్గిపోయినాయి. పొలం పారుత లేదు. రూ.20వేల అప్పు చేసిన. ఎట్లా బతకాల్నో అర్థమైత లేదు..
– కేతావత్ శాంతి, ఔరంగబాద్ తండా
పంట ఎండిపోతోంది..
ఎకరం పొలం ఉంది. బోరును చూసుకుని నాటేసిన. నెలరోజుల నుంచి బోర్ల నీళ్లు బందైనయి. పొలం పారుత లేదు. పంట కోసం రూ.15వేలు అప్పు చేసిన. గిప్పుడేమో పంట ఎండిపోయింది. పిల్లలను ఎట్లా సాదుకోవాలో అర్థమైత లేదు సారూ..
– లంబాడి లక్ష్మి, ఔరంగబాద్ తండా