- ప్రాణ హిత- చేవెళ్ల ప్రాజెక్టు కుదింపు యత్నం
- పక్కజిల్లాల వరకే పరిమితం
- ప్రత్యామ్నాయంగా జూరాల నుంచి కృష్ణాజలాలు
- మూడో దశలో మన జిల్లాకు సాగునీరు
- రూ.32వేల కోట్ల అంచనా వ్యయం
- ప్రాజెక్టు కార్యరూపం దాల్చడానికి దశాబ్ధకాలం
అన్నదాతలకు ఆదరువు అవుతుందనుకున్న
‘ప్రాణహిత-చేవెళ్ల’ ప్రాజెక్టు కథ.. కంచికి చేరుతుంది. నెర్రెలు విచ్చుకున్న నేలలను సస్యశ్యామలం చేసి హరితతోరణం సృష్టిస్తుందని భావించిన ప్రాజెక్టును రాష్ట్ర
ప్రభుత్వం కుదించే యత్నం చేస్తోంది. గోదావరి
జలాలను రంగారెడ్డి జిల్లాకు తరలించాలని కలలుగన్న జనహృదయ నేత, స్వర్గీయ డాక్టర్ రాజశేఖరరెడ్డి ఆశయానికి గండికొడుతూ.. ప్రాజెక్టులో అటు ప్రాణహిత.. ఇటు చేవెళ్లకు కోత పెట్టడం ద్వారా ైరె తాంగం ఆశలపై నీళ్లు జల్లుతోంది. ఈ బహుళార్థ సాధక ప్రాజెక్టుతో హరితవిప్లవం ఖాయమని భావించిన కర్షకులను ‘పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల’ పథకంతో ఏమారుస్తోంది.
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి :భూగర్భజలాలపై ఆధారపడుతున్న తెలంగాణ జిల్లాలో హరితసిరులు పండించాలనే సంకల్పంతో ప్రాణహితకు డిజైన్ చేసిన ప్రభుత్వం.. ప్రాజెక్టు నిర్మాణానికి రూ.38,500 కోట్లు అవసరమవుతాయని అంచనా వేసింది. దీంట్లో భాగంగా రంగారెడ్డి జిల్లాలో రూ.1.40 లక్షల ఆయకట్టును స్థిరీకరించవచ్చని అంచనా వేయడమేకాకుండా.. పంప్‌హౌజ్, సొరంగం, భూసేకరణ, ఇతర పనులకు రూ.1,500 కో ట్లను కూడా ఖర్చు చేసింది.
అయితే, ప్రస్తుతం కేసీఆర్ సర్కారు చేవెళ్ల- ప్రాణహిత ప్రాజెక్టు డిజైన్‌ను మార్చాలని నిర్ణయం తీసుకుంది. ఆదిలాబాద్ నుంచి చేవెళ్లకు గోదారి నీటిని తరలించడం భగీరథ ప్రయత్నమే అవుతుందని భావిస్తున్న సర్కారు ప్రాజెక్టును పక్క జిల్లాల వరకే పరిమితం చేసి రంగారెడ్డిని తప్పించే యత్నం చేస్తోంది. ప్రాణహితకు ప్రత్యామ్నాయంగా పక్కనే ఉన్న జూరాల నుంచి కృష్ణా జలాలను ఎత్తిపోతల ద్వారా తీసుకొచ్చి జిల్లాలోని బీడు భూములను సాగులోకి తీసుకురావడం ఉత్తమమనే నిర్ణయానికి వచ్చింది.
ఇప్పట్లో కష్టమే..!
‘పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల’ పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది. వరద సమయాల్లో వృధాగా పోతున్న 70 టీఎంసీల నీటిని వినియోగించుకోవడం ద్వారా కృష్ణా బేసిన్‌లోని రంగారెడ్డి, మహబూబ్‌నగర్, నల్గొండ జిల్లాలో దాదాపు 10 లక్షల ఎకరాలు.. అందులో రంగారెడ్డి జిల్లాలో 2.70 లక్షల ఎకరాలకు సస్యశ్యామలం చేయవచ్చని అంచనా వేసింది. అయితే, నిర్మాణ వ్యయం తడిసిమోపెడు కానుండడం.. ముంపు బారిన పడే గ్రామాల సంఖ్య గణనీయంగా ఉండడంతో పునరాలోచనలో పడింది.
తొలిదశలో జూరాల నుంచి కోయిల్‌కొండ వరకు కృష్ణా జలాలను తీసుకురావాలనే ప్రతిపాదనపై ఇంజినీరింగ్ నిపుణుల నుంచే వ్యతిరేకత వ్యక్తమవుతోంది. రూ.32 వేల కోట్లు ఖర్చుచేసి కేవలం రిజర్వాయర్లలో నీటిని నింపుకోవడం వల్ల ప్రయోజనం ఏమిటని.. ఆయకట్టు స్థిరీకరణ జరిగితే తప్ప ప్రాజెక్టు లక్ష్యం నెరవేరదని అంటున్నారు.
భారీ వ్యయంతో కూడిన ఈ ప్రాజెక్టు మొదటి రెండు దశలు దాటి మూడో దశలో పనులు కార్యరూపం దాల్చాలంటే దాదాపు దశాబ్ధకాలం పట్టే అవకాశం ఉందని విశ్లేషిస్తున్న నిపుణులు.. రంగారెడ్డి జిల్లాకు ఇప్పట్లో జూరాల జ లాలు రావడం కల్లేనని వ్యాఖ్యానిస్తున్నారు.
గోదారికి రాంరాం.. జూరాలకు సలాం!
Published Sun, Apr 19 2015 12:03 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM
Advertisement
Advertisement