► నీటితో కళకళలాడుతున్న సైరిగాం చెరువులు
సైరిగాం: ఒకప్పుడు ఆ గ్రామంలో ఖరీఫ్ పంటకు కూడా సాగునీరు వెతుక్కోవాల్సి వచ్చేది. జలు మూరు ఓపెన్ హెడ్ తోపాటు 19 ఆర్ పర్లాం, 20ఆర్ కూర్మానాథపురం వంటి కాలువలు ఉన్నా పొలాలు సాగునీటి కోసం ఆశగా ఎదురు చూసేవి. కానీ ఇప్పుడు వేసవిలోనూ ఈ గ్రామానికి తనివి తీరా నీరు అందుతోంది. గ్రామాన్ని దత్తత తీసుకున్న రాష్ట్ర ఆర్థిక కార్యదర్శి ముద్దాడ రవి చంద్ర ఆ గ్రామంలో ఉన్న బూసప్ప కోనేరు, చుట్టు గుండం, ఊరుగుండం, సింకింనాయడుచెరువు, గాదిబంద, బైమ్మకోనేరు, సోమనాద్రి చెరువు, మంగళవారం చెరువు, పాపమ్మకోనేరు, ఉప్పరవాని చెరువు తదితర వాటిని ఇటీవలే బాగు చేశారు.
దీంతో వర్షాకాలంలో వృథాగా పోయే నీరు ఇప్పుడు ఆయా చెరువుల్లో నిల్వ ఉండి పంటకు జీవం పోస్తోంది. ఈ నీటితోనే ఇప్పుడు 159 ఎకరాల వరకు పెసర, మినుగు, నువ్వు, పొద్దు తిరుగుడు తదితర పంటలు సాగు చేస్తున్నారు. పశువులకు కూడా దాహం తీరుతోంది. ఇందులో కొన్ని భూములకు నేరుగా నీరు వెళ్లగా మరి కొన్ని పొలాలకు మాత్రం ఇంజిన్లతో నీటిని తోడుతున్నారు. మరి కొద్ది రోజుల్లో వరి తదితర పంటలు చేతికి వచ్చి ఎకరాకు 30 బస్తాలు వరకూ దిగుబడి వస్తుందని ఆ రైతులు చెబుతున్నారు.