పంటా పోయె.. పాడీ పోయె..! | Loss of vendor | Sakshi
Sakshi News home page

పంటా పోయె.. పాడీ పోయె..!

Published Sun, Nov 29 2015 3:44 AM | Last Updated on Mon, Oct 1 2018 2:09 PM

పంటా పోయె.. పాడీ పోయె..! - Sakshi

పంటా పోయె.. పాడీ పోయె..!

♦ రాష్ట్రవ్యాప్తంగా రైతుల పరిస్థితి దుర్భరం
♦ వర్షాభావంతో దెబ్బతిన్న పంటలు..
♦ పాతాళానికి చేరిన భూగర్భ జలాలు

 పశువులను తెగనమ్ముకుంటున్న రైతులు  మేపడానికి మేతలేదు.. తాగించడానికీ నీరు కరువు  వేల సంఖ్యలో కబేళాలకు తరలుతున్న మూగ జీవాలు ఎక్కడ చూసినా బీడుగా కనిపిస్తున్న సాగు భూములు  రాష్ట్రవ్యాప్తంగా 350కిపైగా మండలాల్లో కరువు.. ప్రభుత్వం ప్రకటించినది 231 మండలాల్లోనే
 
 సాక్షి ప్రత్యేక ప్రతినిధి
 రాష్ట్రంలో రైతుల ప్రధాన ఆదాయ వనరులు పత్తి, వరి పంటలే. కానీ ఈ సేద్యమే రైతన్నల ప్రాణాలనూ బలి తీసుకుంటోంది. కరువు పరిస్థితులే దీనికి కారణం. అటు ఖరీఫ్‌లోనూ, ఇటు రబీలోనూ వానలు ముఖం చాటేశాయి. అధికారిక గణాంకాల ప్రకారమే... ఈ ఏడాది వర్షపాతం గతేడాది కంటే దాదాపు 41 శాతం తక్కువ. రాష్ట్రంలో సాధారణ వర్షపాతం 713.6 మిల్లీమీటర్లు కాగా... ఈ ఏడాది ఖరీఫ్‌లో 14 శాతం తక్కువగా నమోదైంది. నిజామాబాద్ జిల్లాలో ఏకంగా మైనస్ 45 శాతం తక్కువగా నమోదైంది. ఇక రబీ సీజన్ (అక్టోబర్-నవంబర్ నెలల్లో) సాధారణ వర్షపాతం 112.1 మిల్లీమీటర్లుకాగా.. ఈ నెల 26వ తేదీ నాటికి కురిసింది 24.2 మిల్లీమీటర్లే. అంటే ఇది ఏకంగా 78 శాతం తక్కువ. వ్యవసాయ శాఖ మంత్రికి చెందిన నిజామాబాద్ జిల్లాలో మొత్తం 36 మండలాలను కరువు కబళించింది. ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు ప్రాతినిధ్యం వహిస్తున్న మెదక్ జిల్లాలో 46 మండలాల్లో కరువు నెలకొంది.

 పాలమూరులో పల్లెలన్నీ ఖాళీ..
 దేశంలోని కరువు జిల్లాల్లో ఒకటిగా గుర్తింపు పొందిన మహబూబ్‌నగర్ జిల్లాలో పరిస్థితులు మరింత దారుణంగా మారాయి. ఈ జిల్లాలో మొత్తం 64 మండలాలను ప్రభుత్వం కరువు పీడిత ప్రాంతాలుగా ప్రకటించింది. జిల్లాలోని అచ్చంపేట, కల్వకుర్తి ప్రాంతాలు ఎడారిని తలపిస్తున్నాయి. సినీనటుడు ప్రకాశ్‌రాజ్ దత్తత తీసుకున్న కల్వకుర్తి సమీపంలోని కొండారెడ్డిపల్లిలో రైతుల పరిస్థితి దారుణంగా ఉంది. ఈ గ్రామంలో ఉపాధి లేక 80 శాతం మంది వ్యవసాయ కూలీలు హైదరాబాద్, ముంబైలకు తరలివెళ్లారు. ఏ పని చేయలేని వృద్ధులు మాత్రమే పల్లెల్లో కనిపిస్తున్నారు. నాగర్‌కర్నూలు, కొల్లాపూర్ ప్రాంతాల్లో ఇళ్లలో బోర్లు కూడా ఎండిపోయాయి.

