పాతాళానికి భూగర్భ జలాలు
రాష్ట్రంలో సగటున 2.69 మీ. లోతుకు పడిపోయిన జలాలు
రాష్ట్రంలో కరువు పరిస్థితులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో భూగర్భ జలాలు మరింత అడుగంటాయి. ఈ ఏడాది నవంబర్ నెలకు సంబంధించి తాజా లెక్కలను వ్యవసాయశాఖ బుధవారం వెల్లడించింది. గత ఏడాది నవంబర్ నెలలో తెలంగాణలో సగటున భూ ఉపరితలం నుంచి 9.70 మీటర్ల లోతుల్లో భూగర్భ జలాలు లభిస్తే... ఈ ఏడాది నవంబర్‌లో ఏకంగా 12.39 లోతుల్లోకి వెళ్లాయి. అంటే గతంతో పోలిస్తే 2.69 మీటర్ల లోతుల్లోకి దిగిపోయాయి. నిజామాబాద్ జిల్లాలో గత ఏడాది నవంబర్‌లో 10.23 మీటర్ల లోతుల్లో జలాలు లభించగా... ఈ నవంబర్‌లో 16.96 మీటర్ల లోతుల్లోకి కూరుకుపోయాయి. ఏకంగా 6.73 మీటర్లు అదనపు లోతుల్లోకి వెళ్లాయి. మెదక్ జిల్లాలో గత ఏడాది 15.57 మీటర్ల లోతుల్లో జలాలు లభిస్తే... ఈ నవంబర్‌లో 21.53 మీటర్లకు పడిపోయాయి. ఏ ఒక్క జిల్లాలోనూ భూగర్భ జలాలు పైకి వచ్చిన దాఖలాలు లేవు.
రబీలో 75 శాతం లోటు వర్షపాతం..
రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర వర్షాభావం కారణంగానే భూగర్భ జలాలు అడుగంటాయి. రబీ సీజన్‌లో తెలంగాణలో ఏకంగా 75 శాతం లోటు వర్షపాతం నమోదైంది. రబీ సీజన్‌లో ఇప్పటివరకు సహజంగా 128 మిల్లీమీటర్ల (ఎం.ఎం.) వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా... కేవలం 32 ఎం.ఎం.లే నమోదైంది. రాష్ట్రంలోని ప్రధాన జలాశయాల్లో గత ఏడాది డిసెంబర్ 16వ తేదీన 468.42 టీఎంసీల నీరు నిల్వ ఉండగా... ఈ బుధవారం నాటికి కేవలం 326.12 టీఎంసీలే నిల్వ ఉన్నాయి.
ఒక్క శాతానికి పరిమితమైన వరి నాట్లు...
తీవ్రమైన వర్షాభావం ఫలితంగా పంటల సాగు దారుణంగా పడిపోయింది. అన్ని పంటల సాగు కేవలం 26 శాతానికే పరిమితమైంది. రాష్ట్రవ్యాప్తంగా రబీలో సాధారణంగా 31.32 లక్షల ఎకరాల్లో పంటల సాగు జరగాల్సి ఉండగా... కేవలం 8.22 లక్షల ఎకరాల్లో (26%) మాత్రమే సాగు జరిగింది. అందులో ఆహారధాన్యాల సాగు 25.20 లక్షల ఎకరాల్లో జరగాల్సి ఉండగా... కేవలం 4.97 లక్షల ఎకరాల్లోనే జరిగింది. ఆహారధాన్యాల్లో కీలకమైన వరి నాట్లు కేవలం ఒకే ఒక్క శాతానికే పరిమితమయ్యాయి.