నీటి గుంత.. తీరని చింత
ఫాంపాండ్ నిర్మాణాల్లో తీవ్ర జాప్యం
రైతులకు కరువైన అవగాహన
పట్టింపులేని అధికారులు
నీరుగారుతున్న ప్రభుత్వ లక్ష్యం
వర్ధన్నపేట : అధికారుల నిర్లక్ష్యం.. రైతులకు శాపంగా మారింది. నీటి గుంతల నిర్మాణంతో వృథా నీటిని ఒడిసిపట్టి భూగర్భ జలాలు పెంచేందుకు సంకల్పించిన ప్రభుత్వ ఆశయాన్ని వారు నీరుగారుస్తున్నారు. ఫలితంగా సాగునీటి కోసం రైతులు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి నెలకొంది. వివరాల్లోకి వెళితే.. జిల్లాలో 15 మండలాల్లో ప్రస్తుతం ఉపాధిహామీ పనులు జోరుగా జరుగుతున్నాయి. అయితే ప్రతి రైతుకు నీటి గుంతలపై అవగాహన కల్పించి భూగర్భజలాలను పెంచాలని ప్రభుత్వం భావించింది. ఈ మేరకు ఫారంపాండ్స్ నిర్మాణాలు చేపట్టాలని నిర్ణయించింది. అలాగే వాటికి సంబంధించిన పనులను ప్రారంభించింది.
పర్యవేక్షణ కరువు..
ఉపాధిహామీ పథకంలో భాగంగా జిల్లాలో చేపట్టిన ఫారంపాండ్స్ నిర్మాణాలపై క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ కరువైంది. ఆర్థిక సంవత్సరం ముగుస్తున్నా పనుల్లో వేగం పెరగడం లేదు. వేలల్లో మంజూరు చేసిన అధికారులు నిర్మాణాలపై శ్రద్ధ వహించడం లేదని తెలుస్తోంది. నీటి గుంతల ప్రయోజనాలపై రైతులకు సరైన అవగాహన కల్పించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
4,417 మంజూరు..
జిల్లాలో ఈ ఏడాది 4,417 మంది రైతులకు ఫారంఫాండ్స్ మంజూరు చేశారు. ఇందులో ఇప్పటివరకు 2381 పూర్తికాగా, 929 నిర్మాణ దశలోనే ఉన్నా యి. కాగా, 1107 మంది రైతులు ప్రారంభంలోనే వెనకడుగు వేశారు. ఫారంఫాండ్స్ నిర్మాణాలను పూర్తి చేయాలని కలెక్టర్ ప్రశాంత్ జీవన్‌పాటిల్ ఆదే శాలు జారీ చేస్తున్నా లక్ష్యం పూర్తికాకపోవడం గమనార్హం. ఇందులో ఫీల్డ్ అసిస్టెంట్ల నిర్లక్ష్యం ఎక్కువగా ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
వర్ధన్నపేట వెనకంజ..
ఫారంఫాండ్స్ నిర్మాణాల్లో వర్ధన్నపేట మండలం వెనకంజలో కొనసాగుతుంది. మండలానికి 631 మంజూరుకాగా.. ఇప్పటివరకు 82 నిర్మాణాలను మాత్రమే పూర్తి చేశారు. కాగా, చెన్నారావుపేటలో 470 మంజూరుకాగా 303 పూర్తయ్యాయి. ఆత్మకూరులో 128, దుగ్గొండిలో 425, గీసుకొండలో 45, ఖానాపురంలో 60, నల్ల»ñబెల్లిలో 95, నర్సంపేటలో 55, నెక్కొండలో 343, పరకాలలో 45, పర్వతగిరిలో 283, రాయపర్తిలో 94, సంగెంలో 386, శాయం పేటలో 38 పూర్తయ్యాయి.
అవగాహన కల్పిస్తే లక్ష్యం పూర్తి..
ఫారంఫాండ్ నిర్మాణాలతో సాగు భూమిలో కొంత కోల్పోతామనే ఆలోచనతో రైతులు ముందుకు రావడం లేదని తెలుస్తోంది. పల్లపు ప్రదేశంలో గుం తలను నిర్మించడంతో వర్షపు ద్వారా వచ్చే నీటిని ఒడిసి పట్టుకోవచ్చు. దీంతో భూగర్భ జలాలు పెరగడంతో బోరుబావుల్లో పుష్కలంగా నీరు ఉండే అవకాశం ఉంది. అవసరమైన సమయాల్లో ఫారంఫాండ్‌లోని నీటిని సాగునీటిగా పంటలకు ఉపయోగించవచ్చు. వర్షాభావ పరిస్థితుల్లోనూ సాగు నీరు రైతులకు అందుబాటులో ఉంటుంది. నీటి గుంతల నిర్మాణంతో కొంత భూమి కోల్పోయినా దీర్ఘకాలిక ప్రయోజనాలు పొందవచ్చని విష యాలపై అధికారులు అవగాహన కల్పించాలి. తద్వారా ఆశించిన లక్ష్యం నెరవేరుతోంది.
రమణారెడ్డికి అభినందనలు..
వర్ధన్నపేట మండలంలోని కడారిగూడెంలో రైతు సొల్లేటి రమణారెడ్డి ఉపాధిహామీ పథకం ద్వారా ఇటీవల ఫారంపాండ్‌ను నిర్మించారు. నీరు నిల్వ ఉండడంతో మోటార్ ద్వారా ఆయన పంటకు సాగునీటినిఅందిస్తున్నారు. కాగా, కలెక్టర్ ప్రశాంత్ జీవన్‌పాటిల్ గత ఏడాది డిసెంబర్ 27వ తేదీన గ్రామాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఫారంఫాండ్‌ను పరిశీలించిన కలెక్టర్ రైతు రమణారెడ్డి చేస్తున్న కృషిని ప్రత్యేకంగా అభినందించారు.