తన ఆరెకరాల బత్తాయి తోటకు నీరు అందే అవకాశం లేక కళ్ల ముందే ఎండిపోతోందని ఆ గ్రామానికి చెందిన కాయితీ మురళీధర్‌రెడ్డి కన్నీటి పర్యంతమయ్యారు. వలసలు నివారించడానికి ఉద్దేశించిన ఉపాధి హామీ పథకం తెలంగాణలోని చాలా జిల్లాల్లో ఈ ఏడాది 55 శాతం కూడా అమలు కాలేదు. వారానికి రెండు రోజులు కూడా ఉపాధి చూపడం లేదని కేంద్ర మాజీ మంత్రి ఎస్.జైపాల్‌రెడ్డి స్వగ్రామమైన మాడుగుల ప్రజలు చెప్పారు. మరో మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రాతినిధ్యం వహిస్తున్న కొల్లాపూర్ నియోజకవర్గం నుంచీ వలసలు పెరిగాయి. మంత్రి లక్ష్మారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న జడ్చర్ల నియోజకవర్గంలోనూ అదే పరిస్థితి.

‘‘సాధారణంగా ఫిబ్రవరి, మార్చిలో మొదలయ్యే వలసలు ఈ ఏడాది సెప్టెంబర్ నుంచే మొదలయ్యాయి. నవంబర్ మొదటి వారానికే గ్రామీణ ప్రాంతాల్లోని 70 శాతం వ్యవసాయ కూలీలు, 40 శాతం మంది రైతులు పట్నం బాట పట్టారు. గ్రామాల్లో పిల్లలు, వృద్ధులే ఉన్నారు..’’ అని ఈ నియోజకవర్గంలో పనిచేస్తున్న డిప్యూటీ తహసీల్దార్ ఒకరు చెప్పారు. నాగర్‌కర్నూల్ నుంచి జడ్చర్ల మార్గంలో 70 నిమిషాల పాటు ప్రయాణించిన ‘సాక్షి’ ప్రతినిధికి పశువులను ఇతర ప్రాంతాలకు రవాణా చేస్తున్న 11 వాహనాలు కనిపించాయి. ఓ వాహనాన్ని ఆపి పశువులను ఎక్కడికి తీసుకువెళుతున్నారని అడిగితే.. డ్రైవర్ తనకు తెలియదని సమాధానమిచ్చాడు.

‘‘దళారులు వచ్చి కొనుగోలు చేస్తున్నారు. 15 వేలు ధర పలికే గొడ్డుకు ఆరు వేలు ఇస్తున్నారు. వాటికి మేత లేక వదిలించుకుంటున్నాం. బెంగళూరుకు తీసుకువెడుతున్నామని అంటున్నారు..’’.. అని రోడ్డు మీద పశువులను మేత కోసం తిప్పుతున్న ఏనుబోతుల మల్లయ్య ఆవేదన వ్యక్తం చేశాడు. తనకు పాడి ఇచ్చే నాలుగు పశువులు ఉన్నాయని, వాటి మేత కోసం నాలుగు ఎద్దులను అమ్ముకోవాల్సి వచ్చిందని చెప్పాడు. అయితే ‘‘జిల్లాలో కరువు పరిస్థితిపై ప్రభుత్వం దృష్టికి తెచ్చినా పట్టించుకోలేదు. అసెంబ్లీలో ప్రస్తావిద్దామంటే మొదటి రోజే సస్పెండ్ చేసి బయటకు పంపారు. కరువు విషయంలో ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది..’’ అని వనపర్తి ఎమ్మెల్యే చిన్నారెడ్డి పేర్కొన్నారు.

 నల్లగొండ ‘గోడు’
 దక్షిణతెలంగాణలోని నల్లగొండ జిల్లాలోనూ పరిస్థితి దారుణంగా ఉంది. ఖరీఫ్‌లో ధాన్యం దిగుబడి బాగా తగ్గింది. నాగార్జునసాగర్ ప్రాజెక్టు నుంచి దిగువకు చుక్క నీరు విడుదల కాలేదు. తాగునీటి కోసం మాత్రం కొన్ని చెరువులు నింపారు. ఈ జిల్లాలోని 59 మండలాల్లో 22 మండలాలను మాత్రమే కరువు పీడిత ప్రాంతాలుగా ప్రకటించారు. కానీ ఈ జిల్లాలోని అన్ని ప్రాంతాల్లోనూ కరువు తాండవిస్తోంది. కృష్ణా నది ప్రవహించే దామరచర్ల, నేరేడుచర్ల, మఠంపల్లి, మేళ్లచెర్వు ప్రాంతాల్లోనూ పశుగ్రాసం లేక రైతులు పశువులను తెగనమ్ముకుంటున్నారు. ఈ జిల్లాలోని మొత్తం సాగుభూమిలో 80 శాతానికిపైగా ఇప్పుడు బీడుగానే కనిపిస్తోంది. దేవరకొండ ప్రాంతంలోనైతే తాగునీటికే కటకట నెలకొంది. వారానికి ఒకసారి నీటిని సరఫరా చేస్తున్నారు. తాగునీటికే దిక్కులేకపోవడంతో... పశువులకు మేత, నీరు లేక అందినకాడికి అమ్మేసుకుంటున్నారు. దేవరకొండ మండలం మల్లేపల్లి సంత పశువుల అమ్మకానికి ప్రసిద్ధి. వ్యవసాయ పనులకు పశువులు కావాలనుకునే వారు ఇక్కడకు వచ్చేవారు. కానీ ఇప్పుడీ సంతలో కబేళాలకు పశువులను తరలించే దళారులే కనిపిస్తున్నారు.
 
 అమ్ముకునీ నష్టపోతున్నాం..
 ‘‘పశువులకు మేత కరువైంది. అందుకే అమ్మేసేందుకు వచ్చినం. వ్యాపారులేమో తక్కువ ధర ఇస్తున్నరు. ఇప్పటికే పంటలు పండక నష్టపోయినం.. ఇప్పుడు పశువులను అమ్ముకున్నా సరిగ్గ పైసలు రాక నష్టపోతున్నం’’ 
- రాములు, పోచారం గ్రామం, నిజామాబాద్ జిల్లా
 
 మూడు పశువులనూ అమ్ముకున్నా..
 ‘‘నాకు నాలుగు గేదెలుండేవి. మేపడానికి గడ్డి లేదు. పాడి కోసం ఒక గేదెను ఉంచుకుని మూడు గేదెలను అమ్ముకున్నా. ఇగ ఉన్న 50 గొర్రెలను కూడా మేపడానికి గడ్డి దొరకక బేరం పెట్టాను. నాలాగే గ్రామంలో చాలా మంది రైతులు పశువులను సాకలేక అమ్ముకుంటున్నారు. కొందరు నష్టాలకు గేదెలను అమ్ముకోలేక కష్టనష్టాలకోర్చి సాదుకుంటున్నారు..’’                
  - పి.దుర్గయ్య, రైతు, రేవూరు, మేళ్లచెర్వు మండలం నల్లగొండ జిల్లా
 
 ఎనిమిది బోర్లు వేసినా.. చుక్క నీరు రాలే

 ఈయన నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండలం రెంజర్ల గ్రామానికి చెందిన రైతు బుల్లెట్ రాంరెడ్డి. తన 10 ఎకరాల్లో ఐదెకరాలు పసుపు పంట, రెండెకరాల్లో మొక్కజొన్న, మూడెకరాల్లో సోయా పంటలు వేశాడు. పంటలను కాపాడుకోవడానికి ఎన్నో కష్టాలు పడ్డాడు, సుమారు రూ. 2.5 లక్షలు ఖర్చు చేశాడు. రెండు నెలల వ్యవధిలో 8 బోరు బావులు, ఒక ఊట బావి తవ్వించాడు. అయినా చుక్క నీరు రాలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement